ఎక్కడ చూసినా క్యూలే..
హుదూద్ తుపాను సృష్టించిన భీకర నష్టం విశాఖ నగర వాసులకు అనేక కష్టాలు తెచ్చి పెట్టింది. పాలు, మంచినీళ్లు, హోటళ్లలో టిఫిన్, ఏటీఎం సెంటర్లు, పెట్రోల్ బంకులు ఇలా ప్రతి చోట భారీ క్యూలో గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం దాకా ఇళ్లలోనే గడిపిన వేలాదిమంది నగరవాసులు ఆ తర్వాతే రోడ్ల మీదకు వచ్చారు. అరకొరగా వచ్చిన కార్పొరేషన్ నీటి ట్యాంకర్ల వద్ద వందలాది మంది క్యూ కట్టారు. పాల ప్యాకెట్లు బ్లాక్‌లో అర లీటరు రూ.40 నుంచి రూ.50కి అమ్ముతున్నా వాటిని కొనడానికి జనం బారులు తీరారు.
మంగళవారం ఉదయం నగరంలోని హోటళ్ల వద్ద జనం టిఫిన్ కోసం క్యూ కట్టాల్సి వచ్చింది. మూడు రోజులుగా నగరంలోని ఏటీఎం సెంటర్లన్నీ పనిచేయక పోవడంతో, మంగళవారం అక్కడక్కడా పనిచేసిన ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేసుకోవడానికి నగరవాసులు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఇక పెట్రోల్, డీజిల్ కోసమైతే నగరంలోని ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా వందలాది మంది ప్రజలు గంటల కొద్దీ ఎదురుచూడటం కన్పించింది.
అనేక చోట్ల తోపులాటలు జరగడంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం నుంచి విశాఖ డెయిరీ నగరంలోని పలు చోట్ల మొబైల్ పాల విక్రయ కేంద్రాలు నిర్వహించింది. శనివారం రాత్రి నుంచే ఇక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఇన్వర్టర్లలో చార్జింగ్ అయిపోవడం, జనరేటర్లు ఉన్నా డీజిల్ దొరక్క పోవడంతో అనేకమంది ఉదయం ఇళ్లలో గడిపి రాత్రి పూట జనరేటర్ల మీద ఏసీలు, ఫ్యాన్లు పనిచేసే లాడ్జిల్లో దిగారు.
ఐదురోజులుగా లాడ్జిలోనే..: కోల్‌కతా విద్యుత్ శాఖ ఇంజనీరుగా పనిచేస్తు న్న జె.ఎన్. ఘోష్ ఐదు రోజుల కిందట విశాఖపట్నం అందాలు చూడటానికి భార్య, కుమార్తెతో కలిసి వచ్చారు. రైళ్లు, బస్సులు, హైవే మీద వాహనాల రాకపోకలన్నీ నిలిపి వేయడంతో ఘోష్ విశాఖలోనే ఆగిపోవాల్సి వచ్చింది. లాడ్జిలో బస చేస్తున్న ఆయన వద్ద డబ్బులు అయిపోవడంతో అవస్థలు పడుతున్నారు.