ప్రీపెయిడ్ మీటర్లు అమర్చండి
- ఈ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలి
- ఆ మీటర్లు అందుబాటులో లేవంటే కుదరదు
- ఇరు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు హైకోర్టు ఆదేశం
- ఆ మీటర్లు కోరుతున్న వారి నుంచి డిపాజిట్ కోరరాదు
- తీర్పులో స్పష్టం చేసిన జస్టిస్ రామలింగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా విద్యుత్ సరఫరా కోరుకునే హైటెన్షన్(హెచ్‌టీ) వినియోగదారులందరికీ వాటిని అమర్చాలని ఇరు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు... వాటిని అమర్చే ప్రక్రియను ఆరునెలల్లోపు పూర్తి చేయాలని స్పష్టం చేసింది. అప్పటిలోపు విద్యుత్ పంపిణీ సంస్థలు కోరిన అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్‌లో సగం మొత్తాన్ని చెల్లించాలని పిటిషనర్లను ఆదేశించింది. ప్రీపెయిడ్ మీటర్లు అమర్చిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి పిటిషనర్లకు చెల్లించాలని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ మేరకు జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించారు. మీటర్లు బిగించే సమయంలో తమ నుంచి నిర్దేశిత మొత్తాలను వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థలు, ఇప్పుడు మళ్లీ అదనపు విద్యుత్ వినియోగ డిపాజిట్‌ను కోరుతున్నాయని, ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదంటూ పలువురు హెచ్‌టీ వినియోగదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి న్యాయమూర్తి ఎ.రామలింగేశ్వరరావు విచారించారు. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చల్లా గుణరంజన్, డి.నాగార్జునబాబు తదితరులు తమ వాదనలు వినిపిస్తూ, ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని తాము కోరుతున్నా విద్యుత్ పంపిణీ సంస్థలు తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా అదనపు డిపాజిట్ కోసం డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు.
నిబంధనల ప్రకారం ప్రీపెయిడ్ మీటర్లు అమర్చని పక్షంలో అటువంటి డిపాజిట్‌ను చెల్లించాల్సిన అవసరం లేదని వివరించారు. ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో లేవని, అందువల్లే వాటిని అమర్చలేకపోతున్నామని విద్యుత్ పంపిణీ సంస్థల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ ప్రీపెయిడ్ మీటర్లు అమర్చారని, కాబట్టి అవి అందుబాటులో లేవన్న వాదన సరికాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామలింగేశ్వరరావు, విద్యుత్ చట్టంలోని సెక్షన్-47 ప్రకారం వినియోగదారులు ప్రీపెయిడ్ మీటర్ కోరుకుంటే వారి నుంచి డిపాజిట్ కోరడానికి వీల్లేదన్నారు. పలు రాష్ట్రాల్లో ప్రీపెయిడ్ మీటర్ల విధానం అమలవుతున్న నేపథ్యంలో, ఆ మీటర్లు అందుబాటులో లేవన్న వాదన ఆమోదయోగ్యం కాదన్నారు. పంపిణీ సంస్థలు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చని పక్షంలో, వారు కోరుతున్న డిపాజిట్‌ను చెల్లించాల్సిన అవసరం వినియోగదారులకు లేదని తెలిపారు. ఆరునెలల్లో హెచ్‌టీ వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి పంపిణీ సంస్థలను ఆదేశించారు.