కొవ్వాడ వద్ద రూ.20 లక్షలు స్వాధీనం
పోలేకుర్రు జంక్షన్ వద్ద రూ.15 లక్షలు..
బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో అప్పగింత
కొవ్వాడ (కాకినాడ రూరల్), న్యూస్‌లైన్ :
ఎన్నికల నిఘా నేపథ్యంలో జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో లక్షలాది రూపాయలు పట్టుబడ్డాయి. బ్యాంకుల నుంచి తమ బ్రాంచిలకు తరలిస్తున్న రెండు బ్యాంకులకు చెందిన రూ.35 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బ్యాంకు అధికారులు వాటి రికార్డులు చూపడంతో అప్పగించారు.
ఆటోలో తరలిస్తున్న రూ.20 లక్షల నగదును కొవ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఎన్నికల సిబ్బంది పట్టుకున్నారు. అయితే నగదుకు సంబంధించి బ్యాంకు అధికారులు ఆధారాలు చూపడంతో వాటిని తిరిగి అప్పగించారు.
కొవ్వాడ రైల్వేస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిప్యూటీ కలెక్టర్ ప్రమీలా గాంధీ, పోలీసు సిబ్బంది శుక్రవారం ఓ ఆటోను తనిఖీ చేశారు. అందులో రూ.20 లక్షల నగదు లభ్యమైంది.
దీనిని ఎస్‌బీహెచ్ గొల్లల మామిడాడ బ్రాంచి నుంచి కాకినాడ బ్రాంచికి తరలిస్తున్నట్టు నగదుతో పాటు ఉన్న సిబ్బంది తెలిపారు. అయితే సరైన ఆధారాలు చూపాలని అధికారులు చెప్పడంతో, గొల్లల మామిడాడ నుంచి బ్యాంకు సిబ్బంది హుటాహుటిన కొవ్వాడ చెక్‌పోస్టు ప్రాంతానికి చేరుకున్నారు.
రూ.20 లక్షలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సొమ్మును తీసుకువెళ్లేందుకు అంగీకరించారు. తహశీల్దార్ వైకేవీ అప్పారావు, ఎన్నికల డిప్యూటీ తహశీల్దార్ ముఖర్జీ, వీఆర్వో జి.సూరిబాబు తనిఖీల్లో పాల్గొన్నారు.
పోలేకుర్రు వద్ద...
తాళ్లరేవు : జాతీయ రహదారి 216లోని పోలేకుర్రు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద రూ.15 లక్షల నగదును కోరంగి ెహ చ్‌సీ ఎం.రవణమ్మ, సిబ్బంది పట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా, కారులో తరలిస్తున్న ఈ నగదును స్వాధీనం చేసుకుని డీఎస్పీకి సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్‌ఎస్‌టీ టీమ్ హెడ్ జీబీవీ రమేష్ పరిశీలించి, నగదు కాట్రేనికోన ఆంధ్రాబ్యాంకుకు చెందినదిగా గుర్తించారు.
దీనికి సంబంధించిన ఆధారాలను బ్యాంకు ప్రతినిధి పి.రామ్‌కుమార్ చూపినప్పటికీ ఆర్‌ఓ అనుమతి లేకుండా నగదును తరలించడం నేరమని పోలీసులు వదిలి పెట్టలేదు. ఈ విషయాన్ని తాళ్లరేవు తహశీల్దార్, రిటర్నింగ్ అధికారి జి.శేషగిరిరావుకు తెలియజేయడంతో, ఆయన ఈ నగదును పరిశీలించారు.
ఇంత నగదును అనుమతి లేకుండా ఎలా తరలిస్తున్నారని బ్యాంకు ప్రతినిధులను ప్రశ్నించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ దినకరణ్ నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలను ఫోన్‌లో తహశీల్దార్‌కు తెలిపారు. ఈ ఆధారాలను పరిశీలించాక, సిబ్బందితో లేఖ రాయించి నగదును అప్పగించారు.
చెక్‌పోస్టుల్లో భారీగా నగదు పట్టివేత
Published Fri, Mar 21 2014 11:59 PM | Last Updated on Tue, Aug 21 2018 9:00 PM
Advertisement
Advertisement