బీచ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
బీచ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్
Published Wed, Jan 11 2017 11:50 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
కాకినాడ రూరల్ (కాకినాడ రూరల్ నియోజకవర్గం) : ఈనెల 12 నుంచి 15వతేదీ వరకూ కాకినాడ సాగరతీరంలో అత్యంత వైభవోపేతంగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామని కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ తెలిపారు. బుధవారం రాత్రి వాకలపూడి హరితారిసార్ట్స్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో బీచ్ ఫెస్టివల్ 2017 ఉత్సవాల ఏర్పాట్లుపై వివరించారు. 12వతేదీ మధ్యాహ్నం బీచ్ ఫెస్టివల్‌ను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పలు ప్రారంభిస్తారన్నారు. వేడుకలకు వచ్చే ప్రజల కోసం బీచ్ వరకూ ఉచిత బస్సులు, 10 సీటర్ టాటా వ్యేన్‌లు ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు హరితా రిసార్ట్స్ ఎదురుగాను, ఏడీబీ రోడ్డులో వచ్చే వాహనాలకు ఓఎన్‌జీసీ సైట్‌లోను, ఉప్పాడ వైపు నుంచి వచ్చే వాహనాలకు అదే రోడ్డు ప్రక్కన, వీఐపీలకు రిసార్ట్స్ వద్ద పార్కింగ్ కల్పించామన్నారు. వేడుగల ప్రాంగణంలోకి మూడు గేట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర వీఐపీలకు గేట్–1 నుంచి డ్యూటీ ఆఫీసర్లకు, ఇతర వీఐపీలకు గేట్–2 నుంచి, ప్రజలకు ఆర్ అండ్ బీ కొత్త బ్రిడ్జి ఎదురుగా ఏర్పాటు చేసిన ఆర్చ్ గేట్–3 నుంచి ప్రవేశం ఉంటుందన్నారు. వేడుకలకు 200 మంది కళాశారుల కూచిపూడి నృత్యంతో ప్రారంభమౌతుందని, సంక్రాంతి సంబరాలు, నగదు రహిత లావాదేవీల అంశాలను ఇదే వేడుకల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈసారి కూడా ఫ్లోరీకల్చర్‌షో, ఆక్వారియం షోలను మరిన్ని కొత్త హంగులతో ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల వస్త్ర ఉత్పత్తులతో జాతీయ స్థాయి టైక్స్‌టైల్స్ ఎగ్జిబిషన్ ప్రత్యేక షాపింగ్ ఆకర్షణగా నిలవనుందన్నారు. 100 స్టాల్స్‌తో ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఇందులో సీ ఫుడ్, ఎగ్ ఫుడ్ ఫెస్టివల్ చెవులూరించే వంటకాలతో సందర్శకులను అలరించనున్నట్లు తెలిపారు. డ్వాక్రా బజార్, అన్నవరం నమూనా దేవాలయం, వాటర్ స్పోర్ట్‌స, బీచ్ క్రీడలు, కిడ్ అట్రాక్షన్, మిరుమిట్లు గొలిపే లైట్ షోలు ఉన్నాయన్నారు. వేడుకల్లో స్థానిక కళాకారులతో పాటు దేవన్, కేకే, హరిచరణ్, డీజే వంటి జాతీయ స్థాయి ప్రముఖ కళాకారులు సందర్శకులను ఉర్రూతలూగించనున్నారన్నారు. వేడుకల్లో నేను లోకల్, శతమానం భవంతి సినిమా యూనిట్ల ఆడియో విడుదల కూడా ఉందన్నారు. సందర్శకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక కంట్రోల్ రూమ్, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అరుణ్‌కుమార్ వివరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమీషనర్ అలీంభాషా, అఖండ గోదావరి ప్రాజెక్టు స్పెషల్ అధికారి భీమశంకరం, సమాచారశాఖ డీడీ యం ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement