ఇక పోస్టాఫీసు నుంచే ‘ఆసరా’
- తొలిదశలో ఆరు జిల్లాల్లో అమలు
- మార్చి 1నుంచి పంపిణీకి సన్నాహాలు
- పట్టణాల్లో ‘ఐసీఐసీఐ’కు బాధ్యతలు!
సాక్షి, హైదరాబాద్: సామాజిక భద్రతా పింఛన్ల(ఆసరా)ను ఇకమీదట పోస్టాఫీసుల నుంచి అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో నల్లగొండ, నిజామాబాద్, మెదక్, అదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో దీన్ని అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు ఆయా జిల్లాల్లో 3,855 గ్రామ పంచాయితీలను ఎంపిక చేశారు. ఎంపికైన గ్రామ పంచాయితీల్లో నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో అన్ని గ్రామాలు ఉండగా, మిగిలిన నాలుగు జిల్లాల్లో 50 శాతానికి పైగా ఉన్నాయి.
ఆయా గ్రామాల్లోని లబ్దిదారులకు ఫిబ్రవరి నెల పింఛన్లను మార్చి 1వ తేదీ నుంచి పోస్టాఫీసుల ద్వారానే పంపిణీ చేయనున్నారు. రెండోదశలో మిగిలిన జిల్లాలతో పాటు అన్నిగ్రామాల్లోని లబ్ధిదారులకు అందజేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ‘ఆసరా’ పింఛన్లకు ఎంపికైన వారు మొత్తం 33,42,969 మంది ఉండగా, వీరికి గత నాలుగు నెలల్లో రూ.1231.04 కోట్లు మాన్యువల్‌గా పంపిణీ చేశారు.
ఇదిలాఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్ల పంపిణీ కోసం వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ఇటీవల సంప్రదింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఐసీఐసీఐ బ్యాంకు ఒక్కటే ముందుకు వచ్చిందని సెర్ప్ సీఈవో మురళి బుధవారం ‘సాక్షి’తో చెప్పారు. త్వరలోనే ఆ బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటామని తెలిపారు.