వి‘ధ్వంసం’
- హుదూద్ తుపానుకు ధ్వంసమైన చెట్లు
- నేలకూలిన విద్యుత్ స్తంభాలు
- గాలికి ఎగిరిపోయిన రేకులు
ద్వారకానగర్ : హుదూద్ తుపాను పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్న విశాఖ స్వరూపాన్ని మార్చేసింది. కేవలం 48 గంటల్లో సృష్టించిన బీభత్సంతో సమాచారం, రవాణా, విద్యుత్ వ్యవస్థను అతులాకుతలం చేసేసింది. నగరంలో రెండు రోజులుగా అంధకారం రాజ్యమేలుతోంది. నగరంలోని రోడ్ల్లకిరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో ధ్వంసమయ్యాయి. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడంతో సిటీ బస్సులు నిలిచిపోయాయి.
విశాఖనగర పరిధి సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పలుచోట్ల మంచినీటి పైపులు శిథిలమయ్యాయి. జగదాంబ, పూర్ణమార్కెట్, కురుపాం మార్కెట్, ద్వారకానగర్, దొండపర్తి, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, ఆశీల్‌మెట్ట జంక్షన్, వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లింది.
దొండపర్తిలో ఉన్న బీఈ షాపింగ్‌మాల్, ఎస్‌మార్ట్ వ్యాపార సముదాయాల అద్దాలు పగిలిపోయాయి. షాపింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఎల్‌సీడీ టీవీలు ధ్వంసమయ్యాయి. ద్వారకానగర్‌లో గల వస్త్ర దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న నీటి ట్యాంక్‌లు ఎగిరిపోయాయి. ఆశీల్‌మెట్ట జంక్షన్, రేసవానిపాలెం, వెంకోజీపాలెం, రవీంద్రనగర్‌లో పెట్రోల్‌బంక్‌ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బంకుల్లో పెట్రోల్ సరఫరా బంద్ చేశారు.
చెట్లు కనుమరుగు
హనుమంతవాక నుంచి జాతీయ రహదారి కిరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ద్వారకానగర్, అమర్‌నగర్, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, మధురానగర్, నెహ్రూనగర్, లలితానగర్, దొండపర్తి, శంకరమఠం, సీతంపేట, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్‌బీకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో లలితానగర్, శంకరమఠం రోడ్డు, దొండపర్తి, మధురానగర్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.