ఎస్సీ కార్పొరేషన్ కాంప్లెక్స్‌లోని దుకాణంలో అమర్చిన రీచార్జి కరెంట్ మీటర్
నిర్మల్‌అర్బన్: విద్యుత్ దుర్వినియోగాన్ని నివారించేందుకు, బకాయిలు లేకుండా చూసేందుకు విద్యుత్ శాఖ ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లను వినియోగంలోకి తీసుకువస్తోంది. ఇప్పటికే జిల్లాలో ఈ మీటర్లను పలు ప్రభుత్వ కార్యాలయాలకు బిగించారు. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థలు, దుకా ణాలు, గృహాలకూ అమర్చుతారు. సెల్‌ఫోన్లకు ప్రీపెయిడ్ రీచార్జి చేసినట్లే కరెంట్ సరఫరాకు రీచార్జి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి సాధారణ మీటర్ల మాదిరిగానే వినియోగించుకునేలా ఈ మీటర్లను బిగిస్తున్నారు. రీచార్జి ద్వారా వినియోగించుకుంటే విద్యుత్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో రీచార్జి అయిపోతే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది.
కరెంట్‌కు రీచార్జి..
మొబైల్ మాదిరిగానే ఇకపై కరెంట్‌లో కూడా ప్రీపెయిడ్ రీచార్జి విధానం వచ్చింది. ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తూ సంబంధిత శాఖ పెండింగ్ బిల్లులు లేకుండా చర్యలు చేపడుతోంది. విద్యుత్‌ను వాడుకుని కొందరు బిల్లులు చెల్లించకపోవడంతో ఇన్నాళ్లు బకాయిలు పేరుకుపోయేవి. వీటి వసూలుకు ప్రత్యేకంగా సిబ్బంది తిరగాల్సివచ్చేది. మొండి బకాయిదారులుంటే అలాంటి వారి కనెక్షన్ తొలగించేవారు. పెండింగ్ బిల్లుల వసూలు కోసం విద్యుత్ శాఖ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించేది. ఇక విద్యుత్ రీచార్జి మీటర్లు అందుబాటులోకి రావడంతో ఆ ఇబ్బంది తొలగనుంది. ముందుగానే ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమో వినియోగదారులు గుర్తించి ఆ మేరకు ముందుగానే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో 5,400 మీటర్లు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొత్తం 5,400 ప్రీపెయిడ్ రీచార్జి కరెంట్ మీటర్లు వచ్చాయి. ఇందులో సింగిల్ ఫేజ్‌వి 4,000, త్రీఫేజ్‌వి 1,400 ఉన్నాయి. ఇప్పటికే ఆయా సబ్‌స్టేషన్లకు మీటర్లు చేరాయి. ముందుగా ప్రభుత్వ కార్యాలయాలకు బిగించాలన్న ఆదేశాలు రావడంతో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మీటర్లను బిగిస్తున్నారు. వాటి పనితీరును పరిశీలించిన తరువాత ప్రైవేట్, వ్యాపార, గృహ వినియోగదారులకు అమర్చనున్నారు. మొదటి విడతలో భాగంగా ఏజెన్సీ ద్వారా నిర్మల్ జిల్లాలో 50 సింగిల్ ఫేజ్, 30 త్రీఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటివరకు బిగించారు.
రెండు విధాలా వినియోగం..
సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్‌కు రూ.8,500, అలాగే త్రీఫేజ్ మీటర్‌కు రూ.10,800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మీటర్లు బిగించుకున్న వారు రెండు విధాలుగా దానిని వినియోగించవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న విధానంతో పాటు కొత్తగా వస్తున్న ప్రీపెయిడ్ విధానాన్ని ఆన్, ఆఫ్‌ల బటన్‌ల ద్వారా సెలక్ట్ చేసుకునే వీలుంది. అయితే ప్రీపెయిడ్ విధానం సెలక్ట్ చేసుకున్న వారికి రీచార్జి పూర్తయిన తర్వాత కూడా అత్యవసరం కోసం (ఎమర్జెన్సీ యూజెస్) అదనంగా 5యూనిట్ల వరకు రీచార్జి ఉంటుంది. రీచార్జి ముగియగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పరిస్థితుల్లో ఈ యూనిట్లను అప్పుగా వాడుకోవచ్చు. అది కూడా పూర్తయితే ఖచ్చితంగా రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రీపెయిడ్ మీటరు బిగింపునకు వినియోగదారులు ఆసక్తి కనబరుస్తారో.. లేదో అన్న పరిశీలన కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించే అవకాశం ఉండడంతో సక్రమంగా బిల్లులు చెల్లించేవారు ప్రీపెయిడ్ మీటర్లను అంగీకరిస్తారా? లేదా? అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ కార్యాలయాల్లో బిగిస్తున్నాం
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తొలుత ప్రభుత్వ కార్యాలయాలకు బిగిస్తున్నాం. ఈ మీటర్లలో ఆన్, ఆఫ్ బటన్‌ల ద్వారా సాధారణ విద్యుత్ సరఫరాకు, ప్రీపెయిడ్ సరఫరాకు రెండు విధాలుగా వినియోగించుకోవచ్చు.
– ఉత్తమ్, ఎస్‌ఈ, నిర్మల్
Comments
Please login to add a commentAdd a comment