prepaid meters
-
ఈఈఎస్ఎల్తో జియోథింగ్స్ ఒప్పందం
న్యూఢిల్లీ: స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు కోసం ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ (ఈఈఎస్ఎల్)తో జియోథింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఫ్రెంచ్ సంస్థ ఈడీఎఫ్‌తో కలిసి బిహార్‌లో తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం సొల్యూషన్ ఆధారిత 10 లక్షల స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయనుంది. తాజా స్మార్ట్ సాంకేతికల వినియోగం ద్వారా విద్యుత్ రంగం లబ్ధి పొందేందుకు తమ స్మార్ట్ యుటిలిటీ ప్లాట్‌ఫాం ఉపయోగపడగలదని జియో ప్లాట్‌ఫామ్స్ సీఈవో కిరణ్ థా మస్ తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ నిర్దేశించుకున్న 25 కోట్ల స్మార్ట్ మీటర్ల లక్ష్య సాకారం దిశగా ఈ ప్రయత్నాలు తోడ్పడగలవని పేర్కొన్నారు. విశ్వసనీయమైన విధంగా శక్తిపరమైన భద్రతను సాధించుకోవడంలో స్మార్ట్ మీటరింగ్ కీలకంగా ఉండగలదని ఈఈఎస్ఎల్ తెలిపింది. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపునకు గడువు
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయేతర విద్యుత్తు వినియోగదారులకు ప్రీపెయిడ్ సౌకర్యం ఉండే స్మార్ట్ మీటర్ల ద్వారా మాత్రమే విద్యుత్తు సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంటూ ఆయా మీటర్ల బిగింపునకు నిర్దిష్ట కాల వ్యవధిని నోటిఫై చేస్తూ కేంద్ర విద్యుత్తు శాఖ గురువారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసింది. 2023 డిసెంబర్ నాటికి గడువు ఉన్న కేటగిరీలు ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు (ఏటీఅండ్‌సీ) 15 శాతానికంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ సౌకర్యం ఉన్న స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► అలాగే 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు 25 శాతం మించిన ఎలక్ట్రికల్ డివిజన్లలో కూడా స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► బ్లాక్ స్థాయి, ఆపైస్థాయి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు అమర్చాలి. ► స్టేట్ రెగ్యులేటరీ కమిషన్ తగిన కారణాలు చూపి ఈ కాలవ్యవధిని రెండుసార్లు మాత్రమే పొడిగించవచ్చు. ఒక్కో విడత ఆరు నెలల కంటే ఎక్కువగా పొడిగింపు ఉండరాదు. ► ఇతర అన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను 2025 మార్చి వరకు అమర్చాలి. ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ► అన్ని ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ సౌకర్యం ఉన్న మీటర్లుగానీ, అడ్వాన్స్డ్ మీటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వసతి ఉన్న మీటర్లు గానీ అమర్చుతారు. 2022 డిసెంబర్ నాటికి ఈ మీటర్లను అమర్చాలి. ► 50 శాతం కంటే ఎక్కువగా వినియోగదారులు పట్టణ ప్రాంతాల్లో ఉండి, 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సాంకేతిక, వాణిజ్య నష్టాలు(ఏటీఅండ్‌సీ) 15 శాతాని కంటే మించిన ఎలక్ట్రిక్ డివిజన్లలోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు, 25 శాతానికి మించి నష్టాలు ఉన్న ఇతర అన్ని ఎలక్ట్రికల్ డివిజన్లలో పాత మీటర్లలో స్థానంలో డిసెంబర్ 2023 నాటికి కొత్తగా మీటర్లు అమర్చాలి. ఇతర ప్రాంతాల్లో 2025 మార్చి నాటికి మీటర్లు అమర్చాలి. -
ఇక ప్రీపెయిడ్ మీటర్లు!
సాక్షి, విశాఖపట్నం: ప్రతి నెలా కరెంట్ బిల్లులు వసూలు చేయడం విద్యుత్ శాఖకు సవాల్‌గా మారింది. మరో వైపు ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సెక్టార్‌కు సంబంధించి బకాయిలు కోట్లలో పేరుకుపోతున్నాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితి నుంచి గట్టెక్కడానికి ఈపీడీసీఎల్ నూతన పంథాలో వెళ్లడానికి సన్నాహాలు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే నెలరోజుల్లో ప్రయోగాత్మకంగా ప్రీపెయిడ్ మీటర్లు అమర్చడానికి సన్నద్ధమవుతోంది. దీని ద్వారా బకాయిలకు తావులేకుండా ముందుకు సాగాలని యోచిస్తున్నారు. ఇదీ పరిస్థితి బకాయిల బెడదకు చెక్ పెట్టడానికి విద్యుత్ శాఖ అధికారులు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.దీని కోసం యాప్ డౌన్లోడ్ చేసుకుని విద్యుత్ బిల్లులను మొబైల్ రీచార్జ్‌లా ముందుగానే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటితోపాటు విద్యుత్ చెల్లింపు కేంద్రాల్లో కూడా రీచార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నారు. మరో నెల రోజుల్లో జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేసేందుకు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రంగం సిద్ధం చేసింది. నష్టాల నుంచి గట్టెక్కే బాటలో.. ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల వల్ల చాలా చోట్ల బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతోంది. దాని వల్ల డిస్కంలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాయి. కోట్లాది రూపాయుల బాకాయిలతో ఈపీడీసీఎల్ నష్టాల్లో ఉంది. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు వస్తే ఆ సమస్యలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. వినియోగదారులు కూడా సమర్థవంతంగా విద్యుత్ వాడుకునేందుకు వీలవుతుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో .. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇటీవల ఈపీడీసీఎల్ పరిధిలో విశాఖ, ఏలూరులో ఏపీఈఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో కూడా నిపుణులు ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలుబకాయిలపై దృష్టి సారించాలని, సామాన్య వినియోగదారుల బాకాయిల విషయంలో అధికారుల కఠినంగా వ్యవహరిస్తున్నా పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు విషయంలో ఆ దూకుడు ప్రదర్శంచడం లేదని స్పష్టం చేసింది. వాటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు మొగ్గు చూపింది. 500 యూనిట్లు వినియోగం దాటిన వారికి... •జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. •ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త టారిఫ్ ప్లాన్‌లో భాగంగా 500 యూనిట్లు దాటి వినియోగించుకునే వారు ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. •నమోదు చేసుకున్న నెలరోజుల్లో ప్రీపెయిడ్ మీటర్ అమర్చనున్నారు. రావాల్సిన బకాయిలు ఇలా.. •ప్రస్తుత అంచనాల ప్రకారం ఈపీడీసీఎల్‌కు అన్ని సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.6,356.93కోట్లు ఉంది. ఇందులో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.3,251 కోట్లు ఉన్నాయి. •ఇవి కాకుండా వినియోగదారుల నుంచి రూ.1549.11కోట్లు రావాల్సి ఉంది. •పరిశ్రమల నుంచి 50 శాతం పైగా బకాయిలు ఉన్నాయి. వెంటాడుతున్న అప్పులు మరోవైపు విద్యుత్తు కొనుగోళ్లు, బ్యాంకు రుణాలు కలిసి రూ.10,944.27కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. ఆ బకాయిలకు ఇప్పటిదాకా బ్యాంకులకు చెల్లించిన వడ్డీనే రూ.344.24కోట్లు అవసరం ఉన్న మేరకే వినియోగం ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లతో ముందస్తుగా మొబైల్ రీచార్జ్ మాదిరిగానే చేసుకోవచ్చు. అవసరమైన మేరకే విద్యుత్ వినియోగించవచ్చు. దీని వల్ల విద్యుత్‌ను ఆదా చేసుకోవడంతో పాటు పరిమితికి మించి బిల్లుకూడా రావు. రోజువారీ వినియోగించే విద్యుత్ మన పరిధిలోనే ఉంటుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 500 యూనిట్లకు పైగా వినియోగించే వారు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. –నాగలక్ష్మీ సెల్వరాజన్, ఈపీడీసీఎల్ సీఎండీ -
ఇక దేశమంతా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019, ఏప్రిల్ 1 నుంచి మూడేళ్లలోపు దేశమంతటా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చాలని యోచిస్తోంది. ప్రీపెయిడ్ మీటర్లతో పేదలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం వినియోగదారులు వాడకంతో సంబంధం లేకుండా ప్రతీ నెలా బిల్లును చెల్లించాల్సి వస్తోందన్నారు. కొత్త విధానంలో విద్యుత్ మీటర్లను మొబైల్ ఫోన్ల తరహాలో రీచార్జ్ చేయొచ్చు. దీంతో విద్యుత్ ఆదా అవుతుందనీ, సామాన్యులకు అదనపు భారం తప్పుతుందని చెప్పారు. విద్యుత్ సరఫరా నష్టాలు, బిల్లుల ఎగవేతలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అలాగే స్మార్ట్ మీటర్ల కారణంగా నైపుణ్యమున్న యువతకు ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. -
పైసలుంటేనే పవర్!
నల్లగొండ : పైసలుంటేనే పవర్. లేదంటే చీమ్మ చీకట్లే. ఇకనుంచి విద్యుత్‌శాఖ కొత్త విధానాలను అవలంబించబోతుంది. నెలంతా విద్యుత్ సరఫరా చేసిన తదుపరే వినియోగదారులు వాడుకున్న దానికి సంబంధించి బిల్లు వసూలు చేస్తుండేవారు. కానీ కొత్త విధానాలకు శ్రీకారం చుట్టింది. ఇకనుంచి ముందు పైసలు చెల్లిస్తేనే కరెంట్ ఇస్తారు. లేదంటే చీకట్లో ఉండాల్సిందే. అందులో భాగంగానే మొదటి విడతగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్‌మీటర్లను అమర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ విషయంలో మొదటినుంచి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వ కార్యాలయాల్లో బకాయిలు భారీ ఎత్తున పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపులో ఆయా శాఖల్లో అధికారుల మధ్య సమన్వయ లోపం ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యుత్‌శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు పెడితే బకాయిల భారం నుంచి తప్పించుకోవచ్చని భావించి వెంటనే బిగించాలని నిర్ణయించింది. మొదటి విడతగా కొన్ని మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల్లో మీటర్లు బిగిస్తున్నారు. అతి ఎక్కువగా బకాయిలు గ్రామ పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా రూ.18,419.03 లక్షలు బకాయి పడ్డాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలతోపాటు జిల్లా వ్యాప్తంగా 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సంబంధించి రూ.192.48 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో మొదటి విడత పూర్తి కావస్తుండగా, నల్లగొండ జిల్లాలో మాత్రం అలస్యమవుతోంది. విద్యుత్ చౌర్యానికి చెక్.. కొందరు వినియోగదారులు మీటర్లో వైర్లు పెట్టి విద్యుత్‌చౌర్యానికి పాల్పడుతున్నారు. దాంతో దొడ్డి దారిన విద్యుత్ వాడుకొని బిల్లు తప్పించుకుంటున్నారు. అ«ధికారులు మాత్రం డిమాండ్‌కు తగట్లుగా బిల్లులు వసూలు చేస్తున్నారు కానీ, అది ప్రభుత్వ కార్యాలయాలపై మాత్రమే అదనంగా భారం పడే అవకాశం ఉంది. దానిని అరికట్టేం దుకు ప్రీపెయిడ్ మీటర్లు ఎంతగానో దోహదపడుతాయి. గతంలో ముందుగా కరెంటు వాడుకొని నెల తర్వాత మీటర్లలో తిరిగిన యూనిట్ల ఆధారంగా బిల్లును వసూలు చేస్తూ వస్తున్నారు. ఇక నుం చి ప్రీపెయిడ్ మీటర్లతో ముందే నెలకు సరిపడా విద్యుత్‌ను డబ్బులు పెట్టి కొనుకోవాల్సి ఉంది. బకాయిలు బాధలు ఉండవు.. విద్యుత్ అధికారులకు కూడా బకాయిల వసూళ్ల బాధలు కూడా ఉండవు. ముందే ప్రీపెయిడ్ మీటర్లలో చిప్ కొనుకుంటేనే విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో తర్వాత బిల్లు వసూలు అనే పని అధికారులకు ఉండదు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు ముందస్తుగానే వారు వినియోగించే విద్యుత్ కొనుగోలు చేసుకోనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు తిప్పలే... కొన్ని ప్రభుత్వ శాఖలకు నిధులే ఉండవు. విద్యుత్ బిల్లులు సంవత్సరాల తరబడి చెల్లించని శాఖలు కూడా ఉన్నాయి. అలాంటి శాఖలకు ప్రీపెయిడ్ మీటర్లతో తిప్పలు తప్పవు. కచ్చితంగా ఆయా శా ఖాధికారులు ముందస్తుగానే విద్యుత్‌కు సంబం ధించి బిల్లులు అనుమతి కోసం ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రానుంది. వద్దంటున్న కొన్ని శాఖల అధికారులు... కొన్ని ముఖ్యమైన అత్యావసరమైన ప్రభుత్వ శాఖల అధికారులు ప్రీపెయిడ్ మీటర్లను బిగిం చొద్దంటూ విద్యుత్ సిబ్బందికి సూచిస్తున్నారు. దీంతో ఆ కార్యాలయాలకు మీటర్లు బిగించలేకపోతున్నారు. అత్యవసరమైన శాఖలు కావడంతో విద్యుత్ అధికారులు కూడా వారి విషయంలో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. కార్యాలయాల తర్వాత గృహాలకు.. ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి విడతగా ప్రీపెయిడ్ మీటర్లను వినియోగిస్తున్నారు. అ తదుపరి అందులోనే లోటుపాట్లను సరి చేసుకొని గృహాలకు కూడా అమర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటి విడత జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్మీటర్లను బిగిస్తున్నట్లు జిల్లా టాన్స్‌కో ఎస్ఇ కృష్ణయ్య తెలిపారు. మొదటి విడతగా 963 మీటర్లు.. మొదటి విడతగా జిల్లాలో 963 మీటర్లను మంజూరు చేశారు. నెల పదిహేను రోజులనుంచి ఇప్పటి వరకు 483 మీటర్లను ప్రభుత్వ కార్యాలయాల్లో బిగించారు. కార్యక్రమం కొంత ఆలస్యమే అవుతోంది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ శాఖల విద్యుత్ బిల్లుల బకాయిలు రూ.192.48 కోట్లు వ్యవసాయ శాఖ, పశుసంవర్థక శాఖ, బీసీ సంక్షేమ, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ శాఖ, పౌర సరఫరాల తదితర రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని శాఖలకు సంబంధించి విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. -
ఇక ప్రీపెయిడ్ మీటర్లు
నిర్మల్అర్బన్: విద్యుత్ దుర్వినియోగాన్ని నివారించేందుకు, బకాయిలు లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లను వినియోగంలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఈ మీటర్లను పలు ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు, దుకా ణాలు, గృహాలకూ అమర్చుతారు. సెల్ఫోన్లకు ప్రీపెయిడ్ రీచార్జి చేసినట్లే కరెంట్ సరఫరాకు రీచార్జి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి సాధారణ మీటర్ల మాదిరిగానే వినియోగించుకునేలా ఈ మీటర్లను బిగిస్తున్నారు. రీచార్జి ద్వారా వినియోగించుకుంటే విద్యుత్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో రీచార్జి అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కరెంట్‌కు రీచార్జి.. మొబైల్ మాదిరిగానే ఇకపై కరెంట్‌లో కూడా ప్రీపెయిడ్ రీచార్జి విధానం వచ్చింది. ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తూ సంబంధిత శాఖ పెండింగ్ బిల్లులు లేకుండా చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ను వాడుకుని కొందరు బిల్లులు చెల్లించకపోవడంతో ఇన్నాళ్లు బకాయిలు పేరుకుపోయేవి. వీటి వసూలుకు ప్రత్యేకంగా సిబ్బంది తిరగాల్సివచ్చేది. మొండి బకాయిదారులుంటే అలాంటి వారి కనెక్షన్ తొలగించేవారు. పెండింగ్ బిల్లుల వసూలు కోసం విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేది. ఇక విద్యుత్ రీచార్జి మీటర్లు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బంది తొలగనుంది. ముందుగానే ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో వినియోగదారులు గుర్తించి ఆ మేరకు ముందుగానే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 5,400 మీటర్లు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం 5,400 ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లు వచ్చాయి. ఇందులో సింగిల్ ఫేజ్‌వి 4,000, త్రీఫేజ్‌వి 1,400 ఉన్నాయి. ఇప్పటికే ఆయా సబ్స్టేషన్లకు మీటర్లు చేరాయి. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు బిగించాలన్న ఆదేశాలు రావడంతో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను బిగిస్తున్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత ప్రైవేట్, వ్యాపార, గృహ వినియోగదారులకు అమర్చనున్నారు. మొదటి విడతలో భాగంగా ఏజెన్సీ ద్వారా నిర్మల్ జిల్లాలో 50 సింగిల్ ఫేజ్, 30 త్రీఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటివరకు బిగించారు. రెండు విధాలా వినియోగం.. