కన్నెర్రా? కనికరమా? | AP government gets ready to tackle Cyclone Hudood | Sakshi
Sakshi News home page

కన్నెర్రా? కనికరమా?

Published Sun, Oct 12 2014 1:14 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

కన్నెర్రా? కనికరమా? - Sakshi

కన్నెర్రా? కనికరమా?

 కొన్నిరోజులుగా కడలిలో కదం తొక్కుతూ ఉన్న ‘హుదూద్’.. తీరంపై దాడి చేసే ఘడియ చేరువవుతోంది. శనివారం నుంచే ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలల  హోరు.. తుపాను మోగిస్తున్న రణభేరిలా వినిపిస్తోంది. విశాఖ పరిసరాల్లో ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత తీరం దాటనున్న తుపాను ఎలాంటి హానీ తలపెట్టకుండా కనికరించాలని పలుచోట్ల తీరప్రాంతవాసులు గంగమ్మకు పూజలు చేశారు. మరోపక్క అధికారులు ఈ విపత్తు కలిగించే నష్టాన్ని నివారించేందుకు పలుచర్యలు చేపట్టారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : తీరం దాటే వేళ ‘హుదూద్’ ఏ మేరకు కోరలు చాచుతుందోనన్న ఆందోళన జిల్లా అంతటా నెలకొంది. ఆదివారం ఉదయం 11 గంటల తర్వాత విశాఖ పరిసరాల్లో తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో ఆ సమయంలో ఉత్పన్నమయ్యే దుష్పరిణామాల్ని ఎదుర్కొనే ప్రయత్నాల్లో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఈ క్రమంలో తీర గ్రామాల వారిని శనివారం పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే తీరంలోని ఉప్పాడ, సుబ్బంపేట, మాయాపట్నం, సూరాడపేట, అమీనాబాద, కోనపాపపేట గ్రామాలు సహా కోనసీమలోని కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లోని గ్రామాల మత్స్యకారులు ఇళ్లు విడిచి వచ్చేది లేదంటున్నారు. దాంతో పోలీసు బందోబస్తుతో బలవంతంగా తరలించేందుకు యత్నిస్తున్నారు. కాట్రేనికోన మండల పరిధిలో సముద్రంలో దీవిలా ఉండే మగసానితిప్ప, నీళ్లరేవు, చిర్ర యానంల నుంచి   2500 మంది మత్స్యకారులను తరలించబోతే ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశాలతో వారిని పోలీసు బందోబస్తుతో తరలిస్తున్నారు. ఉప్పాడ తీరంలో జట్టీలు లేకపోవడంతో సుమారు 600  బోట్లకు లంగరేశారు. ఒక్కో బోటు రూ.20 లక్షలు విలువైనదని, తమకు బతుకుతెరువైన వాటిని విడిచి పెట్టి ఎలా రాగలమని మత్స్యకారులు అంటున్నారు. కాగా ఎలాంటి ఆపదా తలపెట్టకుండా శాంతించాలని మత్స్యకారులు గంగమ్మతల్లికి పూజలు చేశారు.
 
 ఛిన్నాభిన్నమైన బీచ్‌రోడ్డు..
 తొండంగి నుంచి సఖినేటిపల్లి వరకు  సముద్ర తీరం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలతో కల్లోలితంగా ఉంది.  ఓడలరేవు సముద్రతీరం అల్లకల్లోలంగా ఉంది. తీర గ్రామాల్లో మెరైన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. ఉప్పాడ-కాకినాడ లైట్‌హౌస్ బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన బండరాళ్లు కెరటాల ఉధృతికి రోడ్డుపైకి వచ్చేసి స్థానికులను కలవరపాటుకు గురిచేశాయి. ఉప్పాడ రోడ్డు ఛిన్నాభిన్నమైంది. ఉప్పాడ తీరంలో జియోట్యూబ్ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ దెబ్బతిని ఉప్పాడ గ్రామంలోకి సముద్రం నీరు చొచ్చుకువచ్చింది. తుపాను తాకిడి ఎంత తీవ్రంగా ఉంటుందోనని జిల్లావాసులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలో 16వ నంబరు జాతీయ రహదారిపై రాకపోకలను నిషేధించారు. ఈ నిషేధం ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు అమలులో ఉంటుంది.
 
 కాకినాడకు హోప్ ఐలాండ్ వాసులు..
 ఎస్.యానాం, కాట్రేనికోన మండలం మగసానితిప్ప, గచ్చకాయలపోర తీరంలో ఉన్న విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన 350 మంది వలస మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఎస్.యానాం సముద్రతీరాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. కాకినాడ సమీపంలోని  హోప్ ఐలాండ్ నుంచి 200 మంది మత్స్యకారులను కాకినాడ శారదా హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. సముద్రంలో కాట్రేనికోన మండలంలో దీవిని పోలి ఉండే మగసాని తిప్ప నుంచి 60 మంది మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రాజోలు నియోజకవర్గంలో తూర్పుపాలెం, కేశనపల్లి, కేశవదాసుపాలెం,  ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, నక్కా రామేశ్వరం తదితర తీరగ్రామాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చే సి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అమలాపురం ఆర్డీఓ కార్యాలయం, రాజోలు తహశీల్దార్ కార్యాలయాల నుంచి కలెక్టర్ నీతూ ప్రసాద్ ఢిల్లీలోని జాతీయ విపత్తుల నివారణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సహాయక చర్యల వివరాలను తెలిపారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
 
 70 కేంద్రాలకు 17 వేల మంది తరలింపు
 తుపాను ప్రభావం 79 గ్రామాల్లోని 45,748 కుటుంబాలపై పడే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. శనివారం రాత్రి 9 గంటలకు అందిన సమాచారం మేరకు సుమారు 17 వేల మందిని 70 పునరావాస కేంద్రాలకు తరలించారు.  కాకినాడ డివిజన్ పరిధిలో కాకినాడ అర్బన్ మండలంలో రెండువేలమందిని మూడు కేంద్రాలకు, కాకినాడ రూరల్ మండలంలో 2001 మందిని కేంద్రాలకు, కరప మండలంలో 300 మందిని ఒక కేంద్రానికి, తాళ్ళరేవు మండలంలో 750 మందిని నాలుగు కేంద్రాలకు, యు.కొత్తపల్లి మండలంలో 6,060 మందిని 8 కేంద్రాలకు, పెద్దాపురం డివిజన్ పరిధిలోని తుని మండలంలో 650 మందిని ఏడు కేంద్రాలకు, తొండంగిలో 12 వందల మందిని తొమ్మిది కేంద్రాలకు, కోటనందూరులో 250 మందిని ఒక కేంద్రానికి, అమలాపురం డివిజన్‌లో కాట్రేనికోన మండలంలో 145 మందిని ఏడు కేంద్రాలకు, ఉప్పలగుప్తం మండలంలో 950 మందిని ఆరు కేంద్రాలకు, సఖినేటిపల్లి మండలంలో 730 మందిని మూడు కేంద్రాలకు, మామిడికుదురు మండలంలో 150 మందిని రెండు కేంద్రాలకు, అల్లవరం మండలంలో 440 మందిని నాలుగు కేంద్రాలకు, ఐ.పోలవరం మండలంలో 440 మందిని ఆరు కేంద్రాలకు తరలించి, పునరావాసం కల్పించారు. కాగా అపాయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు 85 మంది గజ ఈతగాళ్లను, 19 బోట్లను సిద్ధం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement