ఆహారం, నీరు అందించండి
సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నష్ట పరిహారం పెంచుతూ జీవో విడుదల
విశాఖపట్నం: ‘నష్టం అంచనాల సంగతి తర్వాత చూద్దాం. ముందు తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి’ అని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలపై సహచర మంత్రులు, అధికారులతో విశాఖపట్నంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యల కోసం విశాఖపట్నాన్ని 8 జోన్లుగా విభజించాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించాలని ఆదేశించారు. సదరు ఇన్‌చార్జ్‌లు కేటాయించిన వార్డుల్లో పునరావాస చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సీఎం మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 5 హెలికాప్టర్లతో బిర్యాని, పులి హోర ప్యాకెట్లు, తాగునీటి ప్యాకెట్లను తెప్పించాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డున్న కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను వెంటనే అందించాలన్నారు.
►వాటర్ ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసే బాధ్యతను ఐజీ సురేంద్రబాబుకు అప్పగిం చారు. పాలు, నీటి ప్యాకెట్లు పంపించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కలెక్టర్లను ఆదేశించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్లను క్లియర్ చేయమన్నారు.
►విద్యుత్ పునరుద్ధరణ కోసం అత్యవసరంగా కనీసం 200 స్తంభాలు కావాలని స్టీల్‌ప్లాంట్ అధికారులను కోరారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన టెలికం సేవలను పునరుద్ధరించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎన్‌డీఆర్‌ఎఫ్ డీఐజీ గులేరియా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నష్ట పరిహారం పెంపు
ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు, నష్టపోయిన పంటలు, ఇళ్లు, ఇతర వాటికి నష్టపరిహారాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్ కుమార్ జీవో 9ని జారీ చేశారు.
►మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.1.50 లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు.
►ప్రస్తుతం అంగవైకల్యం 80 శాతముంటే రూ. 62వేలు, అంగవైకల్యం 80 శాతాని కంటే తక్కువుంటే రూ.43,500 ఉంది. ఈ రెండింటికీ నష్టపరిహారాన్ని రూ. లక్షకు పెంచారు.
►తీవ్ర క్షతగాత్రులకు: వారం రోజుల కంటే ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ.9,300 పరిహారాన్ని ఇస్తున్నా రు. ప్రస్తుతం దాన్ని రూ.50 వేలకు పెంచారు. వారం కంటే తక్కువ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ. 3,100 ఇస్తున్నారు. దాన్ని రూ.15 వేలకు పెంచారు.
►ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు దుస్తుల కోసం ఇంతవరకు రూ.1,300 ఇస్తున్నారు. దీన్ని రూ.2 వేలకు, వంటపాత్రల కోసం ఇస్తున్న రూ.1,400ను రూ. 2 వేలకు పెంచారు.
►బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద పెద్దలకు రూ.40 చొప్పున, పిల్లలకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నారు. దానికి బదులుగా ఇక నుంచి వంట దినుసుల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు.
►ఇక.. పూర్తిగా కూలిపోయిన పక్కా ఇళ్లకు ఇప్పటి వరకు రూ.70 వేలు పరిహారం ఇస్తున్నారు. ఇకపై దీనిని రూ.50 వేలు చేసి, ఐఏవై ఇళ్లను మంజూరు చేస్తారు. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లకు అయితే ఇంతవరకు రూ.15 వేలు ఇస్తున్నారు. దాన్ని రూ.25 వేలకు పెంచారు.
►తీవ్రంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్ల పరిహారాన్ని రూ.3,200 నుంచి రూ.5 వేలకు, పాక్షికంగా దెబ్బతింటే రూ.5 వేలు, కూలిన పూరి గుడిసెలకు రూ. 5 వేలు ఇవ్వనున్నారు.
►పాడి పశువులు చనిపోతే పరిహారాన్ని రూ. 16,400 నుంచి రూ.20 వేలకు పెంచారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించి కోడి పిల్లకు పరిహారాన్ని రూ.37 నుంచి రూ.50కి పెంచారు.
ఇలాగైతే రాళ్లతో కొడతారు!
మంత్రులు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం
విశాఖపట్నం, రాజమండ్రి: ‘ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు మనం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తే ఎలా? మాటలు చెబుతున్నాం కానీ చేతల్లో చూపిం చడం లేదు. మన పనితీరు ఇలాగే ఉంటే జనం రాళ్లతో కొడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు. ఇతర జిల్లా అధికారుల నుంచి సహకారం లేదు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నష్టం అంచనాల సంగతి పక్కనపెట్టండి. వెంటనే తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి. సమాచార, రవాణా, విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించండి’ అని ఆదేశించారు. హుదూద్ పెను తుపానుతో కకావికలమైన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకున్న ఆయన తొలుత హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి, తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.