సాక్షి, విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో శుక్రవారం చర్చలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు. నేటితో సమస్యకి పరిష్కారం ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు.
23 ఫిట్‌మెంట్ తర్వాత ఉద్యోగుల జీతాల నుంచి రికవరీపై అభ్యంతరాలు వ్యక్తంచేశారని అన్నారు. ఎచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. సీఎం వైఎస్ జగన్ దృష్టికి శుక్రవారంనాటి చర్చల అంశాలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తాం: పేర్ని నాని
ఉద్యోగాల సంఘాల సమస్యలకు శనివారం రోజు మధ్యాహ్నం జరిగే సమావేశంలో పరిష్కారం వస్తుందని భావిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచీ ఉద్యోగులకు మేలు చేస్తామని చెబుతున్నారని తెలిపారు. అందుకే మంత్రుల కమిటీ కూడా వేశారని గుర్తుచేశారు.
శుక్రవారంనాడు సానుకూలంగా చర్చలు జరిగాయని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో పరిష్కారం వస్తుందని, ఉద్యోగులకు నష్టం జరిగేలా తాము ఏ పని చేయమని అన్నారు. సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని కారణంగా కొంత ఇబ్బంది వచ్చిందని, హెచ్ఆర్ఏ సమస్య పరిష్కారం లభిస్తుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment