Visakhapatnam city
-
కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ నగరం అడుగులు.. భారీ ప్రాజెక్టులతో కళకళ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అభివృద్ధిలో దూసుకెళుతున్న విశాఖ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగస్టు 1వతేదీన శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు నిర్వహించనున్నారు. నగర అభివృద్ధితో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవన ప్రమాణాల్ని అందించే లక్ష్యంతో ఇవి రూపుదిద్దుకున్నాయి. రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్‌కు మంగళవారం విశాఖలో శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్ అదేరోజు జీవీఎంసీ పరిధిలో మరో 50 పనులకు భూమి పూజ చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉపాధి, నైపుణ్య అవకాశాల్ని కల్పించే నాలుగు ప్రాజెక్టులను కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్స్‌పై సానుకూలం.. ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖ నగరం కార్యనిర్వాహక రాజధానిగా అడుగులు వేస్తోంది. సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రణాళికలు, ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఐటీ హబ్‌గా మార్చేందుకు బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో దిగ్గజ సంస్థలను ఆహ్వనించిన ప్రభుత్వం పర్యాటక రంగంలోనూ అదే ఒరవడిని అనుసరిస్తోంది. ఇప్పటికే అన్నవరం సమీపంలో రూ.350 కోట్లతో ఒబెరాయ్ లగ్జరీ రిసార్టుల ప్రాజెక్టుకు భూమి పూజ జరిగింది. తాజాగా దిగ్గజ సంస్థ రహేజా గ్రూప్ భారీ మాల్ని నిర్వించనుంది. మాల్ శంకుస్థాపనకు ఆహ్వనించేందుకు రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఇటీవలే ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న మాల్ని మూడేళ్లలోగా పూర్తి చేయాలని రహేజా లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనిద్వారా 5 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇనార్బిట్ మాల్ నిర్మాణంలో భాగంగా ఐటీ టవర్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని సీఎం జగన్ రహేజా గ్రూప్ ప్రతినిధులకు సూచించారు. దీనిపై కంపెనీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ ప్రాజెక్టులు ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన అనంతరం అదే ప్రాంగణంలో విశాఖ ప్రజలకు మౌలిక సదుపాయాలు, నగర సుందరీకరణ, వివిధ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. అమృత్ 2.0, స్మార్ట్ సిటీ, 15వ ఆరి్థక సంఘం నిధులు రూ.135.88 కోట్లతో చేపట్టనున్న 50 పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. శివారు, జీవీఎంసీ విలీన ప్రాంతాలైన మధురవాడ, లంకెలపాలెం, గాజువాక, అనకాపల్లి తాగునీటి కష్టాలను తీర్చేలా పైప్‌లైన్ ప్రాజెక్టులు, మురికివాడల్లో అభివృద్ధి పనులు, రూ.30 కోట్లతో జీవీఎంసీ పరిధిలోని 10 చెరువుల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ.6.4 కోట్ల స్మార్ట్‌సిటీ నిధులతో యూరోపియన్ స్టైల్లో సాగర్‌నగర్, డిఫెన్స్ కాలనీ వద్ద నిర్వించనున్న ఈట్ స్ట్రీట్స్తో పాటు రూ.6 కోట్లతో స్మార్ట్ స్ట్రీట్, రూ.12 కోట్లతో విశాఖ నగరంలోని పలు ప్రధాన రహదారులు, జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించిన జీవీఎంసీ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఉపాధి, నైపుణ్యాలను పెంచేలా.. ఉత్తరాంధ్ర విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా సీఎం జగన్ నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రూ.129 కోట్లతో చేపట్టిన కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం ఏయూ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. ఏయూలో రూ.21 కోట్లతో 30,000 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన ఏయూ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్(అ–హబ్)ని సీఎం ప్రారంభించనున్నారు. ఇందులో ప్రస్తుతం 121 స్టార్టప్ కంపెనీలకు చోటు కల్పించారు. రూ.44 కోట్లతో 55 వేల చ.అడుగుల విస్తీర్ణంలో బయోటెక్, ఫార్మా, జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం నిర్మించిన ఎలిమెంట్ (ఏయూ ఫార్మా ఇంక్యుబేషన్ అండ్ బయోలాజికల్ మానిటరింగ్ హబ్)ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. రూ.35 కోట్లతో 60 వేల చ.అడుగుల విస్తీర్ణంలో నిర్వించిన అల్గారిథమ్ (ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)ని సీఎం జగన్ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు. ఐఐఎంతో ఒప్పందంలో భాగంగా రూ.18 కోట్లతో 25 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ అనలిటిక్స్‌లో ప్రత్యేక కోర్సులందించేందుకు నిర్వించిన ఏయూ–సిబ్(ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)ని సీఎం ప్రారంభించనున్నారు. రూ.11 కోట్లతో అవంతి సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రూ.11 కోట్లతో మెరైన్ అగ్రికల్చర్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో యువతకు నైపుణ్యం అందించేందుకు నిర్వించిన ఏయూ అవంతి ఆక్వాకల్చర్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్ హబ్‌ని ముఖ్యమంత్రి జగన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇనార్బిట్ మాల్ ప్రత్యేకతలివీ.. నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్ విస్తీర్ణం : 17 ఎకరాలు (6 లక్షల చ.అడుగులు) ఎక్కడ : విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని సాలిగ్రామపురంలో ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ లీజు వ్యయం: 30 ఏళ్లకు రూ.125 కోట్లు శంకుస్థాపన : ఆగస్ట్ 1వ తేదీన పూర్తి : మూడేళ్ల వ్యవధిలో నిర్మాణం ఇలా: రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్, 5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7, 8వ ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సరికొత్త విశాఖ ఆవిష్కృతం విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సరికొత్త నగరం ఆవిష్కృతమవుతోంది. ఇప్పటికే భారీ ప్రాజెక్టులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు కూడా మొదలయ్యాయి. పర్యాటక ప్రాజెక్టులతో పాటు ఐటీ సంస్థల రాకతో నగరం కళకళలాడుతోంది. ఆగస్ట్ 1 న దాదాపు రూ.865 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్ -
నయా ‘ఆన్లైన్’ మోసం
దొండపర్తి (విశాఖ దక్షిణ): ‘హలో సర్.. ఆన్లైన్లో మీరు పెట్టిన ఆర్డర్ వచ్చింది. కేవలం రూ.270 చెల్లించండి’ అంటూ విశాఖపట్నం ఉషోదయ జంక్షన్లో నివాసముంటున్న ఒక మహిళకు ఫోన్ వచ్చింది. ఆర్డర్ ఇవ్వలేదని చెప్పినా.. తక్కువ ధరకు ప్రొడక్ట్ వచ్చిందని చెప్పడంతో ఆమె కొరియర్‌ను తీసుకున్నారు. డబ్బులు చెల్లించాక కొరియర్‌ను తెరిచి చేస్తే అందులో పాత డ్రెస్ ఉంది. వెంటనే బిల్‌పై ఉన్న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయగా.. విషయం చెప్పకముందే ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాట్లాడుతూ.. ‘మీ ఐటెమ్‌ను తిరిగి ఇచ్చేయాలనుకుంటున్నారా? మీ ఫోన్ నంబర్‌కు లింక్ పంపిస్తున్నాం. అది ఓకే చేస్తే అమౌంట్ మీకు తిరిగొస్తుంది’ అని చెప్పాడు. అసలు విషయం చెప్పకముందే సదరు వ్యక్తి అలా చెప్పే సరికి ఆమెకు అనుమానం వచ్చింది. లింక్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అవుతుందని భావించి వెంటనే ఆమె సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలోకి బిహార్ గ్యాంగ్! ఆన్లైన్ లోన్ యాప్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, డేటింగ్ యాప్‌ల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ లింక్‌లు.. ఇలా అనేక మార్గాల్లో దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఆన్లైన్ కేటుగాళ్లు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. తాజాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తరహాలో ఆన్లైన్ ఆర్డర్, కొరియర్ పేరుతో ప్రజలను దోచుకోడానికి కొత్త పంథాను ఎంచుకున్నారు. బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన గ్యాంగ్ నగరంలోనే తిష్టవేసి.. ఆన్లైన్లో ఆర్డర్స్ పేరుతో బుక్ చేసుకోకపోయినా ఫోన్లు చేసి కొరియర్‌ను అందిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు విశాఖ నగరంలో ఒక ప్లాట్‌లో ఉంటున్న ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉందని.. ఈ ఆరుగురికి కొరియర్ మోసాలతో సంబంధం ఉందో, లేదో విచారణలో తేలుతుందని అంటున్నారు. కొరియర్లో పనికిరాని వస్తువులు కొరియర్‌ను తెరిచి చూస్తే అందులో వాడేసిన బట్టలు, పగిలిపోయిన చిన్న చిన్న వస్తువులు ఉంటున్నాయి. ఇటువంటివి డెలివరీ అయితే డబ్బులు చెల్లించిన వారు తప్పకుండా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడం సర్వసాధారణం. ఆ గ్యాంగ్‌కు కావాల్సింది కూడా ఇదే. అలా కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసిన వెంటనే.. ఎటువంటి సమాచారం అడగకుండానే.. ‘మీ ఆర్డర్‌ను రిటర్న్ ఇచ్చేస్తున్నారా? మీకు లింక్ పంపిస్తాం. దాన్ని క్లిక్ చేస్తే మీ డబ్బులు రిఫండ్ అయిపోతాయి’ అని సమాధానమిస్తున్నారు. ఒకవేళ ఆ లింక్‌ను క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఆర్డర్ చేయకుండా వచ్చే కొరియర్ల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ సూచించారు. -
వైజాగ్‌లో ప్రారంభమైన స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017’ కార్యక్రమం గురువారం విశాఖ నగరంలో ప్రారంభమైంది. ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్)కి సంబంధించి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థలు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌లు తదితర వర్గాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఫిన్‌టెక్ వ్యాలీ వైజాగ్ పేరుతో ఓ వేదిక(కంపెనీ)ను ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాలకు సంబంధించి సరికొత్త టెక్నాలజీలకు వీలుగా ఐడియాలతో వచ్చే వారికి ఆర్థిక సహకారం, సదుపాయాలు, మార్గదర్శకత్వం ఈ వేదిక నుంచి లభిస్తాయి. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశ్యంతో ఈ సంస్థ వైజాగ్ స్ప్రింగ్ కాన్ఫరెన్స్ 2017 పేరుతో గురు, శుక్రవారాల్లో సదస్సు నిర్వహిస్తోంది. ఫిన్‌టెక్ రంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలను గుర్తించేందుకు వీలుగా ఈ సమావేశంలో ప్రతినిధుల మధ్య చర్చలు జరగనున్నాయి. విప్లవాత్మక మార్పులకు కారణమయ్యే ఆలోచనలతో వచ్చే సంస్థలు, ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సుకు హాజరైన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సలహాదారు జేఏ చౌదరితోపాటు సింగపూర్‌కు చెందిన ఫిన్‌టెక్ అండ్ ఇన్నోవేషన్ గ్రూప్ డైరెక్టర్ రాయ్టియో, కేజీఎంజీ పార్ట్నర్ ఉత్కర్‡్ష పాల్నిత్కర్, ఫిడెలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీవోవో జార్జ్ ఇనసు, సింగపూర్‌కు చెందిన టీఐఈ చైర్మన్ పునీత్ పుష్కర్న సహా 30 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొన్నారు. -
విశాఖలో పలుచోట్ల మళ్లీ వర్షం
విశాఖపట్నం : విశాఖపట్నం నగరంలో మంగళవారం మళ్లీ పలు చోట్ల వర్షం పడుతుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయినాయి. అనకాపల్లి బస్టాండ్ ఇంకా వరద నీటిలోనే చిక్కుకుని ఉంది. ఎలమంచిలిలో ఇంకా 1500 ఇళ్లు నీటిముంపులనే ఉన్నాయి. నారాయణపురం కాజ్‌వేపై వరద ఉధృతి అధికంగా ఉంది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా వారంరోజుల్లో 10 మంది మృతి చెందారు. -
కౌలుకు శ్మశానం!
శ్మశాన భూముల సర్వే రిపోర్టులు బుట్టదాఖలు గతంలో రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే కలెక్టరు బదిలీతో ఆగిన చర్యలు విశాఖపట్నం: ఎక్కడయినా రైతుల భూము లు కౌలుకు ఇస్తుంటారు. ఇందులో విడ్డూరమేం లేదు. మరి శ్మశానాన్ని ఎక్కడయినా కౌలుకు ఇవ్వడం తెలుసా... ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు కదూ... ఔను నిజమే మరి. ఇది గోపాలపట్నం శివారు వెంకటాపురంలో జరుగుతున్న వింత. ‘శ్మశానాలు కబ్జా చేసి కౌలుకిస్తుంటే చూస్తూ ఊరుకుంటారా... మీరుండి దేనికి... సర్వే చేసి చర్యలు తీసుకోండని రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ శేషాద్రి ఆదేశించినా రెవెన్యూ, జీవీఎంసీ అధికారులు ఆ దిశగా స్పందించలేదు. కలెక్టర్ ఆదేశించాక ఏదో హడావుడిగా ఆ ప్రదేశాన్ని చూసి వెళ్లిపోయారు. ఇపుడా ఫైలు బుట్టదాఖలు చేసేశారు అధికారులు. ఆ సర్వే ఏమయిందో... భూములు ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్రశ్నార్థకంగా ఉంది. వెంకటాపురం సర్వే నంబరు 109, 110లో దాదాపు 7.35 ఎకరాల విస్తీర్ణంలో శ్మశాన స్థలం ఉంది. వెంకటాపురం, పద్మనాభనగర్, ఎస్సీ బీసీ కాలనీ, కంపరపాలెం, నందమూరినగర్ ప్రాంతాలకు ఇదే శ్మశానం. ఇక్కడ జీవీఎంసీ అభివృద్ధి పనులు చేపట్టకపోవడంఆక్రమణదారులకు ఇష్టారాజ్యమయింది. కౌలుకు శ్మశానం : శ్మశాన స్థలాన్ని కొందరు అంచెలంచెలుగా ఆక్రమించి పొలాలుగా మార్చేశారు. అరటితోటలు, మిర్చితోటలు, వరి, నువ్వులు పండిస్తున్నారు. ఇలా ఇక్కడ దుక్కు దున్నేసి ఇపుడు శ్మశానానికి పావు ఎకరమే మిగిల్చారంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ భూఆక్రమణకు పాల్పడినవారు ఇంకో ఘనకార్యం చేశారు. వీరు మరికొందరికి ఇక్కడి భూములు కౌలుకిచ్చి సొమ్ము చేసుకుంటుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక్కడ కోట్ల విలువయిన భూమి అన్యాక్రాంతమవడంపై ఇంతవరకూ పనిచేసిని జిల్లా కలెక్టర్లందరికీ స్ధానికులు ఫిర్యాదులు చేస్తుండడడం, కిందిస్ధాయి అధికారులకు మొక్కుబడిగా ఆదేశాలిచ్చి ఆ ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం సాధారణమయిపోయింది. ఫలించని ఆదేశాలు : ఇక్కడి ఆక్రమణలపై గతంలో కలెక్టర్లుగా పనిచేసిన ప్రవీణ్‌ప్రకాష్, శేషాద్రి స్పందించారు. భూములు స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ నిర్మించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కదిలినట్లు నటించారు. అప్పట్లో ఇక్కడ రెవెన్యూ, జీవీఎంసీ సంయుక్త సర్వే చేపట్టారు. సర్వే రికార్డుల ఆధారంగా భూముల్ని పరిశీలించారు. అయినా చర్యలు జరిగితే ఒట్టు. దీంతో ఆక్రమణదారులు మరింత ముందుకొచ్చేశారు. ఉన్న భూమిని కుదించేశారు. ఇలా ఫిర్యాదు చేసీ చేసీ స్థానికులు విసిగిపోయారు. అధికారులపై నమ్మకం కోల్పోయారు. -
అలజడి పట్టదా..
విశాఖ తీరాన్నిపట్టించుకోని ప్రభుత్వం కార్యకర్తలకు కాంట్రాక్టులు కట్టబెట్టడానికే చూస్తోంది ప్రభుత్వంపై మండిపడ్డ విపక్ష నేత సింహాచలం అప్పన్ననుదర్శించుకున్న జగన్ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు కోలాహలంగా పర్యటన తీరం కోతపై చలించారు. ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు...హెడ్ గ్రోయిన్ బ్రేక్ వాటర్ విధానాన్ని అమలు చేయాలని కర్తవ్యబోధ చేశారు. సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు... రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించారు.. తాము అధికారంలోకి రాగానే పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శారదా పీఠం పూజల్లో పాల్గొన్నారు. అడుగడుగునా తనను కలిసిన అభిమానులు, కార్యకర్తలతో మమేకమయ్యారు. ఇదీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖ నగరంలో పర్యటన సంగ్రహంగా... విశాఖపట్నం: ఒక రోజు పర్యటనకు విశాఖపట్నం వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రోజంతా క్షణం తీరిక లేకుండా గడిపారు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకున్న వై.ఎస్.జగన్‌కు విమానాశ్రయం వద్ద పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నగరంలోని సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో జిల్లా వ్యవహారాలపై చర్చించారు. కార్యకర్తలతో ముచ్చటిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తీరం కోత పరిశీలన: కొంతకాలంగా కోతకు గురవుతున్న ఆర్కేబీచ్‌లోని కురుసుర జలాంతర్గామి మ్యూజియం సమీప ప్రాంతాన్ని పరిశీలించారు. విశాఖ తీరాన్ని జగన్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు పరిశీలించారు. అక్కడి పరిస్థితిని చూసి ప్రతిపక్ష నేత చలించిపోయారు. ఇంతగా బీచ్ కోతకు గురవుతున్నా, పెను ప్రమాదం పొంచి ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. జపాన్, అమెరికా, సింగపూర్ వంటి సముద్ర తీర దేశాల్లో పర్యటిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశాలు తీర రక్షణకు తీసుకుంటున్న చర్యలను కనీసం చూడలేకపోయారెందుకని ప్రశ్నించారు. తాత్కాలిక చర్యలతో సరిపుచ్చడమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయ విధానంలో శాశ్వత చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. గ్రామాలకు గ్రామాలే సముద్రంలో కలిసిపోతున్నా, ప్రజల జీవనోపాధి దెబ్బ తింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలిక చర్యలంటూ అలలకు కొట్టుకుపోయే నాలుగురాళ్లు వేసి ఏదో చేసేస్తున్నామంటున్న అధికారులు, పాలకుల తీరును జగన్ ఎండగట్టారు. టీడీపీ నాయకుల జేబులు నింపేందుకు నామినేషన్ పద్ధతిలో ఏకంగా మూడున్నర కోట్లు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. అక్కడి నుంచి సింహాద్రి అప్పన్న దర్శనానికి వెళ్లారు. జగన్మోహన్రెడ్డి సింహాచలం దేవస్థానానికి వెళ్లి శ్రీ వరాహలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. దేవస్థానంలోని కప్పస్తంభాన్ని జగన్ ఆలింగనం చేసుకుని బేడా మండపం చుట్టూ ప్రదక్షిణ చేశారు. అనంతరం దేవస్థానం అంతరాయంలో స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వై.ఎస్. జగన్ పేరు మీద అష్టోత్తర పూజ చేశారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం ఆస్థాన మండపంలో అర్చకులు వై.ఎస్.జగన్‌ను వేదమంత్రోచ్ఛరణతో ఆశీర్వదించారు. అప్పన్న భూముల సమస్యపై ఈ సందర్భంగా జగన్ స్పందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ భూములను ఇప్పటికే క్రమబద్దీకరించి ఉండేవాళ్లమన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు కచ్చితంగా మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు. అనంతరం శారదాపీఠానికి బయలు దేరారు. ఈ పర్యటనలో జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ డి. సూర్యనారాయణ రాజు, ఎమ్మెల్యేలు సుజయ్కష్ణ రంగారావు, బూడి ముత్యాల నాయుడు, కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, విశ్వసరాయి కళావతి, కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, కర్రి సీతారాం, మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయ్‌కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల గురుమూర్తి రెడ్డి, చెంగల వెంకట్రావు, పాలవలస రాజశేఖరం, నియోజవర్గాల సమన్వయకర్తలు వంశీకష్ణ, కోలా గురువులు, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్, పెట్ల ఉమా శంకర్ గణేష్, ప్రగడ నాగేశ్వరరావు, ఏపీటీఎస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు జాన్ వెస్లీ, కంపా హనోక్, సీఈసీ సభ్యుడు దామ సుబ్బారావు, పార్టీ నేతలు ఉషా కిరణ్, పక్కి దివాకర్, రవిరెడ్డి, బల్లాడ జనార్ధన్‌రెడ్డి, హేమామాలిని రెడ్డి, విల్లూరి భాస్కర్‌రెడ్డి, పీలా వెంకటలక్ష్మి, జియ్యాని శ్రీధర్, అంగ అప్పలరాజు, శానాపతి అప్పారావు కార్యకర్తలు పాల్గొన్నారు. + రాష్ట్రానికి మంచి జరగాలని పెందుర్తి నియోజకవర్గం చినముషిడివాడలోని శారాదా పీఠాన్ని జగన్ సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. పీఠం ప్రధాన ద్వారం వద్ద వేదపండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జగన్ నేరుగా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కలుసుకుని ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో సమావేశమై పీఠం గురించి తెలుసుకున్నారు.స్వామీజీతో కలసి రాష్ట్రానికి మంచి జరగాలని జగన్ పీఠ ప్రాంగణంలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాలను సందర్శించి కళశారాధన చేశారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. పీఠం సంప్రదాయం ప్రకారం వేదపండితులు వై.ఎస్.జగన్‌ను సత్కరించారు. క్షణం తీరిక లేకుండా సాగిన సుడిగాలి పర్యటన ను ముగించుకుని జగన్ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. -
4కు చేరిన సిలిండర్ పేలుడు మృతుల సంఖ్య
విశాఖ:ఈనెల 9వ తేదీన నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలో రంగిరీజు వీధిలో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. మంగళవారం పకోడీల వ్యాపారి సూరిబాబు సెవెన్స్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించడంతో నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. -
విశాఖలో సిలిండర్ పేలుడు : ఇద్దరు మృతి
-
విశాఖలో సిలిండర్ పేలుడు : ఒకరు మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం నగరంలోని పూర్ణ మార్కెట్ సమీపంలోని రంగ్రీజు వీధిలో ఓ ఇంట్లో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నెలల పసికందు మరణిచింది. మరో18 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేస్థానికులు వెంటనే అగ్నిమాపకశాఖ, పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురు శరీరాలు పూర్తిగా కాలిపోయాయి. మరో నలుగురికి తీవ్రంగా గాయలయ్యాయని... వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. సిలిండర్ పేలుడులో ఇల్లు కుప్పకూలింది. పోలీసులు స్థానికులతో కలసి సహాయక చర్యల చేపట్టారు. పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. -
ప్రతిపాదనలు పట్టాలెక్కేనా..
రైల్వేబోర్డుకు ఎంపీల ప్రతిపాదనలు వచ్చేనెలలో సాధ్యాసాధ్యాలపై చర్చ ఏటా మిగులుతున్న నిరాశ ఈసారైనా ప్రజాకాంక్షలకు బడ్జెట్ పట్టంకట్టేనా.. విశాఖపట్నం సిటీ: ఈసారైనా బడ్జెట్లో తమ డిమాండ్లు నెరవేరాలని రైల్వే ప్రయాణికులు కోరుకుంటున్నారు. బడ్జెట్‌కు ముందస్తు కసరత్తు దగ్గరపడ్డంతో ప్రజాప్రతినిధులు ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎప్పటిలాగే ఇండియన్ రైల్వే టైంటేబుల్ కమిటీ(ఐఆర్‌టిటిసి) నవంబర్‌లో ఎంపీల నుంచి ప్రతిపాదనలను కోరింది. దీనిపై కొందరిప్పటికే నివేదికలు సమర్పించారు. మరి కొందరు ఇవ్వాల్సి వుంది. ఈనెల మొదటి వారంలో ఎంపీలు కోరిన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారులు సర్వే చేస్తారు. సర్వే అనంతరం వచ్చే నెలలో వీటిపై చర్చించి కొన్నింటిని ఆమోదిస్తారు. ఆమోదం పొందిన అంశాలను బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈసారి ఎంపీలు ఐఆర్‌టిటిసికి ఇచ్చిన ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇవీ ప్రయాణికుల డిమాండ్లు వారణాసికి రెగ్యులర్ రైలు అవసరముంది. లేకుంటే భువనేశ్వర్, సికింద్రాబాద్ వెళ్లి అక్కడి నుంచి మరో రైలు మారి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీకి నాన్ స్టాప్ ఎక్స్‌ప్రెస్ రైలు కావాలి. విశాఖ నుంచి అవృతసర్‌కు వెళుతున్న హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్‌ను రెగ్యులర్ చేయాలి. ప్రతీ సోమ, గురు, శుక్రవారాల్లో విశాఖ నుంచి బయల్దేరుతున్న ఈ రైలును రెగ్యులర్ చేస్తే ప్రస్తుతానికి కాస్త రద్దీని నియంత్రించేనట్టేనని రైల్వే వర్గాలంటున్నాయి. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నాన్‌స్టాప్ ఏసీ దురంతో ఎక్స్‌ప్రెస్ ఆది, మంగళ, గురువారాల్లో బయల్దేరుతుంది. ఈ రైలును రెగ్యులర్ చేస్తే కాస్త హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఉపయోగకరంగా వుంటుంది. నగరం నుంచి బెంగుళూరుకు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కయింది. మరొక రైలు కోసం ఎంపీలు పట్టుబడితే ప్రయోజనం వుంటుంది. రైల్వేబోర్డును ఎంపీలడిగిన రైళ్లివి: ఎంపీ కె. హరిబాబు ఢిల్లీకి విశాఖ నుంచి రైలు కావాలని అడుగుతున్నారు. రైల్వే జోన్ డిమాండ్‌ను ఆయన ప్రస్తావించలేదని తెలిసింది. విజయవాడ నుంచి తెలంగాణా మీదుగా వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ ను విశాఖ మీదుగా మళ్లించాలని కోరారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు నర్సీపట్నం నుంచి వయా చోడవరం మీదుగా కొత్తవలసకు కొత్త రైల్వే లైన్ కావాలంటున్నారు. అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారాలు పొడవు, ఎత్తు పెంచాలని, రైల్వే జోన్ కావాలని లేఖ రాశారు. అరుకు ఎంపీ కొత్తపల్లి గీత అరుకు రైలుకు విస్టాడూమ్ అద్దాలున్న బోగీలు కావాలంటూ పాత ప్రతిపాదనే చేసినట్టు తెలిసింది. విజయనగరం ఎంపీ పి. అశోక్ గజపతి రాజు విశాఖ రైళ్లపై కన్నేశారు. విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను విజయనగరం వరకూ పొడిగించాలని కోరుతున్నారు. -
'విశాఖలో మొక్కలు నాటే కార్యక్రమం'
విశాఖపట్నం: ఉద్యాన, అటవీ శాఖ అధికారులతో సంప్రదించి విశాఖ నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటోద్దని స్థానిక ప్రజలకు ఆయన సూచించారు. ఒక పద్దతి ప్రకారం శాస్త్రీయంగా మొక్కలు నాటాల్సిన అవశ్యకతను నారాయణ ఈ సందర్భంగా వివరించారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు ఓ ఉన్నతాధికారిని, అతనికి సహాయంగా బిల్ కలెక్టర్‌ను నియమిస్తామని చెప్పారు. నగరంలోని ప్రతి డివిజన్‌కు ఏఏ అధికారిని నియమిస్తామో జాబితాను సిద్ధం చేస్తున్నామని... ఈ నెల 30 నాటికి ఆ జాబితా విడుదల చేస్తామని నారాయణ వెల్లడించారు. -
ఎన్నాళ్లీ..అమావాస్య
మెరుపువేగంతో పనిచేసినా వెన్నాడుతున్న కరెంటు కష్టాలు విశాఖ వన్‌టౌన్‌లో మెరుగైన పరిస్థితి గ్రామీణ జిల్లాలో ఘోరం విశాఖపట్నం సిటీ : దీపావళి వేళ కూడా విశాఖ నగరంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాలు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం రాత్రికి ఇంకా వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా లేదు. జిల్లాలో పరిస్థితి మరీ ఘోరం గా వుంది. గిరిజన మైదాన ప్రాంతాల్లోనూ చీకట్లే రాజ్యమేలుతున్నాయి. పది శాతం కూడా విద్యుత్ దీపాలు వెలగడం లేదు. నత్తనడకన పునరుద్ధరణ పనులతో మండల కేంద్రాలు కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాయి. హుదూద్ బీభత్సం తర్వాత విద్యుత్ శాఖ మెరుపు వేగంతో పునరుద్ధరణ చేపట్టింది. విశాఖలో 6.78 సర్వీసులకు గత బుధవారం నుంచీ విద్యుత్ సరఫరా బాధ్యతను ఏపీ పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటివరకూ 6.19 లక్షల వినియోగదారులకు విద్యుత్‌ను అందించగలిగారు. వన్‌టౌన్ ప్రాంతానికి చెందిన విద్యుత్ జోన్-1 డివిజన్లో 2.29 కనెక్షన్లకు వెయ్యింటికి మినహా అన్నింటికీ సరఫరా ఇచ్చారు. ఈ డివిజన్లో వెయ్యి ఇళ్లల్లో కరెంట్ కాంతులు నెలాఖరు వరకూ కనిపించే అవకాశాలు లేవు. ఇదే పరిస్థితి మరికొన్నాళ్లు వుండే అవకాశం వుంది. ఇప్పటికే 12 రోజులుగా విద్యుత్ లేని వీరంతా ఆందోళన చెందుతున్నారు. దీపావళి పండుగ పూటా అంధకారంలో మగ్గాల్సిందేనా అని కలవరపడుతున్నారు. -
విశోక సంద్రం!
21 మంది ప్రాణాలు బలి తీసుకున్న హుదూద్ అంచనాలకు అందని భారీ నష్టం మారిపోయిన మహానగరం రూపురేఖలు ఎటు చూసినా కూలిన వృక్షాలు, తెగిన విద్యుత్ వైర్లు, దెబ్బతిన్న ఇళ్లు, రోడ్లు ఆహారం దొరక్క జనం అవస్థలు బాధితులకు ఆమడదూరంలో ప్రభుత్వ యంత్రాంగం అంధకారంతో జనం దుర్భర జీవనం ఉక్కునగరంలో నిలిచిన ఉత్పత్తి విశాఖపట్నం: అంచనాలకు అందని హుదూద్ తుపాను బీభత్సం విశాఖ నగరంలో జనజీవనాన్ని కకావికలం చేసింది. ప్రళయ తాండవం చేసిన తుపాను విశాఖ జిల్లావ్యాప్తంగా 15 మంది, మిగతా జిల్లాలో ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఆకలి కేకలు, క్షతగాత్రుల ఆక్రందనలతో సముద్రం ప్రతిధ్వనిస్తోంది. ఒక్కరోజులో హుదూద్ మిగిల్చిన భారీ నష్టం విశాఖ జిల్లా చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి రోడ్డుమార్గంలో విశాఖ రావాలనుకున్నప్పటికీ జాతీయ రహదారిపై ప్రయాణం అనుకూలంగా లేదని అధికారులు వారించడంతో హెలికాప్టర్ ద్వారా నగరానికి చేరుకున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తాగునీరూ కరువే హుదూద్‌తో భారీ ముప్పు తప్పదని ముందునుంచీ హెచ్చరికలు వస్తున్నా, ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లలో అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. తుపాను నగరాన్ని ఢీకొట్టిన క్షణం నుంచి సోమవారం రాత్రి వరకూ నగరంలో ఒక్క ఆహార పొట్లాన్ని కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ప్రజలను ఆదుకుంటామని, విసృ్తత ఏర్పాట్లు చేస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కేవలం నీటిమూటలుగానే మిగిలిపోయాయి. నిత్యావసర సరుకులు, కూరగాయలు మచ్చుకైనా దొరకడంలేదు. ఇళ్లల్లో నిల్వ ఉంచిన సరుకులు నిండుకోవడంతోపాటు ఫ్రిజ్‌లు పనిచేయకపోవడంతో పాడైపోతున్నాయి. కనీసం తాగడానికి కూడా నీరు దొరకడం లేదు. పక్క జిల్లాల నుంచి ఆహారం, తాగునీరు హెలికాప్టర్లలో తెప్పిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ వాటి జాడ కనిపించలేదు. ఇదే అదునుగా కొందరు స్వార్థపరులు ఆహారాన్ని అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. మద్యం షాఫులు మినహా భారీ షాపింగ్‌మాల్స్‌తో సహా మరే ఇతర దుకాణాలు తెరుచుకోలేదు. పాలు, అల్పాహారం, భోజనం ఏది కావాలన్నా వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి సరుకును దాని అసలు రేటు కంటే ఐదు నుంచి పది రెట్లు అధిక ధరకు అమ్ముతున్నారు. రోడ్డు, విద్యుత్ పునరుద్ధరణకు కృషి ధ్వంసమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడానికి తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉభయగోదావరి జిల్లాల నుంచి వందలాదిమంది సిబ్బందిని ప్రత్యేక వాహనాల్లో విశాఖ, శ్రీకాకుళం జిల్లాలకు తరలించింది. జాతీయ రహదారుల వెంబడి కూలిపోయిన వేలాది విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించడానికే వారికి గంటల తరబడి సమయం పడుతోంది. దీంతో నగరంలో కూలిన చెట్లను ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు. సోమవారం రాత్రికి కూడా నగరంలో విద్యుత్ పునరుద్ధరణ సాధ్యంకాలేదు. మధ్యాహ్నం నుంచి బీఎస్ఎన్ఎల్తోపాటు మరికొన్ని సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌ల సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఫోన్లు చార్జింగ్ లేకపోవడంతో పనిచేయలేదు. రవాణా వ్యవస్థను మధ్యాహ్నం సమయానికి కొద్దిగా పునరుద్ధరించారు. నగరం వీధుల్లో మాత్రం వాహనాలు తిరిగే అవకాశం లేకపోవడంతో ప్రజలు కాలినడకన వెళుతున్నారు. పెట్రోల్ బంకులు పనిచేయడం లేదు. ఎక్కడో ఓ చోట ఒకటి రెండు బంకులు తెరుచుకుంటే జనం తీర్థంలా క్యూ కడుతున్నారు. మత్స్యకారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తినడానికి తిండి కరువైంది. తుపాను ధాటికి ఫిషింగ్ బోట్లు దెబ్బతిన్నాయి. జీవనాధారం కోల్పోయి వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి చోటా తుపాను మిగిల్చిన శిధిల సాక్ష్యాలు దర్శనమిస్తున్నాయి. సాగర తీరం కళావిహీనం విశాఖ సాగరతీర అందాలు తుపాను ధాటికి కళావిహీనమయ్యాయి. అలల తాకిడికి ఆర్కే బీచ్ అందాలు తుడుచుకుపోయాయి. సబ్‌మెరైన్ మ్యూజియం గోడ కూలిపోగా సబ్‌మెరైన్ సైతం కొంతమేర ధ్వంసమైంది. నేవీ అమరవీరుల స్థూపం(విక్టరీఎట్ సీ) పార్క్‌లో ఏర్పాటుచేసిన నమూనా యుద్ధవిమానం నేలకూలింది. తీరంలో ఇసుక రోడ్డుమీదకు వచ్చి రోడ్డంతా ఇసుకతో నల్లగా మారింది. సాగర్‌నగర్ , రుషికొండ, తెన్నేటి పార్క్, జోడుగుళ్లు పాలెం వద్ద సాగరతీరం కోతకు గురైంది. సముద్రం సుమారు 200 మీటర్లు ముందుకు వచ్చింది. వర్షం దాటికి తీరం వెంబడి రుషికొండ బీచ్ వద్ద రోడ్డు కోతకు గురై అందవిహీనంగా తయారైంది. వణికిపోయిన ఉక్కునగరం అంతర్జాతీయ ఖ్యాతిని విశాఖపట్నానికి తీసుకువచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం తుపాను ధాటికి పండుటాకులా వణికిపోయింది. ప్రచండ గాలుల ధాటికి స్టీల్‌ప్లాంట్‌లోని దాదాపు 12 విభాగాలు షట్‌డౌన్ అయ్యాయి. 1971లో ప్రారంభించిన ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా అన్ని విభాగాల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జపాన్, జర్మనీ, యునెటైడ్ స్టేట్స్, సింగపూర్, దుబాయ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. స్టీల్ ప్లాంట్ అవసరాలకు నెలకొల్పిన 236 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి నిలిచిపోయింది. రెండువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సింహాద్రి (ఎన్టీపీసీ) ధర్మల్ పవర్ కేంద్రం పూర్తిగా పనిచేయడం మానేసింది. విశాఖ పోర్టులో దాదాపు ఐదువేల మెట్రిక్ టన్నుల యూరియా నీటమునిగింది. దీంతో భారీగా యూరియా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. -
కనీవినీ ఎరుగని నష్టం
తుపాను వచ్చివెళ్లాక ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా విశాఖ నగరం యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తున్నాయి. హుదూద్ చేసిన విధ్వంసం విస్తృతి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఈ తుపానువల్ల కోలుకోలేని నష్టం సంభవించింది. విశాఖ పేరు చెబితే గుర్తొచ్చే బీచ్ రోడ్డు, నిత్యం ఎంతో సందడితో కళకళలాడే జగదాంబ జంక్షన్, పూర్ణా మార్కెట్, సీతమ్మధార వంటివన్నీ ఘోరంగా దెబ్బతిన్నాయి. వేలాదిమంది మత్స్యకార కుటుంబాలకు ఆలంబనగా ఉండే ఫిషింగ్ హార్బర్లో పెను విధ్వంసం చోటుచేసుకుంది. ఎటు చూసినా ధ్వంసమైన ఇళ్లు, భవనాలు, కూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు కనబడుతున్నాయి. ఆర్మీ, నేవీ, జాతీయ విపత్తు ఉపశమన దళం(ఎన్డీఆర్ఎఫ్)వంటివి రంగంలోకి దిగి చాలామంది ప్రాణాలను కాపాడ గలిగాయి. లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మృతుల సంఖ్య కనిష్ట స్థాయిలో ఉండటం వెనక వీరి కృషి ఉంది. అయితే, నిన్నటి రోజంతా ప్రాణాలు అరచేతబట్టుకుని మంచినీరూ, ఆహారం లేక అలమటించిపోయిన ప్రజలకు సోమవారం రాత్రి వరకూ ఎలాంటి సాయమూ అందలేదని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తాయి. ఈ వైపరీత్యాన్ని ఎదుర్కొనడానికి విస్తృత చర్యలు తీసుకున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పిన మాటలను వాస్తవం వెక్కిరిస్తున్నది. అలాంటి చర్యలే ఉన్నట్టయితే విశాఖలోని చాలా ప్రాంతాల్లో జనం ఆకలిదప్పులతో అలమటించాల్సిన దుస్థితి ఎదురయ్యేది కాదు. తుపాను వెలిశాక ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో అంచనా లేకపోవడం ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి రుజువు. కొందరు వ్యాపారులు అరచేయి ప్రమాణంలేని దోసె రూ. 70, డజను అరటిపళ్లు రూ. 150, ప్యాకెట్ పాలు రూ. 100 వరకూ విక్రయించారంటే... రోజంతా పస్తుండి, ఏదో ఒకటి దొరక్కపోతుందా కడుపాకలి తీరకపోతుందా అని రోడ్లపైకి వచ్చిన సామాన్యులు నిస్సహాయంగా వెనుదిరగాల్సివచ్చిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉన్నదో అంచనావేసుకోవచ్చు. నిన్నంతా కృషిచేసి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచిగానీ, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంనుంచిగానీ తెల్లారేసరికల్లా నిత్యావసరాలను బాధిత ప్రాంతాలకు తరలించివుంటే ఈ పరిస్థితిని నివారించడం సాధ్యమయ్యేది. కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీళ్లను అందించినా ప్రజలు ఆనందించేవారు. ఒకపక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అటు ప్రధాని మోదీతోనూ, కేంద్రంలోని ఇతర ముఖ్యులతోనూ మాట్లాడి అందరినీ కదిలించారు. కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే అధికార యంత్రాంగం హుదూద్ తాకిడి సమయంలోనూ, అటు తర్వాతా చేష్టలుడిగి ఉండిపోయిందని అర్ధమవుతుంది. ప్రకృతి వైపరీత్యాల ఆనవాళ్లను ముందుగా పసిగట్టి, అది సృష్టించగల విధ్వంసాన్ని అంచనావేసి ముందు జాగ్రత్తలు తీసుకోవడం తప్ప దాన్ని నివారించడం ఎవరికీ సాధ్యంకాదు. ఉన్నంతలో మనం చేయగలిగేదల్లా ప్రజలు ఆపదబారిన పడకుండా కాపాడటానికి ప్రయత్నించడమే. అది నిష్ర్కమించాక సహాయ చర్యలను సమర్ధవంతంగా చేపట్టడమే. సాంకేతిక విజ్ఞానం ఎంతగానో అభివృద్ధిచెందిన ప్రస్తుత సమయంలో దాన్ని సంపూర్ణంగా వినియోగించగలిగిన సామర్థ్యం ఉండాలి. సమాచారం అందిన వెంటనే ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి ముందుకు దూసుకుపోగలిగిన సుశిక్షితులైన, మెరికల్లాంటి మనుషులుండాలి. వీరందరిమధ్యా సరైన సమన్వయాన్ని సాధించగలిగే వారుండాలి. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అలాంటి సమన్వయ సాధనలో తలమునకలై ఉండాలి. కానీ, చంద్రబాబు విశాఖ నగరం వెళ్లి సమీక్షించాక ఈ విషయంలో ఎన్ని లోటుపాట్లున్నాయో బయటపడ్డాయి. విశాఖ నగరవాసులే సహాయ చర్యల విషయంలో ఫిర్యాదు చేస్తున్నారంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల ప్రజలకు ఏపాటి సాయం అందిందో ఊహించడం కష్టమేమీ కాదు. హుదూద్ కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. దీనికితోడు విశాఖ హార్బర్లో నిల్వ చేసిన వేలాది టన్నుల ఎరువులు తడిసి ముద్దవడంతో రబీ అవసరాలను తీర్చడం అసాధ్యం కావొచ్చునని, పర్యవసానంగా తుపాను నష్టం పెద్దగా లేని ఇతర జిల్లాల్లో పంటలకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తుపాను ప్రాంతాల పర్యటనకు వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వ్యవసాయరంగానికి వచ్చిపడిన ఈ ముప్పును ప్రత్యేకించి తెలియజెప్పి తగిన సహాయసహకారాలను పొందాలి. ప్రకృతి వైపరీత్యాలను నివారించే శక్తి మనకు లేకున్నా మనం తీసుకునే కొన్ని ముందు జాగ్రత్తలతో అవి మహోగ్రరూపం దాల్చకుండా చేయవచ్చు. అభివృద్ధి పేరిట సాగుతున్న కార్యకలాపాలు సముద్ర తీరాన్ని కాలుష్యమయం చేసి జీవవైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పరిశ్రమల వ్యర్థాలన్నీ సముద్రంలోనే కలుస్తున్నాయి. దాదాపు వేయి కిలోమీటర్ల మేర ఉన్న తీరప్రాంతం దెబ్బతినకుండా చూసేందుకు కోస్టల్ రెగ్యులేటరీ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలున్నా వాటి అమలును పట్టించుకుంటున్నవారు లేరు. పర్యావరణ విధ్వంసం ఫలితంగానే తుపానులు, వాయుగుండాలు, భారీ వర్షాలు క్రమేపీ పెరుగుతున్నాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఇప్పుడు సంభవించిన విపత్తునుండి కోలుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్యకలాపాలను అదుపుచేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. తమ విధానాల్లోని లోపాలను సవరించుకోవాలి. జనావాసాలను ముంచి లక్షలాదిమంది ప్రాణాలకు ముప్పు తీసుకురావడంతోపాటు ఆహారపంటలను దెబ్బతీస్తున్న ఇలాంటి వైపరీత్యాలను అరికట్టడానికి ఇది తప్పనిసరి. హుదూద్ తుపాను సృష్టించిన విలయంలో అంతర్లీనంగా ఉన్న హెచ్చరిక ఇదే. -
ప్రేమించడం లేదని నిప్పుంటించుకున్నాడు
యువతి తన ప్రేమను నిరాకరించటంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవడంతో చివరికి ప్రాణాలు దక్కించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలలోకి వెళితే తెలంగాణ ప్రాంతం వరంగల్ నగరానికి చెందిన భరత్ నగరంలో కంచరపాలెం వద్ద ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు. నగరంలో మూడోవార్డు పరిధి సింహగిరి కాలనీ (కొండపై)కి చెందిన ఓ యువతి అదే కళాశాలలో ద్వితీయ సంవత్సరం డిప్లమా చదువుతోంది. ఆమెను భరత్ మొదటి ఏడాది నుంచే ప్రేమిస్తున్నాడు. ప్రేమ ఇష్టం లేని ఆ అమ్మాయి ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పింది. వారి ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపాల్ భరత్‌ను మందిలించారు. అయినా భరత్ పట్టువీడ లేదు. ఈ కారణంతోనే అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు నాలుగు నెలలుగా ఆమెను కళాశాలకు పంపించడం మానేశారు. ఆమె కళాశాలకు రాకపోవడంతో ఆమె ఇంటి అడ్రస్ తెలుసుకుని బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ బాటిల్‌తో పెట్రోల్ తీసుకుని ఆమె ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. అక్కడే భరత్ తనతో తీసుకెళ్లిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒళ్లంతా మంటలు అంటుకోవడంతో తట్టుకోలేక ఇంటి ముందు పరుగులు తీశాడు. ఆ విషయం గమనించిన అమ్మాయి తల్లి బిందెలతో నీరు తీసుకొచ్చి భరత్ ఒంటిపై పోసి మంటలను అదుపు చేసింది స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వచ్చి భరత్‌కు ప్రథమ చికిత్స చేసి వైద్యం కోసం కేజీహెచ్‌కు తరలించారు. సుమారు 30 శాతం భాగం కాలినట్లు వైద్యులు గుర్తించారు. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈ సారీ సీటు మార్చేద్దాం..
ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో స్థానం ఓటమి భయంతో నియోజకవర్గాల మార్పు గంటా రాజకీయ ప్రస్థానం తీరిది సాక్షి, విశాఖపట్నం : ప్రతి ఎన్నికకు కొత్తనియోజకవర్గాన్ని వెతుక్కుని అటు వలసపోవడం మాజీ మంత్రి గంటాకు మామూలైంది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీటుమార్చి అనకాపల్లి నుంచి పోటీచేశారు. 2014 ఎన్నికల్లో తిరిగి అదేస్థానం నుంచి పోటీచేయాలని భావించినా సర్వే చేయించి చూసుకుంటే చిత్తుగా ఓడిపోతారని తేలడంతో మళ్లీ కొత్త సీటు కోసం ఎత్తుగడలు వేశారు. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీచేయాలని ప్రయత్నించిన భీమిలికి మారి ఇప్పుడు అక్కడినుంచి పోటీచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్లలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన వ్యాపారాల్లో మునిగితేలడం ఆయనకు అలవాటు. దీంతో ఐదేళ్ల తరువాత ప్రజలకు ముఖం చూపేందుకు మనసొప్పక ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేస్తున్నారు. వాస్తవానికి భీమిలినుంచి పోటీచేయడానికి గంటాకు ఏమాత్రం ఆసక్తిలేదు. ముందు విశాఖ ఎంపీ స్థానానాకి పోటీచేయాలనుకున్నారు. కాని వైఎస్సార్సీపీ నుంచి విజయమ్మ బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో అప్పట్లో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆతర్వాత అనకాపల్లికే వెళ్లాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు. అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహించి తనకోసం నియోజకవర్గం త్యాగం చేసే నేత కోసం వెదుక్కున్నారు. చివరకు తనను నమ్మివచ్చిన బృంద సభ్యుడు అవంతిపై కన్నేశారు. ఆయన ఎప్పటినుంచో అక్కడ ఖర్చుపెట్టి బలంపెంచుకుంటే తీరా వచ్చి తన రాజకీయ అవసరం కోసం ఈయన్ను బలిచేసి అనకాపల్లి ఎంపీ సీటుకు పంపించారు. దీంతో గంటా వైఖరిపై అవంతి కక్కలేకమింగలేక అన్నట్లున్నారు. -
దొంగనోట్ల కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
దొంగ నోట్ల ముఠా గుట్టును విశాఖపట్నం నగర పోలీసులు బుధవారం రట్టు చేశారు. దొంగనోట్లను చలామణి చేస్తున్న సినీ అసిస్టెంట్ డైరెక్టర్ భూపతి తేజతోపాటు మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసు కమిషనరేట్‌కు తరలించి విచారిస్తున్నారు. నిందితులపై వివిధ సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.