దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం
- పురుగులు, రాళ్ల బియ్యం ఇస్తన్నారు
- వైఎస్సార్ సీపీ అధినేత జగన్ ముందు బాధితుల రోదన
- కష్టాలు తీరేంతవరకూ పోరాడదామని భరోసా
- తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నాలుగో రోజు పర్యటన
- మరమ్మతులకు రూ.50 వేలివ్వాలి
- కొత్త ఇళ్లు నిర్మించాలి
- ప్రభుత్వానికి జగన్ డిమాండ్
తల్లీ... మిమ్మల్ని చూసేందుకు ఎవరైనా వచ్చారా..
ప్రభుత్వ ఉద్యోగి వచ్చి ఏమైనా రాసుకున్నారా?
ఎవరూ రానేదు బాబూ.. దీపం బుడ్డితో చీకటి పోరు చేస్తన్నాం.
మా బాధలు ఎవరూ పట్టించుకోట్లేదు.
సాయం ఏదైనా చేశారా తల్లీలేదు బాబూ...అర్ధరాత్రి 12 గంటలప్పుడు పాలు, పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోనారంట. మాలో కొందరు తెచ్చుకున్నారు. కొందరికి దొరకనే లేదు. పురుగులు, రాళ్లతో ఉన్న బియ్యం ఇస్తన్నారు. ఎంత కష్టంలో ఉంటే మాత్రం అలాంటి బియ్యం ఎలా తినాల. మా బతుకులు కుక్కల కంటే హీనంగా ఉన్నాయ్.
పాలు, పులిహోర బాగున్నాయా అమ్మా..
అయ్యో.! బాబూ.. పాలు విరిగిపోనాయి..పసోళ్లు ఆకలితో ఏడుస్తుంటే అటూ ఇటూ వెళ్లి పాలు అడిగి తెచ్చుకుంటున్నాం. పులిహోర పాసికంపు కొడుతుంటే తినలేక పారేసినాం. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం పర్యటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, బాధితుల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సాక్షి, విశాఖపట్నం: పెను విపత్తు వచ్చి ఆరు రోజులు గడుస్తున్నా కనీసం ఓదార్పునకు నోచుకోని అభాగ్యుల వద్దకు జగన్ వెళ్లారు. కూలిన ఇళ్లల్లోకి వెళ్లి పరిశీలించారు. వారి కష్టాలు చూసి కన్నీళ్లు తుడిచారు. ఉదయం గాంధీనగర్‌లో జగన్ పర్యటించారు. ‘ఎండలో అలోలచ్చనా అంటూ కాలం గడుపుతున్నాం బాబూ’ అంటూ లక్ష్మమ్మ జగన్‌ను చూడగానే బోరున విలపించింది. మీకు బియ్యం కార్డులు ఉన్నాయా, పింఛన్లు వస్తున్నాయా అని జగన్ ప్రశ్నించగా, కార్డులున్నా ఎవరికీ పింఛన్ రావడం లేదని అక్కడి వారు బదులిచ్చారు. తన భర్త చనిపోయి నెలరోజులు కాకుండానే ఉన్న గూడు కూడా తుపానుకు ఎగిరిపోయిందని, చీకట్లో బతుకుతున్నామని, పాములు వచ్చేస్తున్నాయని గొంతేని మహాలక్ష్మి వాపోయింది.
పురుగుల బియ్యం ఇచ్చారు
సాకేతపురం చేరుకున్న జగన్‌కు మాడుగుల అప్పలతల్లి తనకు ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తీసుకొచ్చి ‘ఇదిగో బాబూ.. పురుగులు, రాళ్లు ఉన్న ఈ బియ్యం ఇచ్చారు. ఇష్టం లేదంటే పట్టికెళ్లడం మానేయమంటున్నారు. ఏం చేస్తాం.. తప్పని సరై తెచ్చుకుంటున్నాం.’ అని చూపించింది. పొట్నాల వరలక్ష్మి ఇంటికి వెళ్లి కూలిన స్లాబును జగన్ చూశారు. అక్కడి నుంచి స్టీల్‌ప్లాంట్ మీదుగా ఇస్లాంపేట వెళ్తూ ప్లాంట్ ఉద్యోగులను పలకరించారు. ఇస్లాంపేట్‌లో తుపానుకు కూలిన 150 ఏళ్లనాటి జామియా మసీదును సందర్శించారు.
మినార్ పునర్నిర్మాణానికి జగన్ హామీ
మినార్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సాయం చేసినా చేయకపోయినా తన వంతు సహకరిస్తానని ముస్లింలకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సాయం అందేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. మత పెద్దలు సర్ధార్ మాస్టర్, గఫూర్‌మాస్టర్‌లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం జగన్‌కు వినతి పత్రం అందజేశారు. కళాశాలలో శాశ్వత అధ్యాపకులను నియమించాలని, పక్కా ఇళ్లు, మసీదు నిర్మించాలని, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థల్లో స్థానిక ముస్లింలకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని తమ తరపున కోరాలని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి బర్మాకాలనీకి చేరుకుని కాందశీకుల ఇళ్లను పరిశీలించారు.
పరామర్శకైనా ఎవరూ రాలేదు
‘తిండి పెట్టకపోయినా పర్లేదు. కనీసం పరామర్శించడానికి కూడా ఎవరూ రాలేరు. కనీసం పారలు, గునపాలు ఇస్తే మా ప్రాంతాన్ని మేమే శుభ్రం చేసుకుంటామని అడిగినా నగరపాలక సంస్థ వాళ్లు అవి లేవంటున్నారు.’ అని కర్రిరాజు, గోకరకొండ శ్యామల జగన్‌కు తమ పరిస్థితిని వివరించారు. ముగ్గురు పిల్లలతో రేకుల షెడ్డులో ఉన్నామని, తుపానుకు అదీ పడిపోయిందని రీసు కనకరాజు, పూర్ణ దంపతులు తమ ఇంటిని చూపించారు. డెయిరీ కాలనీలో ప్రజలు తాము డ్రెయిన్ వల్ల పడుతున్న ఇబ్బందులను చూపించారు.
గాజువాక నుంచి సెప్టిక్ ట్యాంకుల్ని ఈ డ్రెయిన్‌లో వదులుతున్నారని, సముద్రం పోటెత్తితే పొంగి కాలనీ మునిగిపోతోందని ఎం.కె.ఎన్.మూర్తి వివరించారు. డ్రెయిన్‌లో ఏటా పూడిక తీయించి, ఇరువైపులా గోడ నిర్మిస్తే కాస్త ఊరట లభిస్తుందనగా, ఆ పని సాధనకు అవసరమైతే ప్రజలతో కలిసి ధర్నాలు, ఆందోళనలు చేయాలని పార్టీ నేతలకు జగన్ సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాత్రివేళ 12 గంటలప్పుడు పులిహోర ప్యాకెట్లు విసిరేసి పోకుండా ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి సాయం చేయాలన్నారు. రూ.పది విలువైన పులిహోర ఇచ్చి సాయం చేసేస్తున్నామనడం ధర్మమేనా? అని ప్రశ్నించారు. ఇంటి మరమ్మతులకు తక్షణమే రూ.50 వేలు ఇవ్వాలి.
250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా కొత్త ఇళ్లు నిర్మించాలి. దానికి ఎంత ఖర్చయినా ఎస్టిమేషన్ వేసి కట్టించాలి.’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి అశోక్‌నగర్ చేరుకొని బాధితులను పరామర్శించారు. జగన్ వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల బాబూరావు, తలసిల రఘురామ్, సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కోలా గురువులు, చొక్కాకుల వెంకటరావు, తిప్పల నాగిరెడ్డి, కర్రి సీతారామ్, పార్టీ నేతలు కొయ్య ప్రసాదరెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, పసుపులేటి ఉషాకిరణ్, భాస్కర్‌రెడ్డి, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని ఉన్నారు.
లారీ వెనక పరుగు తీశామన్నా
ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామన్నా. పిల్లలు, ముసలోళ్ల పరిస్థితైతే మరీ దారుణంగా ఉందన్నా. ఎవరైనా వస్తారేమో, సాయం చేస్తారేమో అని ఎదురుచూసినా ఎవరూ రాలేదన్నా. బ్రిడ్జి కింద అది కట్టకముందు నుంచీ ఉన్నాం. మేమెలా ఉన్నామని ఎవరూ పట్టించుకోవట్లేదు. బ్రిడ్జి మీద బియ్యం లారీ వెళ్తుంటే ఆపమని లారీ వెనక పరుగెత్తినా ఆపలేదు.
-ఆసనాల గౌరి, గాంధీనగర్
ఈ బియ్యం కుక్కలు కూడా ముట్టవు
మంచి బియ్యం ఇస్తామని గవర్నమెంటోళ్లు ఈ బియ్యం ఇచ్చారు. పురుగులు పట్టేసున్నాయ్. ఇవి ఎవరు తింటారు. వండి పెడితే కుక్కలు కూడా ముట్టుకోవడం లేదు. ఎప్పుడూ ఇవే ఇస్తున్నారు. మా బాధలు వినడానికి నువ్వొక్కడివే వచ్చావ్.
-బంగారి రాజ్యలక్ష్మి, సాకేతపురం