వేలిముద్రలు పడక పింఛన్ ఆపేశారంటూ కలెక్టరేట్ వద్ద మీడియా ఎదుట గగ్గోలు పెడుతున్న మునగపాక గ్రామానికి చెందిన మహిళలు
సాక్షి, విశాఖపట్నం: చేతిరేఖలు జీవితాన్ని మారుస్తాయని విన్నాం కానీ .. వేలిముద్రలు పండుటాకుల రాతలు మారు స్తున్నాయంటే కొంత ఆశ్చర్యమే..అయినా అది నిజమే మరి. మునగపాక మండలం చూచుకొండ గ్రామానికి చెందిన దాదాపు 30 మంది వృద్ధులకు, వికలాంగులకు వేలిముద్రలు పడలేదన్న కారణంతో గ్రామ కార్యదర్శి పిం ఛన్లు ఆపేశారు. మూడు నెలలుపాటు పెన్షన్ తీసుకోకపోతే శాశ్వతంగా రద్దు అయిపోతుందని చెప్పడంతో వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.జీవిత చరమాంకంలో ఎంతో ఆసరా నిచ్చేపెన్షన్‌కు దూరమైపోతామన్న ఆందోళన వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తిండితిప్పలు మాని సోమవారం తెల్లవారుజామున 4గంటలకు బయల్దేరి విశాఖకు వచ్చారు.
గ్రీవెన్స్‌లో తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన వారికి కలెక్టర్ ఇంకా రాలేదని తెలియడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. మామూలుగా గ్రామంలో ఒ కరికి లేదా ఇద్దరికి వేలిముద్రలు పడలేదంటే సరే . కానీ ఒకే గ్రామంలో ఏకంగా 30 మందికి పైగా వృద్ధులు, వికలాంగులకు వేలిముద్రలు పడలేదంటే యంత్రంలో లోపమా లేదా యంత్రాంగంలో లోపమా తెలియని దుస్థితి నెలకొంది.ఈ పరిస్థితి ఒక్క మునగ పాకలోనే కాదు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. వేలాదిమంది ఇదే సమస్య తో పింఛన్ అందక చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ ప్రతి నెలా రోజుల తరబడ్రిçపదక్షిణలు చేçస్తూ్తనే ఉన్నారు.
పాతికవేలమందికి అవస్థ
వేలిముద్రలు పడక..ఐరిష్ కాప్చర్ చేయక పోవడంతో పింఛన్ అందకపస్తులతో అలమటిస్తున్నారు. 5వ తేదీలో గానే పింఛన్ పంపిణీ చేసేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప 25వతేదీ వచ్చిన పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. సాప్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసి నాలుగు నెలలు కావస్తున్నా సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదు. వేలిముద్రలు, ఐరిష్ కాప్చర్ సాకుతో ప్రతి నెలా పాతిక వేల మందికి పింఛన్లు అందని దుస్థితి.
ప్రతి నెలా 1500 పింఛన్ల్ల కోత
ఇక వరుసగా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోలేదనే సాకుతో ప్రతి నెలా 500 నుంచి 1500 వరకు పింఛన్లకు మంగళం పాడేసింది. ఇలా గడిచిన ఏడాదిలో ఏకంగా 13,027 పింఛన్లను రద్దు చేశారు. గతేడాది జనవరి నాటికి పెంచిన పింఛన్లతో కలిసి జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,47,449కు చేరాయి. కానీ ఆ తర్వాత ప్రతి నెలా వేలిముద్రలు, సాంకేతిక సమస్యలతో ప్రతి నెలా వెయ్యికి పైగా పింఛన్లకుకోతపడుతూనే ఉంది. ఇలా కోతల మీద కోతలు పడగా ప్రస్తుతం జిల్లాలో పింఛన్ల సంఖ్య 3,34,422కు చేరాయి. కనీసం ఈ పింఛన్లయినా అందుతున్నాయా అంటే అదీ లేదు. మార్చి నెలలో ఇప్పటి వరకు 2.94లక్షల మందికి మాత్రమే పింఛన్లు అందాయి. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో ఈ నెల 12వ స్థానంలో ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది.
రూ.4కోట్లు కొరత
ప్రతి నెలా 30వ తేదీకల్లా మండలాలకు పింఛన్ల సంఖ్యను బట్టి అవసరమైన నగదును బట్వాడా చేస్తుంటాం. కానీ ఈ నెల నగదు కొరత తీవ్రంగా ఉంది. జిల్లాలో పింఛన్ల సంఖ్యను బట్టి రూ.37.39కోట్ల నగదు కావాలి కానీ రూ.4కోట్ల వరకు కొరత వచ్చింది. బ్యాంకుల్లో కూడా సొమ్ముల్లేక సర్దుబాటుచేయలేకపోయారు. 30వ తేదీలోగా సర్దుబాటు చేయాల్సిన నగదు 10వతేదీ వచ్చినా సర్దుబాటుచేయలేకపోయారు. సుమారు 12 మండలాలకు కనీసం మూడో వంతు పింఛన్‌దారులకు కూడా సరిపడా డబ్బు లేని పరిస్థితి నెలకొంది.
తిండి తిప్పలు లేకుండా వచ్చాం..
నాకు రెండు నెలలుగా వేలిముద్రలు పడలేదని పెన్షన్ ఇవ్వలేదు. మా తహశీల్దారు కార్యాలయంలో విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికే రెండు నెలలు అయ్యింది. మూడు నెలలు దాటితే పూర్తిగా నిలిపివేస్తామని చెప్పడంతో ఇక్కడకు వచ్చాం. తిండి తిప్పలు లేకుండా వచ్చాం.. మళ్లీ సోమవారం రమ్మన్నారు.–పెంటకోట దుర్గాలమ్మ
ఆందోళన చెందొద్దు
వేలిముద్రలు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. వేలిముద్రలు పడకపోయినా చివరి రోజున కార్యదర్శుల వేలిముద్రలతో ఇవ్వొచ్చని చె ప్పాం. ఈ నెలలో 300 ఐరిష్ మిషీన్లు కొత్తగా కొనుగోలు చేశాం. ఈ నెలలో నగదు కొరత కారణంగా 90 శాతానికి మించి పంపిణీ చేసే అవకాశాలు కన్పించడం లేదు. అందని వారికి 2 నెలలదీ కలిపి ఒకసారి ఇస్తాం. పింఛన్‌దారులు ఆందోళన చెందొద్దు. –సత్యసాయిశ్రీనివాస్, పీడీ, డీఆర్‌డీఎ
Comments
Please login to add a commentAdd a comment