ఈ సారీ సీటు మార్చేద్దాం..
- ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో స్థానం
- ఓటమి భయంతో నియోజకవర్గాల మార్పు
- గంటా రాజకీయ ప్రస్థానం తీరిది
సాక్షి, విశాఖపట్నం : ప్రతి ఎన్నికకు కొత్తనియోజకవర్గాన్ని వెతుక్కుని అటు వలసపోవడం మాజీ మంత్రి గంటాకు మామూలైంది. 1999 లోక్‌సభ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీచేసి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో చోడవరం నుంచి టిక్కెట్ తెచ్చుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో సీటుమార్చి అనకాపల్లి నుంచి పోటీచేశారు.
2014 ఎన్నికల్లో తిరిగి అదేస్థానం నుంచి పోటీచేయాలని భావించినా సర్వే చేయించి చూసుకుంటే చిత్తుగా ఓడిపోతారని తేలడంతో మళ్లీ కొత్త సీటు కోసం ఎత్తుగడలు వేశారు. చివరకు సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ పోటీచేయాలని ప్రయత్నించిన భీమిలికి మారి ఇప్పుడు అక్కడినుంచి పోటీచేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న అయిదేళ్లలో నియోజకవర్గ ప్రజలను పూర్తిగా విస్మరించి కేవలం తన వ్యాపారాల్లో మునిగితేలడం ఆయనకు అలవాటు.
దీంతో ఐదేళ్ల తరువాత ప్రజలకు ముఖం చూపేందుకు మనసొప్పక ఏకంగా నియోజకవర్గాన్నే మార్చేస్తున్నారు. వాస్తవానికి భీమిలినుంచి పోటీచేయడానికి గంటాకు ఏమాత్రం ఆసక్తిలేదు. ముందు విశాఖ ఎంపీ స్థానానాకి పోటీచేయాలనుకున్నారు. కాని వైఎస్సార్‌సీపీ నుంచి విజయమ్మ బరిలోకి దిగుతారనే ప్రచారం నేపథ్యంలో అప్పట్లో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆతర్వాత అనకాపల్లికే వెళ్లాలని చివరకు నిర్ణయం తీసుకున్నారు.
అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గ్రహించి తనకోసం నియోజకవర్గం త్యాగం చేసే నేత కోసం వెదుక్కున్నారు. చివరకు తనను నమ్మివచ్చిన బృంద సభ్యుడు అవంతిపై కన్నేశారు. ఆయన ఎప్పటినుంచో అక్కడ ఖర్చుపెట్టి బలంపెంచుకుంటే తీరా వచ్చి తన రాజకీయ అవసరం కోసం ఈయన్ను బలిచేసి అనకాపల్లి ఎంపీ సీటుకు పంపించారు. దీంతో గంటా వైఖరిపై అవంతి కక్కలేకమింగలేక అన్నట్లున్నారు.