రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | The two peoples killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Published Fri, Jun 13 2014 5:02 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 కంభం రూరల్ : రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొనడంతో ఢీకొన్న లారీలోని డ్రైవర్, ఆగి ఉన్న లారీలోని ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన కంభం సమీపంలోని సీఎల్‌ఆర్ కాలేజీ వద్ద గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆ వివరాల ప్రకారం... చిత్తూరు జిల్లా గుర్రంకొండ నుంచి టమోటా లోడుతో అనకాపల్లి వెళ్తున్న లారీ టైరుకు స్థానిక సీఎల్‌ఆర్ కాలేజీ వద్ద పంక్చరైంది. దీంతో ఆ లారీని రోడ్డు పక్కన ఆపిన డ్రైవర్ ఆదిబాబు టైరు మారుస్తున్నాడు.
 
అదే లారీలో గుంటూరు జిల్లా వినుకొండ వెళ్తున్న వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు (45) కిందకిదిగి టైరు మారుస్తున్న డ్రైవర్‌తో మాట్లాడుతూ లారీకి వెనుకవైపు నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన సిమెంటు లోడు లారీ మార్కాపురంవైపు వేగంగా వెళ్తూ సీఎల్‌ఆర్ కాలేజీ వద్ద ఆగిఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిమెంటు లోడు లారీ నడుపుతున్న వైఎస్‌ఆర్ జిల్లా కమలాపురానికి చెందిన డ్రైవర్ బీదా సునీల్‌కుమార్ (40)కు తీవ్రగాయాలై లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించాడు.
 
ఆగి ఉన్న లారీ వెనుకవైపు నిలబడి ఉన్న వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన ఉపాధ్యాయుడు గొంటు తిరుపాలు కూడా రెండు లారీల మధ్య నలిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. ఆగి ఉన్న లారీకి టైరు మారుస్తున్న డ్రైవర్ ఆదిబాబు తలకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే లారీ క్లీనర్ హరికృష్ణ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సిమెంటు లోడు లారీ డ్రైవర్ సునీల్‌కుమార్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు.
 
త్వరగా వెళ్లాలన్న ఆతృతే ప్రాణం తీసింది...

ఈ ప్రమాదంలో మరణించిన వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేటకు చెందిన గొంటు తిరుపాలు గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల్లో సొంతూరులో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విధులకు హాజరయ్యేందుకు వినుకొండ బయలుదేరాడు. ముందుగా రాజంపేట నుంచి కంభం చేరుకున్నాడు. అక్కడి నుంచి రైలులో వినుకొండ వెళ్లేందుకు స్టేషన్‌కు వెళ్లాడు.

అయితే, రైలు ఆలస్యంగా వస్తుందని తెలియడంతో.. ఎలాగైనా ఉదయం పాఠశాల సమయానికి వినుకొండ చేరుకోవాలన్న ఉద్దేశంతో రోడ్డుపైకి వచ్చి లారీ ఎక్కాడు. కంభం దాటిన కాసేపటికే సీఎల్‌ఆర్ కాలేజీ వద్ద లారీ టైరు పంక్చరై అంతలోనే మరో లారీ వచ్చి ఢీకొనడంతో మరణించాడు. ఆగి ఉన్న లారీ క్యాబి న్‌లో కూర్చుని ఉన్న తిరుపాలు కిందికి దిగకుండా ఉన్నా బతికేవాడని ఆ లారీ క్లీనర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement