neetu kumari prasad
-
బ్యాంక్ ఖాతాలకే పింఛన్లు
► మాన్యువల్ చెల్లింపులకు ఇక స్వస్తి ► పోస్టాఫీసుల్లోనూ ఆసరా పింఛన్ల అందజేత సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల చెల్లింపుల్లో పారదర్శకతకు పట్టం కట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిర్ణయించింది. అవకతవకలను నివారించే నిమిత్తం ఇకపై మాన్యువల్(చేతికి ఇవ్వడం) పద్ధతికి స్వస్తి పలకాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చే జనవరి నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా మాత్రమే పింఛన్ సొమ్మును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేని బ్యాంకు శాఖ ఉన్న గ్రామంలో లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్మును తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 37 శాతం మందికి బ్యాంక్‌లు, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. 13 శాతం మందికి పంచాయతీ సిబ్బంది ద్వారా మాన్యువల్‌గా సొమ్మును అందజేస్తున్నారు. జాప్యం నివారణకు ఎన్పీసీఐతో ఒప్పందం! ఆసరా లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు నూతన విధానాన్ని అవలంభించాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్ బ్యాంకింగ్ విధానం(సీబీఎస్) వల్ల బ్యాంకు ఖాతాలున్న 13 లక్షల మందికి పింఛన్ సొమ్మును జమ చేసేందుకు కనీసం 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఈ విధానంలో రోజుకు 1.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే అవకాశం లేకపోవడం, బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో పింఛన్ సొమ్ము సకాలంలో లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏకబిగిన ఒకేసారి లబ్ధిదారులందరి ఖాతాలకు సొమ్మును జమ చేసేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సీబీఎస్ విధానంతో సొమ్ము పంపిణీ పూర్తి ఉచితం కాగా, ఎన్పీసీఐ ద్వారా సొమ్ము జమ చేసే ప్రక్రియకు ఒక్కో లావాదేవీకి రూ.11 చెల్లించాల్సి ఉంది. సేవాపన్నుతో కలిపి మొత్తం 13 లక్షలమంది లబ్ధిదారుల ఖాతాలకు ఒకేరోజు పింఛన్ సొమ్మును జమ చే యాలంటే, సర్కారుపై నెలకు రూ.1.5 కోట్ల భారం పడుతుంది. సకాలంలో పింఛన్ ఇవ్వలేకపోయామనే అపవాదు కంటే భారం మోయడమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
జార్ఖండ్ డైనమైట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /ముకరంపుర :జిల్లా కలెక్టర్‌గా జార్ఖండ్ డైనమైట్ నీతుకుమారి ప్రసాద్ నియమితులయ్యా రు. ముక్కుసూటితనం, సమర్థవంతమైన అధికారిగా పేరున్న ఆమె తూర్పు గోదావరి జిల్లా నుంచి బదిలీపై వస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ వీరబ్రహ్మయ్య హైదరాబాద్ నగరపాలక సంస్థ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ కాగా, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమితులయ్యారు. జేసీగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. జగిత్యాల సబ్ కలెక్టర్‌గా నియామకమైన 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి డి.కృష్ణభాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సీనియర్ ఐఏఎస్ అధికారి డి.లక్ష్మీపార్థసారధి కుమారుడు. సోమవారం ఉదయం ప్రస్తుత కలెక్టర్ వీరబ్రహ్మయ్య, జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, డీఆర్వో వీరబ్రహ్మయ్య సహా పలువురు అధికారులు నూతన కలెక్టర్ నీతుకుమారికి ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె పండుగ తర్వాత బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పినట్లు సమాచారం. మరోవైపు జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్, వరంగల్ మున్సిపల్ కమిషనర్లుగా నియమితులైన వీరబ్రహ్మయ్య, సర్ఫరాజ్ అహ్మద్ సోమవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. ముక్కుసూటితనం నీతు నైజం 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీతుకుమారి ప్రసాద్ స్వస్థలం జార్ఖండ్. ఆమె భర్త రాజేశ్‌కుమార్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేస్తున్నారు. నీతుకుమారికి నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరుంది. మీడియాకు దూరంగా ఉండే ఆమె సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. మొన్నటి వరకు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లపాటు కొనసాగిన ఆమె ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్థంగా వ్యవహరించారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించారు. ఐఏఎస్ శిక్షణ పూర్తయిన అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ తొలి పోస్టింగ్ పొందిన ఆమె తర్వాత వరంగల్ నగర కమిషనర్‌గా, రాష్ట్ర, పర్యాటక, యువజన, క్రీడా వ్యవహారాలశాఖ అడిషనల్ చీఫ్‌గా కొనసాగారు. అనంతరం నిజామాబాద్, నల్గొండ జిల్లాల జాయింట్ కలెక్టర్‌గా, వాణిజ్య పన్నులశాఖ ఉప కమిషనర్‌గా, హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ కేటాయింపుల్లో భాగంగా నీతుకుమారి తెలంగాణకు వెళ్లేందుకు మొగ్గు చూపినప్పటికీ ఆమె భర్త రాజేశ్‌ను ఏపీకి కేటాయించడంతో పునరాలోచనలో పడ్డారు. చివరకు ఆమెను తెలంగాణకు కేటాయించడంతో కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సమస్యల స్వాగతం కలెక్టర్‌గా వస్తున్న నీతుకుమారికి జిల్లాలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. తెలంగాణలో మిగతా జిల్లాలతో పోల్చితే కరీంనగర్లో రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువే. పైగా కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లా అంటే ప్రత్యేక అభిమానం. అన్నింటినీ అధిగమించి ఆమె పాలన సాగించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన అనంతరం అధికార యంత్రాంగంలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలి, అస్తవ్యస్తంగా మారిన పాలనను గాడిలో పెట్టమే కొత్త కలెక్టర్ ముందున్న ప్రథమ కర్తవ్యంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ విభాగాల్లో ఎటు చూసినా అవినీతి రాజ్యమేలుతుండగా రెవెన్యూ, వైద్య, విద్యాశాఖల్లో అవినీతి పతాకస్థాయికి చేరింది. పహణీలు, పాస్బుక్కుల కోసం ప్రజలనుంచి దోచుకుంటున్నారు. 2014లో ఏకంగా 27 మంది రెవెన్యూ అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ విషయంలో ఆలస్యంగా స్పందించిన కలెక్టర్ వీరబ్రహ్మయ్య కలెక్టరేట్లో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేయడంతో ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. మొదట్లో కొందరు వీఆర్వోలను సస్పెండ్ చేయడంతో అధికారుల్లో ఉలిక్కిపాటు మొదలైనా మళ్లీ షరా ‘మామూలే’ అయింది. సమస్యల పరిష్కారం కోసం ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం వృధావాణిగా మారుతోంది. మూడేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ గ్రీవెన్స్ సెల్‌ను ప్రజావాణి కార్యక్రమంగా రూపురేఖలే మార్చారు. అన్నిశాఖల అధికారులను అందుబాటులో ఉంచి ప్రతీ దరఖాస్తును ఆన్లైన్లో నమోదు చేయించారు. డివిజన్, మండలకేంద్రాల్లోనూ ప్రజావాణి ఏర్పాటు చేశారు. ఆమె కలెక్టర్‌గా ఉన్నంతకాలం ప్రత్యేక శ్రద్ధ వహించినా ఏడాదిగా అధికారులు అంతగా శ్రద్ధ చూడం లేదు. గ్రామసందర్శనతో క్షేత్రస్థాయిలో దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో ప్రజావాణి వృథావాణిగా అయిపోతోంది. ప్రొఫైల్ పేరు : నీతుకుమారి ప్రసాద్ భర్త పేరు : రాజేశ్‌కుమార్ (ఐపీఎస్ అధికారి, గుంటూర్ అర్బన్ ఎస్పీ) ఐఏఎస్ బ్యాచ్ : 2001 తొలిపోస్టింగ్ : భద్రాచలం సబ్ కలెక్టర్ విధులు : వరంగల్ కమిషనర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల జేసీగా, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా, తూర్పు గోదావరి కలెక్టర్‌గా విధులు -
నీతూప్రసాద్ రూటెటు?
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు ప్రధాని బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ ఇక్కడ కొనసాగుతారా లేదా అనే విషయమై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి గురు, శుక్రవారాల్లో వచ్చే సీల్డ్కవర్పైనే దీనిపై స్పష్టత వస్తుందని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. గురువారం సీల్డ్‌కవర్ వచ్చినా క్రిస్మస్ సెలవు కావడంతో శుక్రవారమే విషయం వెల్లడి కానుంది. విభజన అనంతర పరిణామాల్లో కలెక్టర్ నీతూప్రసాద్ తెలంగాణ ప్రాంతానికి ఆప్షన్ ఇచ్చారు. ఐపీఎస్ బదిలీల్లో భాగంగా ఏపీఎస్పీ కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్న ఆమె భర్త రాజేష్‌కుమార్ గుంటూరు అర్బన్ ఎస్పీగా బదిలీ అయ్యారు. అఖిలభారత సర్వీసు అధికారుల విషయం కేంద్రప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో ఆరు నెలలుగా కలెక్టర్ బదిలీ విషయం తేలలేదు. ఇపుడు అఖిలభారత సర్వీసు అధికారుల విభజనకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో నీతూప్రసాద్ జిల్లాలో కొనసాగేది లేనిదీ మరో 24 గంటల్లోపు తేలిపోనుంది. తెలంగాణాకు మొదట్లో ఆప్షన్ ఇచ్చినప్పటికీ, భర్త గుంటూరులో పనిచేస్తుండటం, ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలు దగ్గరపడడం వంటి పరిణామాల నేపథ్యంలో నీతూప్రసాద్ తెలంగాణకు వెళ్లే విషయమై పునరాలోచనలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రి యనమల ఆమెను ఇక్కడే కొనసాగాలని ఇప్పటికే కోరారు. అయితే ఇప్పుడు కేంద్రం విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆమె అటా, ఇటా అనే దానిపై ఒక నిర్ణయం వెలువడే సమయం ఆసన్నమైంది. 2012 ఫిబ్రవరి 25న జిల్లా కలెక్టర్‌గా నీతూప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. తర్వాత కొద్దిరోజులకే ఆమె భర్త రాజేష్‌కుమార్ కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా వచ్చారు. విజయవాడ- గుంటూరు మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేయనున్న తరుణంలో కీలకమైన గుంటూరు అర్బన్ ఎస్పీ పోస్టుకి ఆయన బదిలీ అయ్యారు. దీంతో ఆయన ఆంధ్రాలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్టు తెలియవచ్చింది. మరోవైపు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో కొత్త అధికారులను తీసుకువస్తే వారు అలవాటు పడేందుకు చాలా సమయం పడుతుందని..ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుందని ముఖ్యమంత్రి, జిల్లా మంత్రులు ఉన్నారంటున్నారు. అందుకే నీతూప్రసాద్నే పుష్కరాల వరకూ కలెక్టర్‌గా కొనసాగిస్తారని ప్రచారం జరిగింది. కానీ తెలంగాణకు వెళ్లేందుకు ఎంచుకున్న ఆప్షన్‌ను కేంద్రం యథాతథంగా ఆమోదిస్తే పరిస్థితి ఏమిటనే విషయమై ఆసక్తి నెలకొంది. ఆమెకు వెంటనే కలెక్టర్‌గా అక్కడ అవకాశం దక్కుతుందా లేదా? అక్కడకు వెళితే పదోన్నతులు త్వరగా వస్తాయా...ఇత్యాది విషయాలపై తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. కనీసం పుష్కరాల వరకు ఆమె కొనసాగుతారా? ఈలోపే జిల్లా నుంచి బదిలీ అవుతారా అనే ఆసక్తి నేపథ్యంలో అసలు సీల్డ్కవర్లో ఏముందనే అంశం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. -
తూ.గో. జిల్లాలో రేపు విద్యాసంస్థలకు సెలవు
కాకినాడ: తుఫాన్ తీరం దాటే సమయంలో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతు కుమారి ప్రసాద్ తెలిపారు. తుఫాన్ తీవ్ర ఎక్కువగా ఉన్నందున ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కలెక్టర్ సూచించారు. శనివారం ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజిలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తుఫాన్ బాధితుల కోసం 72 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రేపు సాయంత్రానికి 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తామని నీతూ కుమార్ ప్రసాద్ తెలిపారు. -
ఈవీఎంలు భద్రం... అభ్యర్థులు ఆందోళన వద్దు
కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూంలోకి వర్షపు నీరు వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఈవీఎంలు మాత్రం వర్షపు నీటిలో తడవలేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూంను నీతూ ప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఈవీఎంల విషయంలో అభ్యర్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాకినాడ పార్లమెంట్, ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం బాక్స్‌ల కిందకి వర్షపు నీరు చేరిందన్నారు. అయితే ఈవీఎంలను క్షుణ్ణంగా పరిశీలించగా సదరు ఈవీఎంలు తడవలేదని చెప్పారు. కాకినాడ లోక్‌సభ, ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ వెల్లడించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తూర్పు గోదావరి జిల్లాలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. అందులోభాగంగా కాకినాడ జేఎన్టీయూలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాంతో భద్రత సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీలు శనివారం స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన ఈవీఎంలను పరిశీలించారు. -
