భర్తే కాలయముడు! | Kalayamudu husband! | Sakshi
Sakshi News home page

భర్తే కాలయముడు!

Published Sun, Sep 14 2014 12:58 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM

భర్తే కాలయముడు! - Sakshi

భర్తే కాలయముడు!

  • పోతిరెడ్డిపాలెంలో అంగన్‌వాడీ టీచర్ హత్య ?
  •  తండ్రే పీక నులిమి చంపాడంటున్న కొడుకు
  •  అల్లుడే చంపేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు
  • మూడుముళ్లు వేసి నూరేళ్లూ తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు !అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యను కడతేర్చాడు !!
     
    యలమంచిలి : యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం ఇందిరమ్మ కాలనీలో అంగన్‌వాడీ  టీచర్ రాజ్యలక్ష్మి (28) దారుణ హత్యకు గురైంది.తన తల్లిని తండ్రే పీక నులిమి హతమార్చినట్టు ఆరేళ్ల కొడుకు తరుణ్ చెబుతున్నాడు. మృతురాలి కుటుంబీకులు, పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి... పోతిరెడ్డిపాలెం ఇందిర మ్మ కాలనీలో రాజాన సూర్యనారాయణ, రాజ్యలక్ష్మి నివాసముంటున్నారు.

    మాకవరపాలెం మండలం జెడ్.గంగవరానికి చెందిన రాజ్యలక్ష్మికి సూర్యనారాయణతో 2006 మే 10న వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు తరుణ్, నాలుగేళ్ల కుమార్తె గ్రీష్మ ఉన్నారు. సూర్యనారాయణ స్థానికంగా చిన్న కాన్వెంట్ నడుపుతున్నాడు. భార్య రాజ్యలక్ష్మి పోతిరెడ్డిపాలెం పంచాయతీ శివారు రామభద్రపురంలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తోంది. మద్యానికి బానిసైన సూర్యనారాయణ తరచూ భార్యను వేధించేవాడు. గతంలో పలుమార్లు గ్రామపెద్దలు, యలమంచిలి పోలీసు లు, అనకాపల్లి మహిళా పోలీసులకు కూడా బాధితురాలు  ఫిర్యాదు చేసింది.

    ఈ నేపథ్యం లో శుక్రవారం రాత్రి బాగా మద్యం సే వించి వచ్చిన సూర్యనారాయణ భార్యతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో వివాదం పెద్దదైంది. అనంతరం రాజ్యలక్ష్మి నిద్రపోగా ఆమె పీక నులిమి చంపినట్లు సంఘటనా స్థలంలో ఆధారాలు తెలియజేస్తున్నాయి. కొడుకు తరుణ్ కూడా ఇదే చెబుతున్నాడు. ఇద్దరికీ ముఖం, మెడ భాగాల్లో గోళ్ల రక్కులు ఉండటం, గదుల్లో చేతిగాజులు ముక్కలు, ముక్కలుగా పడి ఉండటం కన్పించాయి.

    అనంతరం ఆమెను మూడో గదిలో స్లాబ్‌కున్న ఇనుప కొక్కానికి చీరతో వేలాడదీశాడు. శుక్రవారం రాత్రి తాను నిద్రిస్తున్న సమయంలో ఉరిపోసుకుని చనిపోయిందంటూ శనివారం ఉదయం సూర్యనారాయణ అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.యలమంచిలి రూరల్ ఎస్‌ఐ కె.రామకృష్ణ, ఏఎస్‌ఐ హరి జోన్స్ సంఘటనా స్థలానికి వెళ్లి చుట్టుపక్కలవారు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు.
     
    తన కూతురిది హత్యే : కూతురు మృతి వార్త తెలుసుకున్న ఆమె తల్లి గంగతల్లి బంధువులతో కలిసి మాకవరపాలెం మండలం జెడ్.గంగవరం నుంచి పోతిరెడ్డిపాలెం చేరుకుంది. రాజ్యలక్ష్మి మృత దేహం వద్ద బోరున విలపించింది.

    నిత్యం చిత్రహింసలు పెడుతున్న సూర్యనారాయణే తమ కూతుర్ని హత్య చేశాడని రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈమేరకు 498ఎ, 306 సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేశారు. శవపంచనామా అనంతరం ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్‌ఐ రామకృష్ణ చెప్పారు. అయితే ఆమె తాను హత్యచేయలేదని, ఉరిపోస్తుకుందని సూర్యనారాయణ చెబుతున్నాడు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement