బ్యాంక్ ఖాతాలకే పింఛన్లు
► మాన్యువల్ చెల్లింపులకు ఇక స్వస్తి
► పోస్టాఫీసుల్లోనూ ఆసరా పింఛన్ల అందజేత
సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ పింఛన్ల చెల్లింపుల్లో పారదర్శకతకు పట్టం కట్టాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిర్ణయించింది. అవకతవకలను నివారించే నిమిత్తం ఇకపై మాన్యువల్(చేతికి ఇవ్వడం) పద్ధతికి స్వస్తి పలకాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 లక్షల మంది లబ్ధిదారుల్లో ప్రతి ఒక్కరికీ వచ్చే జనవరి నుంచి బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా మాత్రమే పింఛన్ సొమ్మును అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏదేని బ్యాంకు శాఖ ఉన్న గ్రామంలో లబ్ధిదారులందరికీ పింఛన్ సొమ్మును తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాలని సెర్ప్ సీఈవో నీతూకుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటివరకు 37 శాతం మందికి బ్యాంక్‌లు, 50 శాతం మందికి పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేశారు. 13 శాతం మందికి పంచాయతీ సిబ్బంది ద్వారా మాన్యువల్‌గా సొమ్మును అందజేస్తున్నారు.
జాప్యం నివారణకు ఎన్‌పీసీఐతో ఒప్పందం!
ఆసరా లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము పంపిణీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు నూతన విధానాన్ని అవలంభించాలని సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కోర్ బ్యాంకింగ్ విధానం(సీబీఎస్) వల్ల బ్యాంకు ఖాతాలున్న 13 లక్షల మందికి పింఛన్ సొమ్మును జమ చేసేందుకు కనీసం 10 నుంచి 15 రోజులు పడుతోంది. ఈ విధానంలో రోజుకు 1.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే అవకాశం లేకపోవడం, బ్యాంకులకు శని, ఆదివారాలు సెలవు కావడంతో పింఛన్ సొమ్ము సకాలంలో లబ్ధిదారులకు చేరడం లేదు. దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏకబిగిన ఒకేసారి లబ్ధిదారులందరి ఖాతాలకు సొమ్మును జమ చేసేందుకు వీలుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించారు. సీబీఎస్ విధానంతో సొమ్ము పంపిణీ పూర్తి ఉచితం కాగా, ఎన్‌పీసీఐ ద్వారా సొమ్ము జమ చేసే ప్రక్రియకు ఒక్కో లావాదేవీకి రూ.11 చెల్లించాల్సి ఉంది. సేవాపన్నుతో కలిపి మొత్తం 13 లక్షలమంది లబ్ధిదారుల ఖాతాలకు ఒకేరోజు పింఛన్ సొమ్మును జమ చే యాలంటే, సర్కారుపై నెలకు రూ.1.5 కోట్ల భారం పడుతుంది. సకాలంలో పింఛన్ ఇవ్వలేకపోయామనే అపవాదు కంటే భారం మోయడమే మేలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.