Experimental
-
ఎర్రచందనం..ఎనీటైమ్ ప్రొటెక్షన్
చిప్ పనితీరు ఇలా.. రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్‌లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్‌తో క్లౌడ్ సర్వర్‌ను అనుసంధానం చేయడంతో యూజర్స్‌కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది. గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ) వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్‌లు అమర్చామని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్‌ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్‌టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు. సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్‌తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్‌లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుందన్నారు. చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్‌కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్ఎఫ్డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీ అక్కర్లేదు, ఒక చెట్టున్నా చాలు
న్యూఢిల్లీ: ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఏసీ గదుల్లోంచి బయటకు రావడానికే జనం ఇష్టం పడడం లేదు. సుభాషిణి చంద్రమణి అనే మహిళ మాత్రం ఎండ నుంచి రక్షణకి ఏసీ గదులు అక్కర్లేదని ఒక చెట్టు చాలని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఆమె మండుటెండలో నిల్చొని ఉష్ణోగ్రతని రికార్డు చేస్తే 40 డిగ్రీల సెల్సియస్ చూపించింది. అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న చెట్టు నీడలోకి వెళితే ఉష్ణోగ్రతలు భారీగా తగ్గిపోయి 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంటే ఏకంగా 13 డిగ్రీలు తేడా ఉందన్న మాట. ఆమె ఈ ప్రయోగం చేసి దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేస్తే అది వైరల్‌గా మారింది. -
Rutvik Lokhande: ఈ కుర్రాడు... ‘సక్సెస్’కు సన్నిహిత మిత్రుడు
ఈ అబ్బాయికి తన వయసు వారిలాగే సినిమాలు అంటే ఇష్టం. సినిమా పాటలు అంటే ఇష్టం. ఆ పాటలకు తీన్మార్ డ్యాన్స్ చేయడం అంటే ఇష్టం. అయితే వీటితో పాటు తనకు టెక్నాలజీ అంటే కూడా ఇష్టం. ఆ ఇష్టమే ఇతడిని 14 సంవత్సరాల వయసులో కంటెంట్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి కారణం అయింది. 21 సంవత్సరాల వయసులో సొంతంగా ఒక స్టార్టప్ స్టార్ట్ చేయడానికి, మరో కంపెనీలో భాగస్వామి కావడానికి కారణం అయింది... టిక్‌టాక్‌తో ఊపందుకున్న షార్ట్ ఫామ్ కంటెంట్ ఆ తరువాత యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్... మొదలైన మాధ్యమాల ద్వారా మరింత విస్తరించింది. షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల ప్రేక్షకులకు అందే వినోదం అనేది ఒక కోణం మాత్రమే. మరో కోణంలో చూస్తే షార్ట్ ఫామ్ కంటెంట్ వల్ల రకరకాల జానర్లలో ఎంతోమంది యువప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. మ్యూజిక్ ఇండస్ట్రీలో కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తోంది. అన్ని మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో యాక్టివ్ స్ట్రీమర్స్ పెరిగారు.వీరిని రకరకాల బ్రాండ్స్ తమ మార్కెటింగ్‌కు ఉపయోగించుకుంటున్నాయి. సంప్రదాయ మార్కెటింగ్‌తో పోల్చితే ఇది తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారం.ఇన్ఫ్లుయెన్సర్లు, బ్రాండ్లకు మధ్య వారధిగా ముంబైలో ఏర్పడిన ‘నోఫిల్టర్’ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ సంస్థ వ్యవస్థాపక సభ్యులలో ముంబైకి చెందిన రుత్విక్ లోఖండె ఒకరు. అప్పుడు అతని వయసు 14 సంవత్సరాలు. క్రిప్టో కరెన్సీ నేపథ్యంలో అందరిలాగే బ్లాక్‌చెయిన్ అనే మాటను చాలాసార్లు విన్నాడు రుత్విక్. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటీ) భద్రతకు ఉపకరించే, డేటాను జాగ్రత్తగా కాపాడే, పారదర్శకతకు వీలయ్యే బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ రుత్విక్‌ను బాగా ఆకర్షించింది. ‘ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది?’ అని ఆలోచించాడు. ‘ఇలా ఉపయోగించుకోవచ్చు’ అనే ఐడియా తట్టడంతో బ్లాక్‌చెయిన్ సాంకేతికత ఆధారంగా ‘బిలీవర్స్’ అనే స్టార్టప్‌కు శ్రీకారం చుట్టి సూపర్‌హిట్ చేశాడు. ఈ ప్లాట్‌ఫామ్ కళాకారులకు సహాయపడుతుంది. ఉదాహరణకు... రైటర్ లేదా డైరెక్టర్ కావాలనుకుంటున్నవారు తమ స్క్రిప్ట్‌ను షేర్ చేస్తే, అది ఆడియెన్స్(బిలీవర్స్)కు నచ్చితే నిధుల సమీకరణకు వీలవుతుంది. ‘షార్ట్ కంటెంట్ అనేది హోటల్స్ నుంచి టూర్గైడ్ల వరకు ప్రతి ఒక్కరికీ తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది’ అంటున్న రుత్విక్ ప్రస్తుతం ఎక్స్పెరిమెంటల్ మార్కెటింగ్ సంస్థ ‘కొలబ్ట్రైబ్’ భాగస్వామి. ‘ప్రస్తుతం మన దేశంలో స్ట్రీట్కల్చర్ పెరిగింది. హిప్ హాప్ టాలెంట్ ముందుకు వస్తుంది. మారుమూల గ్రామంలో ఎక్కడో ఉన్న కళాకారుడి ప్రతిభ ప్రపంచానికి తెలియడానికి ఎంతో టైమ్ పట్టడం లేదు. అయితే ప్రపంచంలోని ఎన్నో దేశాలతో పోల్చితే మన దగ్గర వీరి ప్రతిభకు సరిౖయెన ప్రతిఫలం లభించడం లేదు. 2025 నాటికి కంటెంట్ క్రియేషన్‌కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ అభిరుచుల ప్రకారం ఇన్ఫ్లూయెన్సర్ కావచ్చు, అయితే ప్రతిభ మాత్రమే సరిపోదు. తమ కంటెంట్‌ను ప్రమోట్ చేసుకోవడానికి మార్కెటింగ్ స్కిల్స్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి’ అంటున్నాడు రుత్విక్. కంటెంట్ క్రియేషన్‌లో వ్యక్తులు, సంస్థలకు సహాయపడడానికి ఏంజెల్ ఫండ్ ‘మూన్ క్యాపిటల్’ లాంచ్ చేసే ప్రయత్నాలలో ఉన్నాడు రుత్విక్. ‘ప్రతిభకు ఎలాంటి హద్దులు, అవరోధాలు లేవు. అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాంటిది’ అంటున్నాడు యంగ్‌స్టార్ రిత్విక్. తన సక్సెస్ స్టోరీ ఆ విషయాన్ని చెప్పకనే చెబుతుంది కదా! -
కంటికి శ్రమ తగ్గించే 'స్క్రీనర్లు'
న్యూయార్క్ః ఆధునిక జీవితంలో ప్రతి విషయం ఫింగర్ టిప్స్ పై ఉండాలంటే స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్ ల్యాప్ లపై ఆధారపడటం తప్పడం లేదు. కొందరు ఆధునిక టెక్నాలజీకి, సామాజిక మాధ్యమాలకు బానిసలు కూడ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలో అతిగా స్క్రీన్ చూడటం వల్ల అనేక అనర్థాలు కలుగుతున్నాయి. స్క్రీన్ నుంచి వెలువడే కాంతికి కంటి సమస్యలూ అధికమౌతున్నాయి. ఇందుకు పరిష్కారం దిశగా ఆలోచించిన పరిశోధకులు కంటికి రక్షణ కల్పించే పారదర్శక అద్దాలను అందుబాటులోకి తెచ్చారు. స్క్రీన్ చూసేప్పుడు వాటిని వినియోగించడంవల్ల కాంతిని నిరోధించి కంటికి శ్రమ తగ్గిస్తాయని చెప్తున్నారు. స్క్రీనర్ల పేరిట కాంతిని నిరోధించే ప్రయోగాత్మక పారదర్శక అద్దాలు అందుబాటులోకి వచ్చాయి. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు అధికంగా వాడేవారు తీవ్రమైన కంటి సమస్యలతో బాధపడుతుండటాన్ని దృష్టిలో పెట్టుకున్న 28 ఏళ్ళ ఛినో కిమ్ ఆ దిశగా ఆలోచించాడు. ఆధునిక అద్దాలను ధరించడంవల్ల అత్యధిక సమయం స్క్రీన్లు చూసేవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాడు. టెక్ సంస్కృతి వైరస్ లా వ్యాపిస్తున్న నేటి తరుణంలో కంటిని కాపాడేందుకు తన నూతన సృష్టి ఎంతగానో సహకరిస్తుందని ఇటీవల జరిగిన ఎన్ వై యు ఇంటరాక్టివ్ టెలికమ్యూనికేషన్స్ కార్యక్రమం స్ప్రింగ్ షోలో తెలిపాడు. 'స్క్రీనర్' ను తలకు ధరించి చూడ్డంద్వారా కంటి సమస్యలనుంచి బయటపడొచ్చని ఛినోకిమ్ చెప్తున్నాడు. దైనందిన జీవితంలో ఎక్కువశాతం స్క్రీన్లను చూసేవారు స్మార్ట్ ఫిల్మ్ తో తయారు చేసిన లెన్స్ కలిగిన ఈ స్క్రీనర్ ను వినియోగిస్తే ఫలితాలు ఉంటాయంటున్నాడు. 'మెషీన్ లెర్నింగ్ ఫర్ ఆర్ట్స్' చదువుతున్న సమయంలో తనకు ఈ కొత్త ఆలోచన వచ్చిందని, బేసిక్ మెషీన్ లెర్నింగ్ అండ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఈ అద్దాలను రూపొందించినట్లు కిమ్ తెలిపాడు. స్క్రీనర్లు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ నుంచి కూడ రక్షిస్తాయని తెలిపాడు. -
‘సౌరశక్తి’ ఉత్తదే!
సాక్షి, సిటీబ్యూరో : సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) చేసిన ప్రయోగం వికటించింది. వీధి దీపాలకు, వాణిజ్య ప్రకటనలకు సాధారణ విద్యుత్‌ను కాకుండా సౌర విద్యుత్‌ను వినియోగించాలని గతంలో హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ మేరకు ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్డులో 16 సోలార్ విద్యుత్ దీపాలు, పీపుల్స్ ప్లాజా వద్ద ఓ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది. సౌరశక్తి ఆధారంగా ఇవి వెలుగులు విరజిమ్మేలా అట్టహాసంగా తీర్చిదిద్దారు. నెక్లెస్ రోడ్డుకు వ్యాహాళికి వచ్చే ప్రజలకు సౌరశక్తి వినియోగంపై అవగాహన పెంచేందుకు ఇవి ఓ మోడల్‌గా ఉంటాయని భావించారు. అయితే... వాటికి నాసిరకం సోలార్ ప్యానల్స్ వినియోగించడం వల్ల ఈ ప్రయోగం ఆదిలోనే బెడిసికొట్టింది. సోలార్ విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో కంగుతిన్న అధికారులు తమ లోపాన్ని కప్పిపుచ్చుకొనేందుకు గుట్టుచప్పుడు కాకుండా సాధారణ విద్యుత్‌ను సరఫరా చేసి ఆ మార్గంలో లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేశారు. దీన్నిచూసిన ఉన్నతాధికారులు సైతం ఆహా... ఓహో.. అంటూ ఆర్భాటంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించి వెళ్లిపోయారు. ఆ తర్వాత వీటిగురించి పట్టించుకొన్న నాధుడు లేకపోవడంతో సోలార్ లైట్లు అసలు పనిచేయని విషయం బయటకు పొక్కలేదు. ఇందుకోసం వెచ్చించిన లక్షలాది రూపాయల నిధులు బూడిదలో పోసిన పన్నీరయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఫలించని యత్నం ధరిత్రీ దినోత్సవం సందర్భంగా 2010 ఏప్రిల్ 22న సంజీవయ్య పార్కులో 17 సౌరశక్తి దీపాలను ఏర్పాటు చేసి సౌరశక్తి వినియోగానికి హెచ్ఎండీఏ తెర తీసింది. ఆ తర్వాత నెక్లెస్ రోడ్డులోనూ అదే ప్రయోగాన్ని అమలు చేస్తూ తన పరిధిలోని హోర్డింగ్స్, పార్కులు, ఇతర ప్రాంతాల్లో సోలార్ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే... సంజీవయ్య పార్కులో సోలార్ విద్యుత్ దీపాలు కేవలం వేసవి కాలంలోనే పనిచేసి ఆ తర్వాత మొరాయించాయి. ఇప్పుడక్కడ ఒక్కటంటే ఒక్కటి కూడా సోలార్ లైటు వెలగడం లేదు. వీటిని మరమ్మతు చేయించేందుకు ప్రయత్నించిన అధికారులకు ఆలస్యంగా అసలు విషయం బోధపడింది. హుస్సేన్‌సాగర్ పరిసరప్రాంతాల్లో వాయు కాలుష్యం కారణంగా సోలార్ ప్యానల్స్‌పై ఓ పొరలా రస్ట్ ఏర్పడి అవి పనిచేయట్లదని తెలిసింది. సంజీవ్య పార్కులో రోజ్ గార్డెన్ నిర్మాణం కోసం అక్కడున్న సోలార్ లైట్లను తొలగించిన అధికారులు మళ్లీ వాటిని ఏర్పాటు చేసేందుకు శ్రద్ధ తీసుకోలేదు. నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్కులో సోలార్ లైట్లు పనిచేయని విషయమై సంబంధిత అధికారిని వివరణ కోరగా ‘ సోలార్ లైటింగ్ ఇక్కడే కాదు... ఎక్కడా కూడా అవి సక్సెస్ కాలేదు. మాదాపూర్ సమీపంలోని ఓ తండాలో ఏర్పాటు చేసిన లైట్లు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి’ అని సెలవిచ్చారు. రోజ్‌గార్డెన్ నిర్మాణం కోసం సంజీవయ్య పార్కులో కొన్ని సోలార్ లైట్లను తొలగించాల్సి వచ్చిందని, మిగిలినవి అలాగే ఉన్నాయన్నారు. ఇప్పుడు వాటికి మరమ్మతులు చేసినా పనిచేసే స్థితిలో లేవన్నారు. -
ఇకపై తపాలాశాఖ ద్వారా పింఛన్లు
