Rehabilitation activities
-
AP: ఉదారంగా వరద సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలన్నారు. కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని, మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. శిబిరాల్లో మంచి సదుపాయాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు.. మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్.. ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. సచివాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్స్‌కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తాగునీటి కొరత లేకుండా.. తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలి. ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. వరద తగ్గాక పంట నష్టం నమోదు వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆహారం, నీరు అందించండి
సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నష్ట పరిహారం పెంచుతూ జీవో విడుదల విశాఖపట్నం: ‘నష్టం అంచనాల సంగతి తర్వాత చూద్దాం. ముందు తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి’ అని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. హుదూద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలపై సహచర మంత్రులు, అధికారులతో విశాఖపట్నంలో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. సహాయ, పునరావాస చర్యల కోసం విశాఖపట్నాన్ని 8 జోన్లుగా విభజించాలని, ఒక్కో జోన్‌కు ఒక్కో ఐఏఎస్ అధికారిని ఇన్చార్జ్గా నియమించాలని ఆదేశించారు. సదరు ఇన్‌చార్జ్‌లు కేటాయించిన వార్డుల్లో పునరావాస చర్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. సీఎం మాట్లాడుతూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 5 హెలికాప్టర్లతో బిర్యాని, పులి హోర ప్యాకెట్లు, తాగునీటి ప్యాకెట్లను తెప్పించాలని ఆదేశించారు. తెల్లరేషన్ కార్డున్న కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలను వెంటనే అందించాలన్నారు. ►వాటర్ ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేసే బాధ్యతను ఐజీ సురేంద్రబాబుకు అప్పగిం చారు. పాలు, నీటి ప్యాకెట్లు పంపించాలని పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు కలెక్టర్లను ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేసి రోడ్లను క్లియర్ చేయమన్నారు. ►విద్యుత్ పునరుద్ధరణ కోసం అత్యవసరంగా కనీసం 200 స్తంభాలు కావాలని స్టీల్‌ప్లాంట్ అధికారులను కోరారు. అదేవిధంగా యుద్ధ ప్రాతిపదికన టెలికం సేవలను పునరుద్ధరించాలన్నారు. సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎన్డీఆర్ఎఫ్ డీఐజీ గులేరియా అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నష్ట పరిహారం పెంపు ప్రకృతి వైపరీత్యాల కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు, నష్టపోయిన పంటలు, ఇళ్లు, ఇతర వాటికి నష్టపరిహారాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్ కుమార్ జీవో 9ని జారీ చేశారు. ►మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.1.50 లక్ష నుంచి 5 లక్షలకు పెంచారు. ►ప్రస్తుతం అంగవైకల్యం 80 శాతముంటే రూ. 62వేలు, అంగవైకల్యం 80 శాతాని కంటే తక్కువుంటే రూ.43,500 ఉంది. ఈ రెండింటికీ నష్టపరిహారాన్ని రూ. లక్షకు పెంచారు. ►తీవ్ర క్షతగాత్రులకు: వారం రోజుల కంటే ఎక్కువరోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ.9,300 పరిహారాన్ని ఇస్తున్నా రు. ప్రస్తుతం దాన్ని రూ.50 వేలకు పెంచారు. వారం కంటే తక్కువ ఆసుపత్రిలో ఉండాల్సి వస్తే ఇప్పటి వరకు రూ. 3,100 ఇస్తున్నారు. దాన్ని రూ.15 వేలకు పెంచారు. ►ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు దుస్తుల కోసం ఇంతవరకు రూ.1,300 ఇస్తున్నారు. దీన్ని రూ.2 వేలకు, వంటపాత్రల కోసం ఇస్తున్న రూ.1,400ను రూ. 2 వేలకు పెంచారు. ►బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద పెద్దలకు రూ.40 చొప్పున, పిల్లలకు రూ.30 చొప్పున చెల్లిస్తున్నారు. దానికి బదులుగా ఇక నుంచి వంట దినుసుల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. ►ఇక.. పూర్తిగా కూలిపోయిన పక్కా ఇళ్లకు ఇప్పటి వరకు రూ.70 వేలు పరిహారం ఇస్తున్నారు. ఇకపై దీనిని రూ.50 వేలు చేసి, ఐఏవై ఇళ్లను మంజూరు చేస్తారు. పూర్తిగా దెబ్బతిన్న కచ్చా ఇళ్లకు అయితే ఇంతవరకు రూ.15 వేలు ఇస్తున్నారు. దాన్ని రూ.25 వేలకు పెంచారు. ►తీవ్రంగా దెబ్బతిన్న కచ్చా ఇళ్ల పరిహారాన్ని రూ.3,200 నుంచి రూ.5 వేలకు, పాక్షికంగా దెబ్బతింటే రూ.5 వేలు, కూలిన పూరి గుడిసెలకు రూ. 5 వేలు ఇవ్వనున్నారు. ►పాడి పశువులు చనిపోతే పరిహారాన్ని రూ. 16,400 నుంచి రూ.20 వేలకు పెంచారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించి కోడి పిల్లకు పరిహారాన్ని రూ.37 నుంచి రూ.50కి పెంచారు. ఇలాగైతే రాళ్లతో కొడతారు! మంత్రులు, అధికారులపై చంద్రబాబు ఆగ్రహం విశాఖపట్నం, రాజమండ్రి: ‘ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు మనం అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తే ఎలా? మాటలు చెబుతున్నాం కానీ చేతల్లో చూపిం చడం లేదు. మన పనితీరు ఇలాగే ఉంటే జనం రాళ్లతో కొడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. శాఖల మధ్య సమన్వయం లేదు. ఇతర జిల్లా అధికారుల నుంచి సహకారం లేదు’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యల్లో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ‘నష్టం అంచనాల సంగతి పక్కనపెట్టండి. వెంటనే తుపాను బాధితులకు ఆహారం, తాగునీరు అందించండి. సమాచార, రవాణా, విద్యుత్తు వ్యవస్థను పునరుద్ధరించండి’ అని ఆదేశించారు. హుదూద్ పెను తుపానుతో కకావికలమైన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకున్న ఆయన తొలుత హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే నిర్వహించి, తుపాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విశాఖపట్నం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికారుల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రూ. 2 వేల కోట్లిచ్చి ఆదుకోండి!
కేంద్రానికి విజ్ఞప్తి చేయనున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం: విశాఖపట్నం సహా ఉత్తరాంధ్ర తుపాను సహాయ, పునరావాస చర్యల కోసం తక్షణ సాయంగా కేంద్రాన్ని రూ. 2 వేల కోట్లు ఇవ్వమని అడగనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలను, బాధితులను చూశాక తన మనసు వికలమైందని సీఎం అన్నారు. విశాఖపట్నంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహాయ, పునరావాస చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీతో ఇప్పటికి రెండుసార్లు చర్చించానన్నన్నారు. ప్రధాని మోదీ మంగళవారం విశాఖపట్నం వచ్చే అవకాశాలున్నాయని సీఎం చెప్పారు. ప్రస్తుతం బాధితలకు ఆహారం, తాగునీరు అందించడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. రేషన్ దుకాణాల ద్వారా నెలకు సరిపడా సరుకులను వెంటనే పంపిణీ చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి పాలు, నీళ్ల ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా విశాఖపట్నానికి తరలించనున్నట్టు పేర్కొన్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు సహాయ, పునరావాస చర్యల బాధ్యతలు అప్పగించామన్నారు. ఏరియల్ సర్వే ద్వారా తుపాను బాధిత ప్రాంతాలను చూసి తన మనసు చితికిపోయిందన్నారు. అందాల విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని కానీ ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి దయనీయంగా మారిందని వ్యాఖ్యానించారు. పరిస్థితి చక్కబడే వరకు ఇక్కడే.. విశాఖలో విద్యుత్తు సరఫరాను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించనున్నట్టు సీఎం తెలిపారు. ఉత్తరాంధ్రలో తుపాను బాధిత ప్రజల కళ్లల్లో మళ్లీ కళ చూసేంతవరకు ఈ ప్రాంతంలోనే ఉండనున్నట్టు తెలిపారు. ప్రతి రోజూ రాత్రి 10 గంటలకు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్టు బాబు చెప్పారు.