నేడు ప్రధాని ఏరియల్ సర్వే
అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రి, అధికారులతో సమీక్ష
హైదరాబాద్/న్యూఢిల్లీ: హుదూ ద్ తుపాను ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం విశాఖపట్నానికి రానున్నారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటా రు. అక్కడి నుంచి నేరుగా 1.15కు ఏరియర్ సర్వేకు బయలుదేరి వెళతారు. ఏరియల్ సర్వేలో ఆయన వెంట గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సీనియర్ అధికారులు ఉంటారు. 2.05 గంటలకు తుపాను నష్టంపై సమీక్ష నిర్వహించనున్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, అన్ని శాఖల అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. 3.10 గంటలకు విశాఖపట్నం నుంచి తిరిగి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ప్రధాని విశాఖపట్నం చేరుకుంటారు. తుపాను వల్ల సంభవించిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించటంతో పాటు తుపాను నష్టాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చిన్న విమానం ద్వారా ప్రధాని పరిశీలిస్తారని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు.
తుపానుపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
ప్రధాని మోదీ సోమవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించి హుదూద్ పెనుతుపాను, ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస సహాయక చర్యలు తీరుతెన్నులపై వాకబు చేశారు. రహదారులు, రైల్వే లైన్లు, భవనాలు, విద్యుత్, టెలికమ్యూనికేషన్ లైన్లు నష్టం వాటిల్లిందని ఉన్నతాధికారులు ప్రధానికి వివరించారు. పంటనష్టంపై మరికొద్ది రోజుల్లో అంచనా వేయనున్నట్టు తెలిపారు. పునరావాస కల్పన, బాధితులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మోదీ ఆదేశించారు.