- తల్లి, భార్యతో సహా బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ మృతి
- కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్
- మృతులు బెంగళూరు వాసులు
- దైవ దర్శనం చేసుకుని వస్తుండగా ఘటన
పెనుకొండ : అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గోనిపేట-వీరజిన్నేపల్లి రహదారి సమీపాన 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, భార్య తో సహా బ్యాంక్ రిటైర్డు మేనేజర్ దుర్మరణం చెందారు. కారు డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకెళితే..
బెంగళూరులోని గిరినగర్‌లో నివాసం ఉంటున్న బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ సతీష్(58), భార్య సహాన (50,) తల్లి సులోచన (77)తో కలసి రెం డు రోజుల క్రితం దైవ దర్శనం కోసం హుందై కారులో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూ లు జిల్లా శ్రీశైలం వెళ్లారు. అక్కడి నుంచి మంత్రాలయం వెళ్లి రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సోమవారం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వస్తున్న వీరి కారు గోనిపేట-వీరజిన్నేపల్లి రహదారి వద్ద అదుపుతప్పి చెట్లను, రాళ్లను ఢీకొట్టి పల్టీలు కొట్టుకుంటూ 25 అడుగులున్న లోయలాంటి ప్రాంతంలోకి పడి మట్టిగడ్డకు ఆనుకుని నిలిచిపోయింది.
ఈ ప్రమాదంలో సతీష్‌తో పాటు భార్య సహాన, తల్లి సులోచ న అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న డ్రైవర్ శ్రీనివాసులును హైవే అథారిటీ సిబ్బంది పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్, ఎస్‌ఐ.బి.శేఖర్ సిబ్బందితో హుటాహుటిన ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మలుపే ప్రాణాలు తీసిందా?
గోనిపేట-వీరజిన్నేపల్లి వద్ద 44వ నంబరు జాతీయరహదారిపై ఉన్న మలుపు వద్ద వేగంగా వచ్చే వాహనాలు కట్ చేసుకోవడంలో ఏ మాత్రం ఏమరుపాటు జరిగినా ప్రమాదం తప్పదని తెలుస్తోంది. సోమవారం జరిగిన ప్రమాదం సైతం ఇదే విధంగా జరగడంతోనే ముగ్గురు ప్రాణాలు బలికావాల్సి వచ్చిందన్న భావన వ్యక్తమవుతోంది. మలుపు ప్రాంతంలో రోడ్డు సూచికలు లేకపోవడంతో డ్రైవర్లు ప్రమాదాన్ని పసిగట్టలేక ఒకే రకమైన వేగంతో ముందుకు వెళుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇప్పటికైనా హైవే అథారిటీ అధికారులు ప్రమాదాల నివారణకు సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.