ఇక మహాసంగ్రామం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : సుమారు నెల రోజులుగా సాగుతున్న స్థానిక పోరు శుక్రవారం ముగిసీ ముగియగానే.. శనివారం మహా సంగ్రామానికి తెరలేవనుంది. రాష్ట్రంలో ‘సెమీ ఫైనల్స్’గా పరిగణన పొందిన మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియకు తెరపడిన వెంటనే.. ఫైనల్స్‌గా భావిస్తున్న సార్వత్రిక ఎన్నికల పోరుకు సిద్ధం కావలసి రావడంతో రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాగా.. ఎన్నికల కోలాహలం ఉన్నన్నాళ్లూ.. తిండికీ, తాగుడికీ వెతుక్కోవలసిన అగత్యం లేని వాళ్లూ, ఓటుకు వెలగట్టి చెల్లిస్తే నిస్సంకోచంగా పుచ్చుకునే వారూ చంకలు గుద్దుకుంటున్నారు. జిల్లాలో రాజమండ్రి కార్పొరేషన్ సహా ఏడు మున్సిపాలిటీలు, మూడు నగరపంచాయతీలు, 57 జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక ఎన్నికల సందడికి శుక్రవారం తెరపడింది.ఇంతలోనే శనివారం శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నామినేషన్ల స్వీకరణా మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ శుక్రవారం సమీక్షించారు. నేటి వరకూ స్థానిక సమరంలో తలమునకలైన వివిధ పార్టీల నేతలు కూడా వెనువెంటనే సార్వత్రిక ఎన్నికల సన్నాహాలకు సిద్ధమయ్యారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారి 2009లో జరిగిన ఎన్నికల్లో మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో మూడు పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు జిల్లాలోనూ చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర విభజనకు పూనుకోగా తెలుగుదేశం వత్తాసుగా నిలిచిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో.. సమైక్యాంధ్ర కోసం అనేక ఉద్యమాలు చేపట్టిన ఏకైక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ బరిలోకి దిగుతోంది. వైఎస్సార్ సీపీ జిల్లాలో దాదాపు అన్ని స్థానాలపైనా ఒక స్పష్టతతో ఉంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వైఎస్సార్ జనభేరి సభల్లో అమలాపురం, కాకినాడ పార్లమెంటు స్థానాలకుపినిపే విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, రామచంద్రపురం, ముమ్మిడివ రం, పిఠాపురం, తుని, పెద్దాపురం ని యోజకవర్గాలకు మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, గుత్తుల సాయి, పెండెం దొరబాబు, దాడిశెట్టి రాజా, తోట సుబ్బారావునాయుడులను అభ్యర్థులు గా ప్రకటించారు. మిగిలిన స్థానాలపై కూడా కసరత్తు తుది దశకు చేరుకుంది. బాబుకు షాక్ ఇవ్వనున్న గోరంట్ల..? విభజనలో కాంగ్రెస్‌తో అంటకాగిన టీడీపీ బీజేపీతో పొత్తు సంగతి తేల్చుకోలేక తలపట్టుకుంటోంది. రాజమండ్రి సిటీ, రాజోలు స్థానాలు బీజేపీకి విడిచి పెట్టే ప్రయత్నంలో పిల్లిమొగ్గలు వేస్తోంది. మండపేట, రాజానగరం, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, తుని, పి.గన్నవరం, ముమ్మిడివరం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు స్థానం కోసం బీజేపీ పట్టుబడుతున్నందున.. ఆ సీటుపై ఆశతో కాంగ్రెస్ నుంచి టీడీపీ పంచన చేరిన మాజీ మంత్రి తోట నరసింహం పరిస్థితి ఏమిటనేది తేలడం లేదు. బీజేపీకి ఇస్తారంటున్న రాజమండ్రి సిటీ విషయంలో మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఒకటి, రెండురోజుల్లో చంద్రబాబుకు షాక్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. కడరూ కరువైన ‘జై సమైక్యాంధ్ర’ నిన్నమొన్నటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ విభజనతో కుదేలై అభ్యర్థుల కోసం భూతద్దం పెట్టి వెతకాల్సి వస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సై తం అభ్యర్థులను నిలపలేక చేతులెత్తేసి న ఆ పార్టీ ఇప్పుడు కాకినాడ నుంచి సిట్టింగ్ ఎంపీ పళ్లంరాజును మాత్రమే ప్రకటించి, మిగిలిన వారి కోసం వేట ప్రారంభించింది. ఇక మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన జై సమైక్యాంధ్ర పార్టీకి అభ్యర్థులను ఎంపిక చేసుకోలేక తంటాలు పడుతున్నారు. కేడర్ లేని ఆ పార్టీ ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి.