సాక్షి, విశాఖపట్నం: ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. మరో వైపు ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఈపీడీసీఎల్ నూతన పంథాలో వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చడానికి సన్నద్ధమవుతోంది. దీని ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
బకాయిల బెడదకు చెక్ పెట్టడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.దీని కోసం యాప్ డౌన్‌లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లులను మొబైల్ రీచార్జ్‌లా ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితోపాటు విద్యుత్ చెల్లింపు కేంద్రాల్లో కూడా రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. మరో నెల రోజుల్లో జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంగం సిద్ధం చేసింది.
నష్టాల నుంచి గట్టెక్కే బాటలో..
ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దాని వల్ల డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. కోట్లాది రూపాయుల బాకాయిలతో ఈపీడీసీఎల్ నష్టాల్లో ఉంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. వినియోగదారులు కూడా సమర్థవంతంగా విద్యుత్ వాడుకునేందుకు వీలవుతుంది.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ..
అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటీవల ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ, ఏలూరులో ఏపీఈఆర్‌సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా నిపుణులు ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలుబకాయిలపై దృష్టి సారించాలని, సామాన్య వినియోగదారుల బాకాయిల విషయంలో అధికారుల కఠినంగా వ్యవహరిస్తున్నా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు విషయంలో ఆ దూకుడు ప్రదర్శంచడం లేదని స్పష్టం చేసింది. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపింది.
500 యూనిట్లు వినియోగం దాటిన వారికి...
•జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు.
•ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టారిఫ్ ప్లాన్‌లో భాగంగా 500 యూనిట్లు దాటి వినియోగించుకునే వారు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
•నమోదు చేసుకున్న నెలరోజుల్లో ప్రీపెయిడ్ మీటర్ అమర్చనున్నారు.
రావాల్సిన బకాయిలు ఇలా..
•ప్రస్తుత అంచనాల ప్రకారం ఈపీడీసీఎల్‌కు అన్ని సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.6,356.93కోట్లు ఉంది. ఇందులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3,251 కోట్లు ఉన్నాయి.
•ఇవి కాకుండా వినియోగదారుల నుంచి రూ.1549.11కోట్లు రావాల్సి ఉంది.
•పరిశ్రమల నుంచి 50 శాతం పైగా బకాయిలు ఉన్నాయి.
వెంటాడుతున్న అప్పులు
మరోవైపు విద్యుత్తు కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు కలిసి రూ.10,944.27కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. ఆ బకాయిలకు ఇప్పటిదాకా బ్యాంకులకు చెల్లించిన వడ్డీనే రూ.344.24కోట్లు
అవసరం ఉన్న మేరకే వినియోగం
ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లతో ముందస్తుగా మొబైల్ రీచార్జ్ మాదిరిగానే చేసుకోవచ్చు. అవసరమైన మేరకే విద్యుత్ వినియోగించవచ్చు. దీని వల్ల విద్యుత్‌ను ఆదా చేసుకోవడంతో పాటు పరిమితికి మించి బిల్లుకూడా రావు. రోజువారీ వినియోగించే విద్యుత్ మన పరిధిలోనే ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 500 యూనిట్లకు పైగా వినియోగించే వారు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు.
–నాగలక్ష్మీ సెల్వరాజన్, ఈపీడీసీఎల్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment