
సాక్షి, హైదరాబాద్: ఇక ఆహార భద్రత(రేషన్) కార్డు లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తేనే రేషన్ సరుకుల పంపిణీ జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో ఫిబ్రవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో ఈ–పాస్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,031 రేషన్ షాపులు ఉండగా వాటిలో ఈ–పాస్ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. దీంతో పూర్తి స్థాయిలో బయోమెట్రిక్‌పైనే సరుకులు పంపిణీకి పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఛత్తీస్‌గడ్ తరహాలో లబ్ధిదారులు ఎక్కడి నుంచైనా సరుకులు తీసుకునే పోర్టబిలిటీ విధానం ఏప్రిల్ నుంచి అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ–పాస్ విధానంలో సరుకుల పంపిణీ జరుగుతుండటం రేషన్ పోర్టబిలిటీకి కలిసి వచ్చింది. ఈ–పాస్ బయోమెట్రిక్‌లో లబ్ధిదారుల డేటా ఉండటంతో వేలిముద్ర లతో రేషన్ సరుకులు ఎక్కడ నుంచైనా తీసుకునే వెసులుబాటు కలిగింది.