సాక్షి ప్రతినిధి, కాకినాడ : సుమారు నెల రోజులుగా సాగుతున్న స్థానిక పోరు శుక్రవారం ముగిసీ ముగియగానే.. శనివారం మహా సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ‘సెమీ ఫైనల్స్’గా పరిగణన పొందిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు తెరపడిన వెంటనే.. ఫైనల్స్‌గా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోరుకు సిద్ధం కావలసి రావడంతో రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
కాగా.. ఎన్నికల కోలాహలం ఉన్నన్నాళ్లూ.. తిండికీ, తాగుడికీ వెతుక్కోవలసిన అగత్యం లేని వాళ్లూ, ఓటుకు వెలగట్టి చెల్లిస్తే నిస్సంకోచంగా పుచ్చుకునే వారూ చంకలు గుద్దుకుంటున్నారు. జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలు, 57 జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల సందడికి శుక్రవారం తెరపడింది.ఇంతలోనే శనివారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్‌ల స్వీకరణా మొదలవుతుంది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం సమీక్షించారు. నేటి వరకూ స్థానిక సమరంలో తలమునకలైన వివిధ పార్టీల నేతలు కూడా వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల సన్నాహాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో మూడు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి.
కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకోగా తెలుగుదేశం వత్తాసుగా నిలిచిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. సమైక్యాంధ్ర కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. వైఎస్సార్ సీపీ జిల్లాలో దాదాపు అన్ని స్థానాలపైనా ఒక స్పష్టతతో ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. వైఎస్సార్ జనభేరి సభల్లో అమలాపురం, కాకినాడ పార్లమెంటు స్థానాలకుపినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, రామచంద్రపురం, ముమ్మిడివ రం, పిఠాపురం, తుని, పెద్దాపురం ని యోజకవర్గాలకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, తోట సుబ్బారావునాయుడులను అభ్యర్థులు గా ప్రకటించారు. మిగిలిన స్థానాలపై కూడా కసరత్తు తుది దశకు చేరుకుంది.
బాబుకు షాక్ ఇవ్వనున్న గోరంట్ల..?
విభజనలో కాంగ్రెస్‌తో అంటకాగిన టీడీపీ బీజేపీతో పొత్తు సంగతి తేల్చుకోలేక తలపట్టుకుంటోంది. రాజమండ్రి సిటీ, రాజోలు స్థానాలు బీజేపీకి విడిచి పెట్టే ప్రయత్నంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పి.గన్నవరం, ముమ్మిడివరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నందున.. ఆ సీటుపై ఆశతో కాంగ్రెస్ నుంచి టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి తోట నరసింహం పరిస్థితి ఏమిటనేది తేలడం లేదు. బీజేపీకి ఇస్తారంటున్న రాజమండ్రి సిటీ విషయంలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకటి, రెండురోజుల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది.
కడరూ కరువైన ‘జై సమైక్యాంధ్ర’
నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనతో కుదేలై అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సై తం అభ్యర్థులను నిలపలేక చేతులెత్తేసి న ఆ పార్టీ ఇప్పుడు కాకినాడ నుంచి సిట్టింగ్ ఎంపీ పళ్లంరాజును మాత్రమే ప్రకటించి, మిగిలిన వారి కోసం వేట ప్రారంభించింది.
ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన జై సమైక్యాంధ్ర పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేసుకోలేక తంటాలు పడుతున్నారు. కేడర్ లేని ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి.
ఇక మహాసంగ్రామం
Published Sat, Apr 12 2014 2:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement