గూడూరు టౌన్: కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన వెర్రి సరిత (35) దుర్మరణం చెందారు. ఆమె గిరిజనకాలనీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. రోజూ తిలక్‌నగర్ నుంచి పురిటిపాళెంలోని పాఠశాలకు స్కూటీ వాహనం పై వెళతారు. పాఠశాలకు ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం విధులు ముగించుకుని వస్తూ జాతీయ రహదారి పై గూడూరులోకి వచ్చే మినీ బైపార్ రోడ్డు వద్ద డివైడర్‌ను దాటుతున్నారు.
ఆ సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు వేగంగా స్కూటీని ఢీకొనడంతో సరిత అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న పురిటిపాళెం గ్రామస్తులతో పాటు పట్టణంలోని పలువురు ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. సరిత భర్త సుధాకర్ కూడా సైదాపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐదు నెలల కిందట కిడ్నీ వ్యాధితో మృతిచెందాడు.
అప్పటి నుంచి పిల్లలకు అన్నీ తానై చూసుకుంటున్న సరిత కూడా మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. బంధువులు, స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు సరిత మృతదేహం వద్ద బోరున విలపించారు. అప్పటివరకు తమతో ఉన్నటువంటి సరిత ప్రమాదంలో చనిపోవడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మోహన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు చిరంజీవి కార్యదర్శి రమణయ్య, మండల బాబు, మణికుమార్ సంతాపం వ్యక్తం చేసారు.
కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి
Published Sat, Mar 21 2015 1:51 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement