హైవే అథారిటీ ఆధీనంలోకి కర్నూలు-గుంటూరు రహదారి
త్వరలో అభివృద్ధికి చర్యలు
వినుకొండ రూరల్:కర్నూలు- గుంటూరు రాష్ట్ర రహదారికి మహర్దశ పట్టనుంది. ఇప్పటి వరకు రాష్ట్రస్థాయి రహదారిగా ఉన్న కేజీ రోడ్డును నేషనల్ హైవే అథారిటి వారు స్వాధీనం చేసుకుని జాతీయ స్థాయి రహదారిగా మార్పు చేయనున్నారు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్, హైవేస్ ఈ ఏడాది మే 26న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఇప్పటి వరకు ఆర్‌అండ్‌బీ ఆధీనంలో ఉన్న కేజీ రహదారిని నేషనల్ హైవే అథారిటీకి అప్పగించాలని కోరారు. అందులో భాగంగా కేజీ రహదారిని ఆర్‌అండ్‌బీ అధికారులు మరో రెండు రోజుల్లో నేషనల్ హైవే అథారిటికి అప్పగించనున్నారు. అలాగే నేషనల్ హైవేస్ అథారిటీ వారు ఇప్పటికే రహదారి సర్వే పనులకు ప్రైవేటు సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. టెండర్ దక్కించుకున్న సంస్థ కేజీ రహదారిలో సరాసరి ఎన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి, వచ్చే 50 సంవత్సరాల్లో ఎంత మేరకు ట్రాఫిక్ పెరిగే అవకాశం ఉంది, ఎన్ని లైన్లు రహదారిగా రూపొందించాలి తదితర వివరాలు సేకరించి ఎన్‌హెచ్‌కు అప్పగించనున్నారు.
రహదారుల అనుసంధానంలో భాగంగా..
గతంలో ఉన్న కేజీ రోడ్డును రెండు భాగాలుగా చేసి గుంటూరు నుంచి ప్రకాశం జిల్లా తోకపల్లి వరకు ఒకటి, తోకపల్లి నుంచి గిద్దలూరు, నంద్యాల మీదుగా కర్నూలు వరకు దశాబ్దంన్నర క్రితం డబుల్ లైన్‌గా స్టేట్ హైవేస్ అథారిటీ వారు అభివృద్ధి చేశారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత రాష్ట్రంలోని రహదారుల కనెక్టివిటీలో భాగంగా నూతన రాజధానికి అన్ని వైపుల నుంచి రహదారులను అనుసంధానం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారు అయినా నేరుగా రాజధానికి చేరుకునే విధంగా రూపొందిస్తున్న రహదారుల్లో రాయలసీమ ప్రాంతం నుంచి గుంటూరుకు వచ్చే ప్రధాన మార్గాల్లో కేజీ రహదారి ఒకటి. అందులో భాగంగానే ఎన్‌హెచ్ 44 నుంచి ఒకటి, ఎన్‌హెచ్ 40 నుంచి మరొక రోడ్డు మార్గాలను నేషనల్ హైవేస్ అథారిటి వారు స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నారు. ఎన్‌హెచ్ 44లో అనంతపురం వద్ద నుంచి తాడిపత్రి, కొలిమిగుండ్ల, బనగానపల్లి, గాజులపల్లి, గిద్దలూరు, కంభం, తోకపల్లి, వినుకొండ, నరసరావుపేట మీదుగా గుంటూరు వద్ద నున్న ఎన్‌హెచ్16కు కలపనున్నారు. ఎన్‌హెచ్ 40 రహదారిలో కర్నూలు వద్ద నుంచి నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్నారు. అనంతపురం నుంచి గుంటూరు వరకు నూతనంగా అభివృద్ధి చేయనున్న రహదారికి ఎన్‌హెచ్ 544డి, కర్నూలు నుంచి దోర్నాల వరకు అభివృద్ధి చేయనున్న రహదారికి 340సిగా నేషనల్ హైవేస్ అథారిటీ వారు పేర్కొన్నారు.
వినుకొండకు బైపాస్ రోడ్డు వేస్తారా?
రోడ్డు విస్తరణ అన్న ప్రతిసారి వినుకొండ వాసుల్లో గుబులు మొదలవుతుంది. పట్టణం మధ్య నుంచి వెళ్తున్న కేజీ రోడ్డు అభివృద్ధిలో భాగంగా మొదటి దశలో నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. నాలుగులైన్లుగా అభివృద్ధి చేయటం వలన పట్టణంలోని గ్రామకంఠ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్న ఆక్రమ కట్టడాలు కూల్చివేయటం ఖాయంగా కనిపిస్తుంది. అలా కాకుండా ప్రస్తుతం పట్టణంలో ఉన్న రహదారిని అలాగే ఉంచి బైపాస్ వేసినట్లయితే వ్యాపారాలు పడిపోతాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది.
కేజీ రోడ్డు.. ఇక ఎన్‌హెచ్
Published Wed, Oct 28 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM
Advertisement