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు రూ.8,500, అలాగే త్రీఫేజ్ మీటర్‌కు రూ.10,800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మీటర్లు బిగించుకున్న వారు రెండు విధాలుగా దానిని వినియోగించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంతో పాటు కొత్తగా వస్తున్న ప్రీపెయిడ్ విధానాన్ని ఆన్, ఆఫ్‌ల బటన్ల ద్వారా సెలక్ట్ చేసుకునే వీలుంది. అయితే ప్రీపెయిడ్ విధానం సెలక్ట్ చేసుకున్న వారికి రీచార్జి పూర్తయిన తర్వాత కూడా అత్యవసరం కోసం (ఎమర్జెన్సీ యూజెస్) అదనంగా 5యూనిట్ల వరకు రీచార్జి ఉంటుంది. రీచార్జి ముగియగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ యూనిట్లను అప్పుగా వాడుకోవచ్చు. అది కూడా పూర్తయితే ఖచ్చితంగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రీపెయిడ్ మీటరు బిగింపునకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారో.. లేదో అన్న పరిశీలన కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్లో బిల్లులు చెల్లించే అవకాశం ఉండడంతో సక్రమంగా బిల్లులు చెల్లించేవారు ప్రీపెయిడ్ మీటర్లను అంగీకరిస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు బిగిస్తున్నాం. ఈ మీటర్లలో ఆన్, ఆఫ్ బటన్ల ద్వారా సాధారణ విద్యుత్ సరఫరాకు, ప్రీపెయిడ్ సరఫరాకు రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు. – ఉత్తమ్, ఎస్ఈ, నిర్మల్ -
ప్రీపెయిడ్ మీటర్లు అమర్చండి
ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలి ఆ మీటర్లు అందుబాటులో లేవంటే కుదరదు ఇరు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశం ఆ మీటర్లు కోరుతున్న వారి నుంచి డిపాజిట్ కోరరాదు తీర్పులో స్పష్టం చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా కోరుకునే హైటెన్షన్(హెచ్‌టీ) వినియోగదారులందరికీ వాటిని అమర్చాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు... వాటిని అమర్చే ప్రక్రియను ఆరునెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటిలోపు విద్యుత్ పంపిణీ సంస్థలు కోరిన అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్లో సగం మొత్తాన్ని చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పిటిషనర్లకు చెల్లించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. మీటర్లు బిగించే సమయంలో తమ నుంచి నిర్దేశిత మొత్తాలను వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇప్పుడు మళ్లీ అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్‌ను కోరుతున్నాయని, ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ పలువురు హెచ్‌టీ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చల్లా గుణరంజన్, డి.నాగార్జునబాబు తదితరులు తమ వాదనలు వినిపిస్తూ, ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నా విద్యుత్ పంపిణీ సంస్థలు తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా అదనపు డిపాజిట్ కోసం డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చని పక్షంలో అటువంటి డిపాజిట్‌ను చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవని, అందువల్లే వాటిని అమర్చలేకపోతున్నామని విద్యుత్ పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చారని, కాబట్టి అవి అందుబాటులో లేవన్న వాదన సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామలింగేశ్వరరావు, విద్యుత్ చట్టంలోని సెక్షన్-47 ప్రకారం వినియోగదారులు ప్రీపెయిడ్ మీటర్ కోరుకుంటే వారి నుంచి డిపాజిట్ కోరడానికి వీల్లేదన్నారు. పలు రాష్ట్రాల్లో ప్రీపెయిడ్ మీటర్ల విధానం అమలవుతున్న నేపథ్యంలో, ఆ మీటర్లు అందుబాటులో లేవన్న వాదన ఆమోదయోగ్యం కాదన్నారు. పంపిణీ సంస్థలు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చని పక్షంలో, వారు కోరుతున్న డిపాజిట్‌ను చెల్లించాల్సిన అవసరం వినియోగదారులకు లేదని తెలిపారు. ఆరునెలల్లో హెచ్‌టీ వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి పంపిణీ సంస్థలను ఆదేశించారు.