Teacher killed
-
లేచిపోయాడని.. టీచర్‌ను చంపేశారు!
తమ ఇంటి అమ్మాయిని లేవదీసుకుపోయాడని.. ఓ టీచర్‌ను ఆమె కుటుంబ సభ్యులు కొట్టి చంపేశారు. ఉత్తరప్రదేశ్‌లో లక్నోకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మలిహాబాద్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. రాజ్‌కుమార్ (32) అనే ఈ టీచర్ తన తల్లిదండ్రులతో కలిసి గడాహో గ్రామంలో ఉండేవాడు. ఓ అమ్మాయితో బాగా చనువుగా ఉంటూ.. ఆమెతో కలిసి సోమవారం ఎటో వెళ్లిపోయాడు. అతడి ఆచూకీని ఎలాగోలా కనిపెట్టిన అమ్మాయి తండ్రి రాజారామ్, సోదరులు అనిల్, మునిష్ కలిసి పట్టుకుని.. కొట్టి కొట్టి చంపేశారు. ఆ ముగ్గురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. -
కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి
గూడూరు టౌన్: కారు ఢీకొని ఉపాధ్యాయురాలు మృతి చెందిన సంఘటన గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పట్టణంలోని తిలక్‌నగర్‌కు చెందిన వెర్రి సరిత (35) దుర్మరణం చెందారు. ఆమె గిరిజనకాలనీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. రోజూ తిలక్‌నగర్ నుంచి పురిటిపాళెంలోని పాఠశాలకు స్కూటీ వాహనం పై వెళతారు. పాఠశాలకు ఒంటిపూట బడులు కావడంతో మధ్యాహ్నం విధులు ముగించుకుని వస్తూ జాతీయ రహదారి పై గూడూరులోకి వచ్చే మినీ బైపార్ రోడ్డు వద్ద డివైడర్‌ను దాటుతున్నారు. ఆ సమయంలో నెల్లూరు వైపు వెళుతున్న ఓ కారు వేగంగా స్కూటీని ఢీకొనడంతో సరిత అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాద విషయం తెలుసుకున్న పురిటిపాళెం గ్రామస్తులతో పాటు పట్టణంలోని పలువురు ఉపాధ్యాయులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. సరిత భర్త సుధాకర్ కూడా సైదాపురం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఐదు నెలల కిందట కిడ్నీ వ్యాధితో మృతిచెందాడు. అప్పటి నుంచి పిల్లలకు అన్నీ తానై చూసుకుంటున్న సరిత కూడా మృతిచెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. బంధువులు, స్నేహితులు, తోటి ఉపాధ్యాయులు సరిత మృతదేహం వద్ద బోరున విలపించారు. అప్పటివరకు తమతో ఉన్నటువంటి సరిత ప్రమాదంలో చనిపోవడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మోహన్‌దాస్, జిల్లా అధ్యక్షుడు చిరంజీవి కార్యదర్శి రమణయ్య, మండల బాబు, మణికుమార్ సంతాపం వ్యక్తం చేసారు. -
భర్తే కాలయముడు!
పోతిరెడ్డిపాలెంలో అంగన్వాడీ టీచర్ హత్య ? తండ్రే పీక నులిమి చంపాడంటున్న కొడుకు అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు మూడుముళ్లు వేసి నూరేళ్లూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు !అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను కడతేర్చాడు !! యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో అంగన్వాడీ టీచర్ రాజ్యలక్ష్మి (28) దారుణ హత్యకు గురైంది.తన తల్లిని తండ్రే పీక నులిమి హతమార్చినట్టు ఆరేళ్ల కొడుకు తరుణ్ చెబుతున్నాడు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి... పోతిరెడ్డిపాలెం ఇందిర మ్మ కాలనీలో రాజాన సూర్యనారాయణ, రాజ్యలక్ష్మి నివాసముంటున్నారు. మాకవరపాలెం మండలం జెడ్.గంగవరానికి చెందిన రాజ్యలక్ష్మికి సూర్యనారాయణతో 2006 మే 10న వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు తరుణ్, నాలుగేళ్ల కుమార్తె గ్రీష్మ ఉన్నారు. సూర్యనారాయణ స్థానికంగా చిన్న కాన్వెంట్ నడుపుతున్నాడు. భార్య రాజ్యలక్ష్మి పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు రామభద్రపురంలో అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తోంది. మద్యానికి బానిసైన సూర్యనారాయణ తరచూ భార్యను వేధించేవాడు. గతంలో పలుమార్లు గ్రామపెద్దలు, యలమంచిలి పోలీసు లు, అనకాపల్లి మహిళా పోలీసులకు కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి బాగా మద్యం సే వించి వచ్చిన సూర్యనారాయణ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వివాదం పెద్దదైంది. అనంతరం రాజ్యలక్ష్మి నిద్రపోగా ఆమె పీక నులిమి చంపినట్లు సంఘటనా స్థలంలో ఆధారాలు తెలియజేస్తున్నాయి. కొడుకు తరుణ్ కూడా ఇదే చెబుతున్నాడు. ఇద్దరికీ ముఖం, మెడ భాగాల్లో గోళ్ల రక్కులు ఉండటం, గదుల్లో చేతిగాజులు ముక్కలు, ముక్కలుగా పడి ఉండటం కన్పించాయి. అనంతరం ఆమెను మూడో గదిలో స్లాబ్‌కున్న ఇనుప కొక్కానికి చీరతో వేలాడదీశాడు. శుక్రవారం రాత్రి తాను నిద్రిస్తున్న సమయంలో ఉరిపోసుకుని చనిపోయిందంటూ శనివారం ఉదయం సూర్యనారాయణ అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ కె.రామకృష్ణ, ఏఎస్ఐ హరి జోన్స్ సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కలవారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. తన కూతురిది హత్యే : కూతురు మృతి వార్త తెలుసుకున్న ఆమె తల్లి గంగతల్లి బంధువులతో కలిసి మాకవరపాలెం మండలం జెడ్.గంగవరం నుంచి పోతిరెడ్డిపాలెం చేరుకుంది. రాజ్యలక్ష్మి మృత దేహం వద్ద బోరున విలపించింది. నిత్యం చిత్రహింసలు పెడుతున్న సూర్యనారాయణే తమ కూతుర్ని హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు 498ఎ, 306 సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్ఐ రామకృష్ణ చెప్పారు. అయితే ఆమె తాను హత్యచేయలేదని, ఉరిపోస్తుకుందని సూర్యనారాయణ చెబుతున్నాడు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
కంభం రూరల్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో ఢీకొన్న లారీలోని డ్రైవర్, ఆగి ఉన్న లారీలోని ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన కంభం సమీపంలోని సీఎల్ఆర్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా గుర్రంకొండ నుంచి టమోటా లోడుతో అనకాపల్లి వెళ్తున్న లారీ టైరుకు స్థానిక సీఎల్ఆర్ కాలేజీ వద్ద పంక్చరైంది. దీంతో ఆ లారీని రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్ ఆదిబాబు టైరు మారుస్తున్నాడు. అదే లారీలో గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తున్న వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు (45) కిందకిదిగి టైరు మారుస్తున్న డ్రైవర్‌తో మాట్లాడుతూ లారీకి వెనుకవైపు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన సిమెంటు లోడు లారీ మార్కాపురంవైపు వేగంగా వెళ్తూ సీఎల్ఆర్ కాలేజీ వద్ద ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిమెంటు లోడు లారీ నడుపుతున్న వైఎస్ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన డ్రైవర్ బీదా సునీల్‌కుమార్ (40)కు తీవ్రగాయాలై లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు. ఆగి ఉన్న లారీ వెనుకవైపు నిలబడి ఉన్న వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు కూడా రెండు లారీల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆగి ఉన్న లారీకి టైరు మారుస్తున్న డ్రైవర్ ఆదిబాబు తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే లారీ క్లీనర్ హరికృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సిమెంటు లోడు లారీ డ్రైవర్ సునీల్‌కుమార్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. త్వరగా వెళ్లాలన్న ఆతృతే ప్రాణం తీసింది... ఈ ప్రమాదంలో మరణించిన వైఎస్ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన గొంటు తిరుపాలు గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో సొంతూరులో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విధులకు హాజరయ్యేందుకు వినుకొండ బయలుదేరాడు. ముందుగా రాజంపేట నుంచి కంభం చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో వినుకొండ వెళ్లేందుకు స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, రైలు ఆలస్యంగా వస్తుందని తెలియడంతో.. ఎలాగైనా ఉదయం పాఠశాల సమయానికి వినుకొండ చేరుకోవాలన్న ఉద్దేశంతో రోడ్డుపైకి వచ్చి లారీ ఎక్కాడు. కంభం దాటిన కాసేపటికే సీఎల్ఆర్ కాలేజీ వద్ద లారీ టైరు పంక్చరై అంతలోనే మరో లారీ వచ్చి ఢీకొనడంతో మరణించాడు. ఆగి ఉన్న లారీ క్యాబి న్లో కూర్చుని ఉన్న తిరుపాలు కిందికి దిగకుండా ఉన్నా బతికేవాడని ఆ లారీ క్లీనర్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మెదక్-రామాయంపేట ప్రధాన రహదారి పాతూరు శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని పోచమ్మరాళ్ గిరిజనతండాకు చెందిన మేఘావత్ హరిసింగ్(38) మెదక్ పట్టణంలో ఉంటూ రామాయంపేటలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రామాయంపేట నుండి తన బైక్‌పై మెదక్ వస్తుండగా పాతూరు శివారులోని బిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం హరిసింగ్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేణుకతోపాటు ఏడేళ్ల వయసు గల కూతురు ఉంది. అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే హరిసింగ్ మృతితో పోచమ్మరాళ్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.