
హుదూద్..ఎలర్ట్
- తరుముకొస్తున్న తుపానుపై అప్రమత్తం
- తీర మండలాలకు ప్రత్యేకాధికారులు
- 50 గ్రామాల తరలింపునకు సన్నాహాలు
- పునరావాస కేంద్రాల ఏర్పాటు
- రంగంలోకి భద్రతా దళాలు
విశాఖ రూరల్ : హుదూద్ తుపానుపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపడుతోంది. ఆర్మీ, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ ఇతర సహాయక బృందాలను రంగంలోకి దింపుతోంది. కలెక్టరేట్‌లో 1800-4250-0002 టోల్‌ఫ్రీ నెంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. భీమిలి నుంచి పాయకరావుపేట వరకు తీరంలోని 11 మండలాల్లో పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేకాధికారులను నియమించారు.
జిల్లాలో పరిస్థితులను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. తుపాను ఈ నెల 12న జిల్లా తీరాన్ని తాకవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నెల 11న 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముండగా తీరం దాటేరోజున 130 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
50 గ్రామాలు తరలింపునకు చర్యలు : తుపాను నేపథ్యంలో తీర, లోతట్టు ప్రాంతాలుగా గుర్తించిన 50 గ్రామాలను తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల నుంచి 76 వేల మందిని 125 పునరావాస కేంద్రాలకు తరలించడానికి సన్నాహా లు చేస్తున్నారు. తుపాను తీరానికి సమీపించే సమ యం నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో 11వ తేదీ ఉదయం నుంచి లోతట్టు గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలను తరలించాలని నిర్ణయించారు.
సహాయక చర్యలకు భద్రతా దళాలు
జిల్లాకు భద్రతా దళాలు చేరుకోనున్నాయి. నాలుగు మిలటరీ దళాలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తోంది. నేవీ బృందాలతో పాటు 4 ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్‌లు జిల్లాకు పంపిస్తున్నారు. ఒక్కో బృందంలో 40 మంది సభ్యులు ఉండనున్నారు. రెండు టీమ్‌లు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. వాటిలో రెండింటిని పట్టణ ప్రాంతంలోను, ఒకటి అనకాపల్లి, మరొకటి యలమంచిలి ప్రాంతాలకు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే నేవల్ అధికారులు 30 బోట్లను సిద్ధం చేశారు. అవసరం మేరకు ఈ బోట్లను మండలాలకు పంపించాలని భావిస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వం జిల్లాకు 14 శాటిలైట్ ఫోన్స్ పంపించింది. అత్యవసర పరిస్థితులకు హెలీకాఫ్టర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. వీరితో పాటు ఫైర్‌మెన్ బృందాలు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి.
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదు
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. అధికారులు తీర ప్రాంత గ్రామాలను సందర్శించి వేటకు వెళ్లిన వారిని వెనక్కు రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంత మంది వేటలో ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. మరబోట్ల యజమానులు, వారి బోట్లు శుక్రవారం షిపింగ్ హార్బర్‌కు చేరేటట్లు చర్యలు తీసుకుంటున్నారు.
హెచ్చరికల కోసం ఎస్‌ఎంఎస్‌లు
తుపానుపై లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు అధికారులు మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు(ఎస్‌ఎంఎస్)లు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు తమ వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతామని ఆ సంస్థలు అంగీకరించాయి.
ప్రజలు సహకరించాలి
జిల్లాలో ముంపు ప్రభావిత ప్రాంతాలుగా 50 గ్రామాలను గుర్తించాం. అక్కడి ప్రజలను 125 పునరావాస కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చేపడుతున్న ఈ తరలింపునకు ప్రజలు సహకరించాలి. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి. పశువులను కట్టకుండా విడిచిపెట్టాలి. జిల్లా అధికారుల సూచనలు పాటించాలి.
- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్