విశోక సంద్రం!
21 మంది ప్రాణాలు బలి తీసుకున్న హుదూద్ అంచనాలకు అందని భారీ నష్టం
మారిపోయిన మహానగరం రూపురేఖలు
ఎటు చూసినా కూలిన వృక్షాలు, తెగిన విద్యుత్ వైర్లు, దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు
ఆహారం దొరక్క జనం అవస్థలు
బాధితులకు ఆమడదూరంలో ప్రభుత్వ యంత్రాంగం
అంధకారంతో జనం దుర్భర జీవనం
ఉక్కునగరంలో నిలిచిన ఉత్పత్తి
విశాఖపట్నం: అంచనాలకు అందని హుదూద్ తుపాను బీభత్సం విశాఖ నగరంలో జనజీవనాన్ని కకావికలం చేసింది. ప్రళయ తాండవం చేసిన తుపాను విశాఖ జిల్లావ్యాప్తంగా 15 మంది, మిగతా జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఆకలి కేకలు, క్షతగాత్రుల ఆక్రందనలతో సముద్రం ప్రతిధ్వనిస్తోంది. ఒక్కరోజులో హుదూద్ మిగిల్చిన భారీ నష్టం విశాఖ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో విశాఖ రావాలనుకున్నప్పటికీ జాతీయ రహదారిపై ప్రయాణం అనుకూలంగా లేదని అధికారులు వారించడంతో హెలికాప్టర్ ద్వారా నగరానికి చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
తాగునీరూ కరువే
హుదూద్‌తో భారీ ముప్పు తప్పదని ముందునుంచీ హెచ్చరికలు వస్తున్నా, ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. తుపాను నగరాన్ని ఢీకొట్టిన క్షణం నుంచి సోమవారం రాత్రి వరకూ నగరంలో ఒక్క ఆహార పొట్లాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ప్రజలను ఆదుకుంటామని, విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కేవలం నీటిమూటలుగానే మిగిలిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు మచ్చుకైనా దొరకడంలేదు. ఇళ్లల్లో నిల్వ ఉంచిన సరుకులు నిండుకోవడంతోపాటు ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాడైపోతున్నాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. పక్క జిల్లాల నుంచి ఆహారం, తాగునీరు హెలికాప్టర్లలో తెప్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ఇదే అదునుగా కొందరు స్వార్థపరులు ఆహారాన్ని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. మద్యం షాఫులు మినహా భారీ షాపింగ్‌మాల్స్‌తో సహా మరే ఇతర దుకాణాలు తెరుచుకోలేదు. పాలు, అల్పాహారం, భోజనం ఏది కావాలన్నా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి సరుకును దాని అసలు రేటు కంటే ఐదు నుంచి పది రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు.
రోడ్డు, విద్యుత్ పునరుద్ధరణకు కృషి
ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉభయగోదావరి జిల్లాల నుంచి వందలాదిమంది సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తరలించింది. జాతీయ రహదారుల వెంబడి కూలిపోయిన వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను పునరుద్ధరించడానికే వారికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో నగరంలో కూలిన చెట్లను ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. సోమవారం రాత్రికి కూడా నగరంలో విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. మధ్యాహ్నం నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌తోపాటు మరికొన్ని సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫోన్లు చార్జింగ్ లేకపోవడంతో పనిచేయలేదు. రవాణా వ్యవస్థను మధ్యాహ్నం సమయానికి కొద్దిగా పునరుద్ధరించారు. నగరం వీధుల్లో మాత్రం వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడంతో ప్రజలు కాలినడకన వెళుతున్నారు. పెట్రోల్ బంకులు పనిచేయడం లేదు. ఎక్కడో ఓ చోట ఒకటి రెండు బంకులు తెరుచుకుంటే జనం తీర్థంలా క్యూ కడుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తినడానికి తిండి కరువైంది. తుపాను ధాటికి ఫిషింగ్ బోట్లు దెబ్బతిన్నాయి. జీవనాధారం కోల్పోయి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి చోటా తుపాను మిగిల్చిన శిధిల సాక్ష్యాలు దర్శనమిస్తున్నాయి.
సాగర తీరం కళావిహీనం
విశాఖ సాగరతీర అందాలు తుపాను ధాటికి కళావిహీనమయ్యాయి. అలల తాకిడికి ఆర్‌కే బీచ్ అందాలు తుడుచుకుపోయాయి. సబ్‌మెరైన్ మ్యూజియం గోడ కూలిపోగా సబ్‌మెరైన్ సైతం కొంతమేర ధ్వంసమైంది. నేవీ అమరవీరుల స్థూపం(విక్టరీఎట్ సీ) పార్క్‌లో ఏర్పాటుచేసిన నమూనా యుద్ధవిమానం నేలకూలింది. తీరంలో ఇసుక రోడ్డుమీదకు వచ్చి రోడ్డంతా ఇసుకతో నల్లగా మారింది. సాగర్‌నగర్ , రుషికొండ, తెన్నేటి పార్క్, జోడుగుళ్లు పాలెం వద్ద సాగరతీరం కోతకు గురైంది. సముద్రం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. వర్షం దాటికి తీరం వెంబడి రుషికొండ బీచ్ వద్ద రోడ్డు కోతకు గురై అందవిహీనంగా తయారైంది.
వణికిపోయిన ఉక్కునగరం
అంతర్జాతీయ ఖ్యాతిని విశాఖపట్నానికి తీసుకువచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం తుపాను ధాటికి పండుటాకులా వణికిపోయింది. ప్రచండ గాలుల ధాటికి స్టీల్‌ప్లాంట్‌లోని దాదాపు 12 విభాగాలు షట్‌డౌన్ అయ్యాయి. 1971లో ప్రారంభించిన ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జపాన్, జర్మనీ, యునెటైడ్ స్టేట్స్, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు
ఎగుమతులు నిలిచిపోయాయి. స్టీల్ ప్లాంట్ అవసరాలకు నెలకొల్పిన 236 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సింహాద్రి (ఎన్‌టీపీసీ) ధర్మల్ పవర్ కేంద్రం పూర్తిగా పనిచేయడం మానేసింది. విశాఖ పోర్టులో దాదాపు ఐదువేల మెట్రిక్ టన్నుల యూరియా నీటమునిగింది. దీంతో భారీగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.