భూ సేకరణపై రగులుతున్న రైతులు
ప్రభుత్వం నుంచి కనిపించని ముప్పు పొంచి ఉందన్న అనుమానాలు
అగ్నికి ఆజ్యం పోసిన ముఖ్యమంత్రి బెదిరింపులు
సంఘటితమవుతున్న విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అన్నదాతలు
గ్రామాల్లో సమావేశాలు.. ప్రభుత్వ ప్రకటనలపై మంతనాలు
విజయవాడ, పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములపై ఎందుకు మాట్లాడరంటూ ఆగ్రహం
తమ భూములతో వ్యాపారం చేస్తామంటే అంగీకరించబోమన్న అన్నదాతలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కోసం భూ సేకరణ విషయంలో సర్కారు తీరుపై రైతులు మండిపడుతున్నారు. రాజధాని ఎక్కడో, ఎంత భూమి కావాలో ప్రభుత్వం ఇంకా స్పష్టంగా తేల్చలేదు. భూసేకరణపై రోజుకో రకమైన ప్రకటన చేస్తోంది. ‘నేను రాజధాని ప్రకటించబట్టే భూములకు ఈ ధరలు వచ్చాయి. సహకరిస్తే సరేసరి, లేకుంటే చట్టం తెస్తాం’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయి. దీంతో ప్రభుత్వం నుంచి కనిపించని ముప్పేదో పొంచి ఉందని రైతులు అనుమానిస్తున్నారు. ఒక గొడుగు కిందకు చేరుతున్నారు.
ఇప్పటికే విజయవాడ పరిసర గ్రామాల్లోని రైతులు పలుమార్లు సమావేశాలు నిర్వహించి నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయకపోతే భూములిచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. వీరికి రైతు సంఘాలూ మద్దతిస్తున్నాయి. ‘ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబునాయుడు లక్ష కోట్ల రూపాయల హామీ ఇచ్చారు. 70 శాతం రైతుల ఓట్లేయించుకున్నారు. పదవి కోసం లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెచ్చించేందుకు ముందుకు వచ్చిన వ్యక్తి.. తాతముత్తాతల నాటి స్వార్జితాన్ని వదులుకునేందుకు సిద్ధపడే రైతులకు లక్ష కోట్లు ఇచ్చినా తక్కువే. భావితరాల కోసం మేము చేసే త్యాగానికి (భూమి ఇచ్చి) సరైన విలువ కట్టమంటే బెదిరిస్తున్నారు. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనజాలదు’’ అని విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన రైతు సమాఖ్య నాయకుడు ఎం.శేషగిరిరావు హెచ్చరించారు.
‘న్యాయమైన’ అంటే రిజిస్ట్రేషన్ విలువ కాదు
‘‘భూ సమీకరణ అనేది స్వచ్ఛందం. దీనికేమీ చట్టం లేదు. మిగతా రాష్ట్రాల్లో పరిస్థితికి, విజయవాడ ప్రాంతానికి చాలా తేడా ఉంది. నయా రాయపూర్, చండీగఢ్ అనుభవాలు వేరు. విజయవాడ ప్రాంతంలో ఉన్నవన్నీ సారవంతమైన పంట భూములే. వీటితో వ్యాపారం చేస్తామంటే ఎలా’’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన, సమంజసమైన ధరకు భూమిని తీసుకోవాలని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. న్యాయమైన అంటే మార్కెట్ రేటు. కానీ ప్రభుత్వాలు మాత్రం రిజిస్ట్రేషన్ విలువకు భూముల్ని లాక్కుంటున్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. అయినా భూ సేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే న్యాయపోరాటానికి దిగాలని ఇప్పటికే రైతులు తీర్మానించుకున్నారు. ‘‘ఒక్కసారి ఎంపీగానో, ఎమ్మెల్యేగానో ఎన్నికైన వ్యక్తికి జీవితాంతం పింఛన్ ఇస్తున్నారు. అటువంటిది తరతరాలుగా వస్తున్న వారసత్వ భూమిని వదులుకుంటున్న మాకు బతుకు భరోసా ఎందుకివ్వరు? మాకు న్యాయమైన రేటు ఇవ్వాలి’’ అన్నది రైతుల ప్రధాన డిమాండ్.
