సాక్షి, అమరావతి బ్యూరో: రాజధానిలో భూ సేకరణ పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు మండలాల్లో 1,019 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం శుక్రవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళగిరి మండలంలోని నవులూరు–1, నవులూరు–2లో 153.3458 ఎకరాలు, కురగల్లులో 107.1852 ఎకరాలు, తాడేపల్లి మండలంలోని పెనుమాకలో 628.9255 ఎకరాలు, తుళ్లూరు మండలంలోని లింగాయపాలెంలో 98.0575 ఎకరాలు, కొండమరాజుపాలెంలో 32.2350 ఎకరాలు సేకరించనున్నట్లు అందులో పేర్కొంది. రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కింద మొత్తం 1,019.749 ఎకరాలు సేకరిస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల 1,061 కుటుంబాలు ప్రభావితం అవుతాయని వెల్లడించారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు..
ఏటా మూడు పంటలు పండే భూములను గుంజుకోవద్దని వేడుకుంటున్నా లెక్కచేయకుండా ప్రభుత్వం భూసేకరణకు సిద్ధమవడంపై ఆయా గ్రామాల్లోని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం వల్ల స్థానికులు జీవనోపాధి కోల్పోతారని, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడంపై రైతులు మండిపడ్డారు. కోర్టులో విచారణ జరుగుతున్నా నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెనుమాకకు చెందిన రైతు దంటు బాలాజీ మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ప్రిలిమినరీ భూసేకరణ నోటిఫికేషన్‌పై మేము కోర్టును ఆశ్రయించాం. మేము వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సమాధానమివ్వకుండా, కోర్టుకు సమాచారం ఇవ్వకుండా తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయకూడదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 10 కింద బహుళ పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం కోసం తీసుకోకూడదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అది కూడా పెండింగ్‌లోనే ఉంది. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా భూ సేకరణకు తుది నోటిఫికేషన్ విడుదల చేయడం దారుణం. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment