The National Highway
-
శుభకార్యానికి వెళ్తూ... అనంతలోకాలకు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల మృతి భోగాపురం: మండలంలోని రాజాపులోవ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. విజయనగరం కణపాకకు చెందిన ఒకే కుటుంబంలోని ఆరుగురు విశాఖపట్నం భీమిలిలోని ఒక శుభకార్యానికి వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. సరిగ్గా రాజపులోవ సమీపంలోకి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి విశాఖవైపు వెళ్తున్న లారీ వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సావిత్రి (49) అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సూరమ్మ (45) మృతి చెందింది. మరో నలుగురికి గాయాలవ్వగా వారంతా చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో స్థానికులు నంబర్ నోట్ చేసి ఎస్సై తారకేశ్వరరావుకు అందజేయగా, పెందుర్తి సమీపంలో లారీ పట్టుబడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
బాల్కొండ మండలకేంద్రంలో 44వ జాతీయరహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని వెనక నుంచి లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేల్పూరు మండలం పడిగేల్ గ్రామానికి చెందిన ఆరె బాలయ్య(45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కేజీ రోడ్డు.. ఇక ఎన్‌హెచ్
హైవే అథారిటీ ఆధీనంలోకి కర్నూలు-గుంటూరు రహదారి త్వరలో అభివృద్ధికి చర్యలు వినుకొండ రూరల్:కర్నూలు- గుంటూరు రాష్ట్ర రహదారికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి రహదారిగా ఉన్న కేజీ రోడ్డును నేషనల్ హైవే అథారిటి వారు స్వాధీనం చేసుకుని జాతీయ స్థాయి రహదారిగా మార్పు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్, హైవేస్ ఈ ఏడాది మే 26న విడుదల చేసిన నోటిఫికేషన్లో ఇప్పటి వరకు ఆర్అండ్బీ ఆధీనంలో ఉన్న కేజీ రహదారిని నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని కోరారు. అందులో భాగంగా కేజీ రహదారిని ఆర్అండ్బీ అధికారులు మరో రెండు రోజుల్లో నేషనల్ హైవే అథారిటికి అప్పగించనున్నారు. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ వారు ఇప్పటికే రహదారి సర్వే పనులకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. టెండర్ దక్కించుకున్న సంస్థ కేజీ రహదారిలో సరాసరి ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి, వచ్చే 50 సంవత్సరాల్లో ఎంత మేరకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది, ఎన్ని లైన్లు రహదారిగా రూపొందించాలి తదితర వివరాలు సేకరించి ఎన్‌హెచ్‌కు అప్పగించనున్నారు. రహదారుల అనుసంధానంలో భాగంగా.. గతంలో ఉన్న కేజీ రోడ్డును రెండు భాగాలుగా చేసి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా తోకపల్లి వరకు ఒకటి, తోకపల్లి నుంచి గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు వరకు దశాబ్దంన్నర క్రితం డబుల్ లైన్‌గా స్టేట్ హైవేస్ అథారిటీ వారు అభివృద్ధి చేశారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని రహదారుల కనెక్టివిటీలో భాగంగా నూతన రాజధానికి అన్ని వైపుల నుంచి రహదారులను అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారు అయినా నేరుగా రాజధానికి చేరుకునే విధంగా రూపొందిస్తున్న రహదారుల్లో రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరుకు వచ్చే ప్రధాన మార్గాల్లో కేజీ రహదారి ఒకటి. అందులో భాగంగానే ఎన్‌హెచ్ 44 నుంచి ఒకటి, ఎన్‌హెచ్ 40 నుంచి మరొక రోడ్డు మార్గాలను నేషనల్ హైవేస్ అథారిటి వారు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్ 44లో అనంతపురం వద్ద నుంచి తాడిపత్రి, కొలిమిగుండ్ల, బనగానపల్లి, గాజులపల్లి, గిద్దలూరు, కంభం, తోకపల్లి, వినుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు వద్ద నున్న ఎన్‌హెచ్16కు కలపనున్నారు. ఎన్‌హెచ్ 40 రహదారిలో కర్నూలు వద్ద నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్నారు. అనంతపురం నుంచి గుంటూరు వరకు నూతనంగా అభివృద్ధి చేయనున్న రహదారికి ఎన్‌హెచ్ 544డి, కర్నూలు నుంచి దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్న రహదారికి 340సిగా నేషనల్ హైవేస్ అథారిటీ వారు పేర్కొన్నారు. వినుకొండకు బైపాస్ రోడ్డు వేస్తారా? రోడ్డు విస్తరణ అన్న ప్రతిసారి వినుకొండ వాసుల్లో గుబులు మొదలవుతుంది. పట్టణం మధ్య నుంచి వెళ్తున్న కేజీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. నాలుగులైన్లుగా అభివృద్ధి చేయటం వలన పట్టణంలోని గ్రామకంఠ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న ఆక్రమ కట్టడాలు కూల్చివేయటం ఖాయంగా కనిపిస్తుంది. అలా కాకుండా ప్రస్తుతం పట్టణంలో ఉన్న రహదారిని అలాగే ఉంచి బైపాస్ వేసినట్లయితే వ్యాపారాలు పడిపోతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. -
కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి
గూడూరు టౌన్: కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన వెర్రి సరిత (35) దుర్మరణం చెందారు. ఆమె గిరిజనకాలనీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. రోజూ తిలక్‌నగర్ నుంచి పురిటిపాళెంలోని పాఠశాలకు స్కూటీ వాహనం పై వెళతారు. పాఠశాలకు ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం విధులు ముగించుకుని వస్తూ జాతీయ రహదారి పై గూడూరులోకి వచ్చే మినీ బైపార్ రోడ్డు వద్ద డివైడర్‌ను దాటుతున్నారు. ఆ సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు వేగంగా స్కూటీని ఢీకొనడంతో సరిత అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న పురిటిపాళెం గ్రామస్తులతో పాటు పట్టణంలోని పలువురు ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. సరిత భర్త సుధాకర్ కూడా సైదాపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐదు నెలల కిందట కిడ్నీ వ్యాధితో మృతిచెందాడు. అప్పటి నుంచి పిల్లలకు అన్నీ తానై చూసుకుంటున్న సరిత కూడా మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. బంధువులు, స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు సరిత మృతదేహం వద్ద బోరున విలపించారు. అప్పటివరకు తమతో ఉన్నటువంటి సరిత ప్రమాదంలో చనిపోవడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మోహన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు చిరంజీవి కార్యదర్శి రమణయ్య, మండల బాబు, మణికుమార్ సంతాపం వ్యక్తం చేసారు. -
ఎర్రచందనం స్వాధీనం ఆరుగురి అరెస్ట్
సుమో, రెండు బైక్‌లు స్వాధీనం బి.కొత్తకోట: ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా సుమోతో పాటు రెండు బైక్‌లను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళుతున్న ఆరుగురు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ బీవీ.శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని అమరనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా నంబూలపూలకుంట నుంచి వచ్చిన టాటాసుమోను తనిఖీ చేయగా మూడు ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయన్నారు. ఘటనా స్థలం లో ఆరుగురు పట్టుబడగా, మరో ఆరుగురు పరారయ్యారని తెలిపారు. సుమోలోని 234 కిలోల మూడు దుంగలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. దుంగలు తరలిస్తున్న వారిలో మదనపల్లె పట్టణం బోయవీధికి చెందిన ఎంవీ.నాగరాజు(30), వైఎస్ఆర్జిల్లా రాయచోటి ఎస్‌ఎన్‌కాలనీకి చెందిన కే.శ్రీనివాసులు (34), రెడ్డీస్కాలనీకి చెందిన పీ.రెడ్డికిషోర్(23), బి.కొత్తకోట మండలం బూదలవారిపల్లెకు చెందిన ఎం.వెంకటనరుసు (20), ఎన్.సురేష్(28) అమరనారాయణపురానికి చెందిన ఎస్.బషీర్(58)ను అరెస్ట్ చేశామని చెప్పారు. దుంగల విలువ రూ. 4. 68 లక్షలు, వాహనాల విలువ రూ.3 లక్షలుగా లెక్కించారు. ఈ కేసులో గుర్రంకొండ మండలం కలూరివారిపల్లెకు చెం దిన ఎస్.చంద్రశేఖరనాయుడు, ములకలచెరువు మండలం చింతరేవులపల్లెకు చెందిన కే.వెంకటేష్, తంబళ్లపల్లెకు చెందిన ఎం.చంద్రశేఖర్, కర్ణాటకలోని కటికహళ్లికి చెందిన సలీం పరారీలో ఉన్నారని తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టుకు హజరుపరిచినట్టు వివరించారు. బుచ్చినాయుడుకండ్రిగలో బుచ్చినాయుడుకండ్రిగ : బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద శుక్రవారం ఎర్రచందనం తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఈశ్వరయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బుచ్చినాయుడుకండ్రిగలోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలను తనిఖీచేస్తుండగా 10 ఎర్రచందనం దుంగలు చెన్నైకు తరలిస్తున్న లారీ పట్టుబడిందని చెప్పారు. ఎర్రచందనం విలువ పది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఎర్రచందనం తరలిస్తున్న చెన్నైకు చెందిన 14మంది స్మగ్లర్లను అరెస్టు చేశామని తెలిపారు. -
వి‘ధ్వంసం’
హుదూద్ తుపానుకు ధ్వంసమైన చెట్లు నేలకూలిన విద్యుత్ స్తంభాలు గాలికి ఎగిరిపోయిన రేకులు ద్వారకానగర్ : హుదూద్ తుపాను పచ్చని చెట్లతో అందంగా అలరారుతున్న విశాఖ స్వరూపాన్ని మార్చేసింది. కేవలం 48 గంటల్లో సృష్టించిన బీభత్సంతో సమాచారం, రవాణా, విద్యుత్ వ్యవస్థను అతులాకుతలం చేసేసింది. నగరంలో రెండు రోజులుగా అంధకారం రాజ్యమేలుతోంది. నగరంలోని రోడ్ల్లకిరువైపులా ఉన్న చెట్లన్నీ నేలకూలాయి. కొన్ని చెట్లు ఇళ్లపై పడటంతో ధ్వంసమయ్యాయి. రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించకపోవడంతో సిటీ బస్సులు నిలిచిపోయాయి. విశాఖనగర పరిధి సముద్రతీరాన్ని ఆనుకొని ఉన్న కాలనీలన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. పలుచోట్ల మంచినీటి పైపులు శిథిలమయ్యాయి. జగదాంబ, పూర్ణమార్కెట్, కురుపాం మార్కెట్, ద్వారకానగర్, దొండపర్తి, మద్దిలపాలెం, ఎంవీపీకాలనీ, ఆశీల్‌మెట్ట జంక్షన్, వీఐపీ రోడ్డు, సిరిపురం జంక్షన్, పెదవాల్తేరు తదితర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలకు తీవ్రనష్టం వాటిల్లింది. దొండపర్తిలో ఉన్న బీఈ షాపింగ్‌మాల్, ఎస్మార్ట్ వ్యాపార సముదాయాల అద్దాలు పగిలిపోయాయి. షాపింగ్‌లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు, ఎల్సీడీ టీవీలు ధ్వంసమయ్యాయి. ద్వారకానగర్‌లో గల వస్త్ర దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. తీవ్ర ఈదురుగాలులకు ఇళ్లపై ఉన్న నీటి ట్యాంక్‌లు ఎగిరిపోయాయి. ఆశీల్‌మెట్ట జంక్షన్, రేసవానిపాలెం, వెంకోజీపాలెం, రవీంద్రనగర్‌లో పెట్రోల్‌బంక్‌ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఈ బంకుల్లో పెట్రోల్ సరఫరా బంద్ చేశారు. చెట్లు కనుమరుగు హనుమంతవాక నుంచి జాతీయ రహదారి కిరువైపులా ఉన్న చెట్లు నేలకొరిగాయి. ద్వారకానగర్, అమర్‌నగర్, ఎంవీపీకాలనీ, విశాలాక్షినగర్, మధురానగర్, నెహ్రూనగర్, లలితానగర్, దొండపర్తి, శంకరమఠం, సీతంపేట, రైల్వే కాలనీ, తాటిచెట్లపాలెం, హెచ్‌బీకాలనీ తదితర ప్రాంతాల్లో ఇళ్లపై, రోడ్లపై చెట్లు పడిపోయాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు కూలిపోవడంతో లలితానగర్, శంకరమఠం రోడ్డు, దొండపర్తి, మధురానగర్ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
ముందు వెళుతున్న లారీని ఢీకొన్న వ్యాన్ డ్రైవర్, క్లీనర్ మృతి గట్టుభీమవరం వద్ద దుర్ఘటన మృతులు మెదక్ జిల్లా వాసులు గట్టుభీమవరం(వత్సవాయి) : విధి నిర్వహణలో భాగంగా డీసీఎం వ్యాన్‌లో దూరప్రాంతం నుంచి వచ్చిన డ్రైవర్, క్లీనర్ తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. జాతీయ రహదారిపై గట్టుభీమవరం పరిధిలోని కొంగరమల్లయ్య గుట్టవద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేటకు చెందిన డ్రైవర్ చాకలి గోవర్థన్, క్లీనర్ యేలేష్ ఆక్సిజన్ సిలిండర్ల కోసం వ్యాన్‌లో విజయవాడ వచ్చారు. అక్కడ సిలిండర్లను నింపుకుని తిరుగు ప్రయాణమయ్యారు. కొంగరమల్లయ్య గుట్ట వద్ద ముందు వెళుతున్న లారీని వీరి వాహనం అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ కేబిన్ నుజ్జునుజ్జవగా, గోవర్థన్, యేలేష్ లోపల ఇరుక్కుని అక్కడికక్కడే మరణించారు. దీనిపై సమాచారం అందుకున్న వత్సవాయి పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. క్రేన్‌ను రప్పించి, గంటసేపు శ్రమించి మృతదేహాలను వెలికి తీయించారు. మృతుల వద్ద ఉన్న సెల్ఫోన్ల ఆధారంగా వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. జగ్గయ్యపేట సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదవగా, ఎస్సై ఆర్.ప్రసాదరావు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
తల్లి, భార్యతో సహా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ మృతి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ మృతులు బెంగళూరు వాసులు దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గోనిపేట-వీరజిన్నేపల్లి రహదారి సమీపాన 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, భార్య తో సహా బ్యాంక్ రిటైర్డు మేనేజర్ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళితే.. బెంగళూరులోని గిరినగర్‌లో నివాసం ఉంటున్న బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సతీష్(58), భార్య సహాన (50,) తల్లి సులోచన (77)తో కలసి రెం డు రోజుల క్రితం దైవ దర్శనం కోసం హుందై కారులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు జిల్లా శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుంచి మంత్రాలయం వెళ్లి రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సోమవారం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వస్తున్న వీరి కారు గోనిపేట-వీరజిన్నేపల్లి రహదారి వద్ద అదుపుతప్పి చెట్లను, రాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ 25 అడుగులున్న లోయలాంటి ప్రాంతంలోకి పడి మట్టిగడ్డకు ఆనుకుని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో సతీష్‌తో పాటు భార్య సహాన, తల్లి సులోచ న అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న డ్రైవర్ శ్రీనివాసులును హైవే అథారిటీ సిబ్బంది పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, ఎస్ఐ.బి.శేఖర్ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మలుపే ప్రాణాలు తీసిందా? గోనిపేట-వీరజిన్నేపల్లి వద్ద 44వ నంబరు జాతీయరహదారిపై ఉన్న మలుపు వద్ద వేగంగా వచ్చే వాహనాలు కట్ చేసుకోవడంలో ఏ మాత్రం ఏమరుపాటు జరిగినా ప్రమాదం తప్పదని తెలుస్తోంది. సోమవారం జరిగిన ప్రమాదం సైతం ఇదే విధంగా జరగడంతోనే ముగ్గురు ప్రాణాలు బలికావాల్సి వచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. మలుపు ప్రాంతంలో రోడ్డు సూచికలు లేకపోవడంతో డ్రైవర్లు ప్రమాదాన్ని పసిగట్టలేక ఒకే రకమైన వేగంతో ముందుకు వెళుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఆర్అండ్బీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
ఒంగోలు కలెక్టరేట్ : ‘పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద సిమెంట్ రోడ్డుకు అప్రోచ్ వేయమని మూడు నెలల క్రితం చెప్పా. ఇంతవరకూ వేయలేదు. అక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరిగి జనాలు చనిపోయిన తర్వాత అప్రోచ్ వేస్తారా? మీకు సొంత జ్ఞానం ఉండదా? ఇంజినీరింగ్ చదివే వచ్చారా’ అని ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులపై కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం గురువారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల పట్ల కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల సంఖ్యను సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులన్నింటిపైనా ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రమాదాలన్నీ ఎక్కువ శాతం తెల్లవారు జామున రెండు నుంచి నాలుగు గంటల మధ్యలో జరుగుతున్నాయని, ఆ సమయాల్లో వాహనాలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వల్లూరు, మార్టూరు ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను అభివృద్ధి చేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల డ్రైవర్లు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జాతీయ రహదారి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారితో కలిపే ప్రాంతాల్లో అన్ని రహదారులపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి వాహనాలు వేగంగా రోడ్డుపైకి రాకుండా నివారించాలని కలెక్టర్ చెప్పారు. వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు ఉండొద్దు జాతీయ రహదారికి ఇరువైపులా వంద మీటర్ల పరిధిలో మద్యం దుకాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారులన్నింటిపై ఆక్రమణలు తొలగించాలన్నారు. రోడ్లపై వాహనాలు పార్కు చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని సూచించారు. ఒంగోలు నగరంలోని ఫ్లయిఓవర్ బ్రిడ్జి కింద ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గ్రీనరీ పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ విజయకుమార్ సూచించారు. కార్పొరేషన్ కమిషనర్‌కు చార్జి మెమో: ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మికి కలెక్టర్ విజయకుమార్ చార్జి మెమో జారీ చేశారు. నగరంలోని తొమ్మిది ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయాలని గతేడాది మే 23వ తేదీన నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆమెపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పాలక సంస్థ పరిధిలో అప్రోచ్ రోడ్ల వివరాలు అడిగినా సకాలంలో స్పందించకపోవడంతో కమిషనర్‌పై కలెక్టర్ మండిపడ్డారు. -
చెక్‌పోస్టుల్లో భారీగా నగదు పట్టివేత
కొవ్వాడ వద్ద రూ.20 లక్షలు స్వాధీనం పోలేకుర్రు జంక్షన్ వద్ద రూ.15 లక్షలు.. బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో అప్పగింత కొవ్వాడ (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ : ఎన్నికల నిఘా నేపథ్యంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు పట్టుబడ్డాయి. బ్యాంకుల నుంచి తమ బ్రాంచిలకు తరలిస్తున్న రెండు బ్యాంకులకు చెందిన రూ.35 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంకు అధికారులు వాటి రికార్డులు చూపడంతో అప్పగించారు. ఆటోలో తరలిస్తున్న రూ.20 లక్షల నగదును కొవ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల సిబ్బంది పట్టుకున్నారు. అయితే నగదుకు సంబంధించి బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో వాటిని తిరిగి అప్పగించారు. కొవ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ, పోలీసు సిబ్బంది శుక్రవారం ఓ ఆటోను తనిఖీ చేశారు. అందులో రూ.20 లక్షల నగదు లభ్యమైంది. దీనిని ఎస్బీహెచ్ గొల్లల మామిడాడ బ్రాంచి నుంచి కాకినాడ బ్రాంచికి తరలిస్తున్నట్టు నగదుతో పాటు ఉన్న సిబ్బంది తెలిపారు. అయితే సరైన ఆధారాలు చూపాలని అధికారులు చెప్పడంతో, గొల్లల మామిడాడ నుంచి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన కొవ్వాడ చెక్‌పోస్టు ప్రాంతానికి చేరుకున్నారు. రూ.20 లక్షలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సొమ్మును తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. తహశీల్దార్ వైకేవీ అప్పారావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ముఖర్జీ, వీఆర్వో జి.సూరిబాబు తనిఖీల్లో పాల్గొన్నారు. పోలేకుర్రు వద్ద... తాళ్లరేవు : జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు జంక్షన్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రూ.15 లక్షల నగదును కోరంగి ెహ చ్‌సీ ఎం.రవణమ్మ, సిబ్బంది పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా, కారులో తరలిస్తున్న ఈ నగదును స్వాధీనం చేసుకుని డీఎస్పీకి సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఎస్టీ టీమ్ హెడ్ జీబీవీ రమేష్ పరిశీలించి, నగదు కాట్రేనికోన ఆంధ్రాబ్యాంకుకు చెందినదిగా గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలను బ్యాంకు ప్రతినిధి పి.రామ్‌కుమార్ చూపినప్పటికీ ఆర్ఓ అనుమతి లేకుండా నగదును తరలించడం నేరమని పోలీసులు వదిలి పెట్టలేదు. ఈ విషయాన్ని తాళ్లరేవు తహశీల్దార్, రిటర్నింగ్ అధికారి జి.శేషగిరిరావుకు తెలియజేయడంతో, ఆయన ఈ నగదును పరిశీలించారు. ఇంత నగదును అనుమతి లేకుండా ఎలా తరలిస్తున్నారని బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ దినకరణ్ నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను ఫోన్లో తహశీల్దార్‌కు తెలిపారు. ఈ ఆధారాలను పరిశీలించాక, సిబ్బందితో లేఖ రాయించి నగదును అప్పగించారు.