ప్రభుత్వం పైసా పెట్టుబడి పెట్టకుండా తమ భూములతో వ్యాపారం చేయడాన్ని అంగీకరించడంలేదు. తమ భూమితో ఇతర దేశాల రియల్టర్లు వ్యాపారం చేయడానికి అనుమతించబోమని చెబుతున్నారు. న్యాయమైన ప్రాతిపదికపై సహకారానికైతే సరే అంటామనీ బలవంతంగా లాక్కుంటే సహించబోమని, రాజ్యాంగం కల్పించిన అన్ని హక్కుల్నీ ఉపయోగించుకుంటామని హెచ్చరిస్తున్నారు. అధికారంలో ఉన్న కొందరు పార్టీ పేరిట రైతుల్లో చీలిక తెచ్చే ప్రమాదాన్ని పసిగట్టిన రైతు నేతలు దానివల్ల జరిగే నష్టాల్నీ అన్నదాతలకు వివరిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రాజధాని కోసం భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారో లేదో అభిప్రాయసేకరణకు సిద్ధమవుతున్నారు.
లక్ష ఎకరాలు అవసరమా?
అసలు రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు ఎందుకని సామాజిక శాస్త్రవేత్తలు, రైతు ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు. 15 నుంచి 20 వేల ఎకరాల్లో నూతన రాజధానిని నిర్మించుకోవచ్చని శివరామకృష్ణన్ కమిటీ వెల్లడించింది. ఈ మేరకైతే ప్రైవేటు భూమి అవసరం ఉండదు. విజయవాడ సమీపంలోని నూజివీడు ప్రాంతంలో 23 వేల ఎకరాల అటవీ భూములున్నాయి. సచివాలయానికి విజయవాడ నగరం నడిబొడ్డున బందరు రోడ్డులోనే 500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. నున్న-వెలగలేరు మధ్య 5 వేల ఎకరాలు, నాగార్జున యూనివర్సిటీ ప్రాంతంలో 3 వేల ఎకరాలు, అమరావతి వద్ద 10 వేల ఎకరాలకు పైగా ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, వీటిలో అద్భుత రాజధాని కట్టొచ్చని చెబుతున్నారు.
ఈ భూములను పక్కనపెట్టి, రైతుల నుంచి లక్ష ఎకరాలు సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై మండిపడుతున్నారు. భూ సేకరణ చట్టం ప్రకారం నూటికి 80 శాతం మంది రైతులు వ్యతిరేకిస్తే భూసేకరణ వీలు కాదు. ఈమేరకు సుప్రీంకోర్టు తీర్పూ ఉంది. అలాగే నష్టపరిహారంపైనా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. 60 ః 40 నిష్పత్తిలో భూ సమీకరణకు ఇష్టపడితే రైతులు భూమినిచ్చి, ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే వాటా కోసం ఎదురుచూడాలి. అది ఎక్కడ, ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. ఇంత చేసినా రైతుకు ఎకరాకు దక్కేది వేయి గజాలు మాత్రమే. ఈ స్థలానికే ఐదారు కోట్లు వస్తాయని ప్రభుత్వం చెబుతున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని రైతులు అంటున్నారు. ‘‘ఇంత పరిహారం కావాలని మేము కోరుకోవడంలేదు. ఎకరాకు కోటి రూపాయలు ఇచ్చి ఏకమొత్తంగానే ప్రభుత్వం తీసుకోవచ్చు’’ అని చెబుతున్నారు శేషగిరిరావు. ఆమేరకు రైతుల్ని ఒప్పించే బాధ్యత కూడా తామే తీసుకుంటామన్నది ఆయన మాట.