- ఇకపై తపాలాశాఖ ద్వారా పింఛన్లు
సాక్షి, హైదరాబాద్: పింఛన్ల పంపిణీకి తపాలా కార్యాలయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో తపాలా శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గతంలో రూ.200, రూ.500 పింఛన్లను కొన్ని జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా అందించారు. దానికి ప్రచారం లేకపోవటంతో ప్రజల నుంచి సరైన స్పందన రాలేదు.
ప్రస్తుత టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధారణ పింఛన్లను రూ.1,000, వికలాంగుల పింఛన్లను రూ.1,500కు పెంచింది. కానీ, బోగస్ లబ్ధిదారుల కారణంగా పింఛన్ల జాబితాలో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ తాజా జాబితా తపాలా శాఖకు అంద లేదు. దీంతో పోస్టాఫీసుల్లో అందజేసే పింఛన్లు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది. ప్రయోగాత్మకంగా నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఆ జిల్లాల లబ్ధిదారుల జాబితాను తపాలా శాఖకు అందజేసింది. పింఛనుదారుల పేరుతో ఖాతాలు తెరిచి, పంపిణీకి ఏర్పాట్లు చేయాలని తపాలాశాఖ అధికారులకు సూచించింది.