ఇకపై తపాలాశాఖ ద్వారా పింఛన్లు సాక్షి, హైదరాబాద్: పింఛన్ల పంపిణీకి తపాలా కార్యాలయాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలో తపాలా శాఖతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గతంలో రూ.200, రూ.500 పింఛన్లను కొన్ని జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా అందించారు. దానికి ప్రచారం లేకపోవటంతో ప్రజల నుంచి సరైన స్పందన రాలేదు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం సాధారణ పింఛన్లను రూ.1,000, వికలాంగుల పింఛన్లను రూ.1,500కు పెంచింది. కానీ, బోగస్ లబ్ధిదారుల కారణంగా పింఛన్ల జాబితాలో మార్పులు చేర్పులు జరిగాయి. ఈ తాజా జాబితా తపాలా శాఖకు అంద లేదు. దీంతో పోస్టాఫీసుల్లో అందజేసే పింఛన్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది. ప్రయోగాత్మకంగా నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ఆ జిల్లాల లబ్ధిదారుల జాబితాను తపాలా శాఖకు అందజేసింది. పింఛనుదారుల పేరుతో ఖాతాలు తెరిచి, పంపిణీకి ఏర్పాట్లు చేయాలని తపాలాశాఖ అధికారులకు సూచించింది. -
పంచాయతీల్లో పవన విద్యుత్!
సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఎత్తై ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో ఏర్పాటు మెదక్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు అవసరమైతే పంచాయతీల ద్వారా నిధులిస్తామని సూచన కసరత్తు ప్రారంభించిన జెన్కో సాక్షి, హైదరాబాద్: తక్కువ విద్యుత్ విని యో గం ఉండే చిన్న పల్లెలు, ఆవాస ప్రాంతాలు, తండాల్లో పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గుట్టలు, కొండలతో కూడిన ఎత్తై ప్రాం తాలను గుర్తించాలని.. సాధ్యాసాధ్యాలను, ప్రయోజనమెంత అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గం గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు. తెలంగాణ లో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుట్టలు, కొండలు విస్తరించి ఉన్నాయని... ఎత్తై ఈ ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పవన విద్యుదుత్పత్తికి సాధ్యమయ్యే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. కేవలం వీధి దీపాలు, రాత్రి పూట బల్బులు తప్ప విద్యుత్ గృహోపకరణాలు లేనటువంటి చిన్న పంచాయతీలను ఎంచుకోవాలని చెప్పారు. కొండలు, గుట్టల పరి సరాల్లోని తండాలు, చిన్న పంచాయతీల పరిధిలో ఈ ప్లాంట్లు నెలకొల్పితే ఎంత విద్యుత్ సరఫరా చేసే వీలుంది, ఎంత ప్రయోజనం ఉం టుందనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. అవసరమైతే పంచాయతీల ద్వారా ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని అధికారులకు సీఎం చెప్పారు. ఒక పల్లెలో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని పల్లెల్లో పవన విద్యు త్ ఉత్పత్తికి అనువైన అవకాశాలున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించా రు. సీఎం ఆదేశం మేరకు అవసరమైన సమాచా రం సేకరణకు జెన్కో కసరత్తు ప్రారంభించింది. రెండు జిల్లాల్లో ఎక్కువ.. రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రీన్కో కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 750 ఎకరాల విస్తీర్ణంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే జిల్లాలోని ఆమనగల్లులో 150 మెగావాట్ల ప్రాజెక్టుకు తెలంగాణ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ చేసుకుంది. దీంతో పాటు కొడంగల్‌లో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మెదక్ జిల్లా కంగ్టిలో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్కో కంపెనీ గతంలోనే ప్రతిపాదనలు సమర్పించింది. వీటితో పాటు మైత్రి సంస్థ రంగారెడ్డి జిల్లా పరిగిలో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఎంవోయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన ప్లాంటులోని ఒక్క యూనిట్‌తో (ఒక గాలి మర) గరిష్ఠంగా 2.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే లక్ష్య సాధనతో పాటు.. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇది మార్గంగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
మేడ్ ఇన్ స్పేస్..
‘మేడ్ ఇన్ స్పేస్’, ‘నాసా’ ఆంగ్ల పదాలను అమర్చిన ఈ బోర్డు అంతరిక్షంలో త్రీడీ ప్రింటర్ ద్వారా తయారు చేసిన తొలి వస్తువు. భూమి చుట్టూ 400 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సోమవారం సృష్టించిన దీనిని ఐఎస్ఎస్ కమాం డర్ బ్యారీ విల్మోర్ ఇలా ప్రదర్శించారు. ఇటీవలే ఐఎస్ఎస్కు నాసా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు ఒక జీరో గ్రావిటీ త్రీడీ ప్రింటర్‌ను పంపారు. అయితే, గురుత్వాకర్షణ లేమి వల్ల ఐఎస్ఎస్లో ఈ త్రీడీ ప్రింటర్ ప్రింట్ చేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు ప్రింటింగ్ పలకకు గట్టిగా అతుక్కుపోతున్నాయట. ప్రస్తుతం దీనితో ప్రయోగాలు తొలిదశలోనే ఉన్నా.. భవిష్యత్తులో అనేక వస్తువులను అక్కడే తయారు చేసుకోవచ్చని, చంద్రుడు ఇతర గ్రహాలపై మట్టితో ఇటుకలు తయారుచేసి వాటితో ఇళ్లు సైతం నిర్మించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
అక్రమ-సక్రమ ఆర్డినెన్స్‌పై పునరాలోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో నియమావళిని ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్న ు జారీ చేయాలనుకున్న ప్రభుత్వం, తదనంతర పరిస్థితులపై ఇప్పుడు పునరాలోచన లో పడింది. ఆ ఆర్డినెన్స్‌ను యథాతథంగా కాకుండా కొన్ని సవరణలతో తీసుకు రావాలని యోచిస్తోంది. ఇప్పుడున్న విధంగానే అమలు చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. దీనిని ముందు పెట్టుకుని నివాసుల సంఘాల సమాఖ్యలు లేదా వ్యక్తులు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. కనుక ప్రస్తుతం ఉన్నదున్నట్లుగా ఆర్డినెన్స్ తీసుకు రావద్దని న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. దీనికి బదులు ప్రయోగాత్మకంగా వార్డు లేదా జోన్ పరిధిలో అక్రమ-సక్రమ చేపట్టాలని సలహా ఇచ్చారు. తద్వారా మున్ముందు ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీనికి తోడు వ చ్చే నెలలో బెల్గాంలో శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టి చర్చించాలని, తర్వాతే అక్రమ-సక్రమను అమలు చేయాలని కూడా న్యాయ నిపుణులు సూచించారు. అనుకూలాంశాలు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ వల్ల నగరంలోని లక్షల మంది గృహాల యజమానులకు ఊరట కలుగుతుంది. తద్వారా లభించే కోట్ల రూపాయల ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు వీలేర్పడుతుంది. ప్రతికూలాంశాలు ఆర్డినెన్స్ ద్వారా నియమావళి ఉల్లంఘనను అడ్డుకోవడం సాధ్యమవుతుందని అనుకోవడానికి వీల్లేదు. తమను వంచించిన ఫ్లాట్ యజమానులకు కేవలం జరిమానా విధించడం ద్వారా అంతా సర్దుబాటు చేయడానికి వీలేర్పడుతుంది. కనుక ఈ ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.