పండుటాకులకు ‘పింఛన్ పరీక్ష’ | Disabled 'Pension test' | Sakshi
Sakshi News home page

పండుటాకులకు ‘పింఛన్ పరీక్ష’

Published Fri, Dec 19 2014 1:27 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

పండుటాకులకు ‘పింఛన్ పరీక్ష’ - Sakshi

పండుటాకులకు ‘పింఛన్ పరీక్ష’

  • మొరాయిస్తున్న పీవోటీడీ మెషీన్లు
  • వేలిముద్రలు సరిపోలక పంపిణీలో ఆలస్యం
  • సర్వర్లు చాలా నిదానంగా పనిచేయడమూ మరో కారణం
  • రోజుకు వంద మందికి ఇవ్వలేకపోతున్నామంటున్న తపాలా సిబ్బంది
  • పని ఒత్తిడి కారణంగా అస్వస్థతకు గురవుతున్న పోస్టల్ ఉద్యోగులు
  • సాక్షి, విజయవాడ బ్యూరో : రాష్ట్రంలో పోస్టాఫీసుల ద్వారా ఇస్తున్న సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు చోట్ల పోస్టాఫీసుల్లోని వేలిముద్రల (బయోమెట్రిక్) యంత్రాలు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు రోజుల తరబడి పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సివస్తోంది. వికలాంగులు, కదల్లేని పండుటాకులకు ఇది పరీక్షగానే మారింది. పోస్టాఫీసులకు వెళ్లి రావడానికి ఆటోల ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని, ఎండల్లో పడిగాపులు పడాల్సివస్తోందని వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    పింఛన్లను పారదర్శకంగా, వేగంగా అందజేసేందుకు ప్రభుత్వం ఈ నెల 1 నుంచి పోస్టాఫీసుల్లో బయోమెట్రిక్ విధానంలో ఇస్తోంది. తొలి విడతగా 11 జిల్లాల్లోని (కడప, నెల్లూరు మినహా) 32,12,114 మందికి పింఛన్ల పంపిణీని ప్రారంభించింది. బయోమెట్రిక్ విధానం కోసం ఏపీ ఆన్‌లైన్ సంస్థ పోస్టాఫీసులకు పీవోటీడీ యంత్రాలను సరఫరా చేసింది. అయితే, చాలా చోట్ల యంత్రాలు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది.

    ఉదయం నుంచి సాయంత్రం వరకు మండుటెండలో పడిగాపులుగాసినా పింఛన్ రావడంలేదని లబ్ధిదారులు చెబుతున్నారు. చాలా జిల్లాల్లో యంత్రాలు లబ్ధిదారుల వేలి ముద్రలను సవ్యంగా తీసుకోవడంలేదు. ఆధార్ సీడింగ్ సరిగా లేకపోతే యంత్రంలో వివరాలు ప్రాసెస్ కావడంలేదు. ఆధార్ సీడింగ్ సమయంలో తీసుకున్న వేలిముద్రలతో పోస్టాఫీసులో తీసుకునే వేలిముద్రలు సరిపోతేనే పింఛను వస్తుంది. చాలా మంది వృద్దుల వేళ్లు అరిగిపోయి ముద్రలు మారిపోవడంతో యంత్రాలు వాటిని తీసుకోవడంలేదు.

    ఎన్నిసార్లు ప్రయత్నించినా వారికి పింఛన్ రావడంలేదని పోస్టల్ సిబ్బంది చెబుతున్నారు. మరోపక్క పలు ప్రాంతాల్లో సర్వర్లు చాలా నిదానంగా పనిచేస్తున్నాయి. దీంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతోందని తపాలా ఉద్యోగులు చెబుతున్నారు. వేలి ముద్రలు తీసుకోవడం, వారి ఖాతాను ఓపెన్ చేసి సొమ్ము పంపిణీ చేయడం కష్టంగా మారిందని అంటున్నారు. రోజుకు వంద మందికి కూడా ఇవ్వడం సాధ్యం కావడంలేదని చెబుతున్నారు.

    గుంటూరు, నర్సరావుపేట, మదనపల్లి, కావలి, రాజమండ్రి, భీమవరం పోస్టల్ డివిజన్లలో చాలా చోట్ల సర్వర్లు సరిగా పనిచేయడంలేదు. తపాలా శాఖ ఐడియా 2జీ నెట్‌వర్క్ ఉపయోగిస్తోందని, బీఎస్‌ఎన్‌ఎల్ 3జీ సేవలను ఉపయోగిస్తే వేగం పెరుగుతుందని ఏపీ ఆన్‌లైన్ అంటోంది. అంతేకాకుండా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సరిగా పనిచేయని అటవీ, మారుమూల ప్రాంతాల్లోని పోస్టాఫీసులకు సిగ్నల్స్ సరిగా అందక బయోమెట్రిక్ మెషీన్లు గంటల తర బడి ఆగిపోతున్నాయి.  

    ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో 3,65,403 మందికి రూ. 45.45 కోట్లు అందించేందుకు ఏపీ ఆన్‌లైన్ 1,261 యంత్రాలను పోస్టాఫీసుల్లో ఉంచింది. వీటిలో నాలుగో వంతు మెషీన్లు సరిగా పనిచేయడంలేదు. దీంతో పని ఒత్తిడి పెరిగి పోస్టల్ ఉద్యోగులు ఒత్తిడికి గురికావడం, సహనం కోల్పోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల లబ్ధిదారులు, ఉద్యోగుల మధ్య వాగ్వాదాలు జరుగుతున్నాయి. గురువారం గుంటూరు నగరంలో ఇద్దరు ఉద్యోగులు ఒత్తిడి కారణంగా ఆస్పత్రి పాలైనట్లు సమాచారం. ఇప్పటికైనా అధికారులు దీనిపై దృష్టి సారించి ఇటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని లబ్ధిదారులు, పోస్టల్ ఉద్యోగులు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement