లక్ష ఎకరాలు ఎందుకో చెప్పండి
- ‘ఏపీ రాజధాని - భూ సేకరణ’పై జన చైతన్య వేదిక
- ముఖాముఖిలో మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
- రాజధాని నిర్మాణానికి రూ.1.10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?
- విచ్చలవిడి అవినీతితో సింగపూర్‌లాంటి రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం?
- కేంద్ర ఎంత ఎక్కువ ఇచ్చినా రూ. 20 వేల కోట్లకు మించి రాదు
- కేంద్రం వేటికి నిధులిస్తుందో విభజన బిల్లులోనే చెప్పింది
- విజయవాడ, విశాఖ సమీపంలో భూసేకర సమయంలో ఇచ్చిన దానికంటే ఇప్పుడు తక్కువ ఇస్తున్నారని రైతులు భావిస్తున్నారు
- లక్ష ఎకరాలు సేకరిస్తే మరో 2 లక్షల ఎకరాలపై ప్రభావం: లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు ఎందుకో ప్రభుత్వం చెప్పాలని రాష్ట్ర మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. మంచి విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ సేకరణ విషయంలో తప్పుడు దారిలో వెళ్తున్నారని అన్నారు. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని - భూ సేకరణ’ అనే అంశంపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘‘రూ.1.10 లక్షల కోట్లతో ప్రపంచస్థాయి రాజధాని నగరం నిర్మిస్తామని సీఎం, మంత్రులు చెబుతున్నారు. సింగపూర్‌ను మించిన అభివృద్ధి చేస్తామంటున్నారు. ఆ నిధులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలి. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. అలాంటప్పుడు సింగపూర్‌లాంటి రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం’’ అని ప్రశ్నించారు. ‘‘మలేసియా దేశ రాజధాని జయపుత్ర, గుజరాత్ రాజధాని గాంధీనగర్ నిర్మాణానికి 12 వేల ఎకరాలు చొప్పున సేకరించారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌కు 20 వేల ఎకరాలు మాత్రమే సేకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి లక్ష ఎకరాల భూమి అవసరమా? రాజధానుల నిర్మాణానికి ఉత్తరాఖండ్‌కు రూ. 436 కోట్లు, జార్ఖండ్‌కు రూ. 800 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ. 580 కోట్లు మాత్రమే కేంద్రం సహాయం చేసింది. కేంద్రం వేటికి నిధులిస్తుందో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే తెలిపింది. నూతన రాష్ట్రానికి రాజ్‌భవన్, హైకోర్టు, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, శాసన సభ్యులు, అధికారుల నివాస సముదాయములకే ఆర్థిక సహాయం చేస్తామని అందుఓ పేర్కొంది. మిగిలిన రాష్ట్రాలకంటే మన రాష్ట్రానికి కేంద్రం ఎంత ఎక్కువ ఇచ్చినా రూ. 20 వేల కోట్లుకు మించి ఆర్థిక సహకారం లభించదు. మిగిలిన రూ.80 వేల కోట్లకు పైగా నిధులు ఎక్కడి నుంచి తెస్తారో వెల్లడించాలి’’ అని వడ్డే అన్నారు.
‘‘రాజధానికి భూములివ్వకపోతే భూ సేకరణ చట్టాన్ని ఉపయోగించి లాక్కుంటామనే రీతిలో రైతులను హెచ్చరిస్తున్నారు. అయితే బహుళ పంటలు పండే భూమిని సేకరించకూడదని చట్టంలోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం భూ సేకరణ కాకుండా భూ సమీకరణ పద్ధతిలోనే ముందుకెళ్లాలి. కొంతకాలం కిందట విజయవాడ నగర సమీపంలో జక్కంపూడి వద్ద, విశాఖపట్నం నగరానికి దగ్గరలో కొంత భూమిని భూ సమీకరణ పద్ధతిలో ప్రభుత్వం సేకరించింది. ఇందులో రైతులకు ఎకరానికి 1,800 చ.గ.లు ఇచ్చింది. రహదారులకు, 1,800 చ.గ. కేటాయించి, 1,240 చ.గ. ప్రభుత్వం ఉంచుకొంది.
ఇప్పుడు తుళ్లూరు ప్రాంతంలో రాజధానికి భూ సమీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 1,000 చ.గ.ల నివాస స్థలం, 100 నుండి 200 చ.గ.ల వాణిజ్య స్థలం ఇస్తామని ప్రతిపాదిస్తోంది. విజయవాడ, విశాఖపట్నం సమీపంలో భూ సమీకరణకన్నా ఇక్కడ తక్కువ వస్తుందన్న అభిప్రాయం రైతుల్లో నెలకొంది’’ అని వివరించారు. రాజధాని నిర్మాణానికి భూములు సేకరిస్తున్న తుళ్లూరు మండలం కొండవీటి వాగు వరదలకు మునిగిపోతుందని తెలిపారు.
వాగు పరీవాహక ప్రాంతం నుండి ఎక్కువ పరిమాణంలో వచ్చే నీటిని నిల్వ చేసేందుకు రెండు రిజర్వాయర్లను వెంటనే నిర్మిస్తేనే మనుగడ ఉంటుందని, లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాజధాని కోసం లక్ష ఎకరాలు సేకరిస్తే మరో రెండు లక్షల ఎకరాలపై వాటి ప్రభావం ఉంటుందని చెప్పారు. అందువల్ల సాగు భూములను సేకరించొద్దని సూచించారు. ఒకే ప్రాంతంలో కాకుండా 13 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు అక్కడక్కడ రాష్ట్రస్థాయి ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని సూచించారు.