రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం
Published Thu, Oct 17 2013 4:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మెదక్-రామాయంపేట ప్రధాన రహదారి పాతూరు శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని పోచమ్మరాళ్ గిరిజనతండాకు చెందిన మేఘావత్ హరిసింగ్(38) మెదక్ పట్టణంలో ఉంటూ రామాయంపేటలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.
కాగా మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రామాయంపేట నుండి తన బైక్‌పై మెదక్ వస్తుండగా పాతూరు శివారులోని బిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం హరిసింగ్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేణుకతోపాటు ఏడేళ్ల వయసు గల కూతురు ఉంది. అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే హరిసింగ్ మృతితో పోచమ్మరాళ్‌తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Advertisement