బొటానికల్ గార్డెన్‌లో ఎర్రచందనం చెట్టుకు రియల్ టైం చిప్
చిప్ పనితీరు ఇలా..
రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్ సెన్సార్ పరికరం 3.6 వాల్ట్స్ లిథియమ్ ఇయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఎర్రచందనం చెట్లను ఎవరైనా నరికినా, దొంగిలించేందుకు ప్రయత్నించినా క్షణాల్లోనే మొబైల్ అప్లికేషన్స్, వాట్సాప్‌లకు అలర్ట్స్ పంపిస్తుంది. చెట్ల వద్ద ఉన్న హూటర్ ఎలక్ట్రానిక్ సైరన్ మోగిస్తుంది. వెంటనే అప్రమత్తమై చెట్లను రక్షించుకోవచ్చు.మొబైల్ అప్లికేషన్స్‌తో క్లౌడ్ సర్వర్‌ను అనుసంధానం చేయడంతో యూజర్స్‌కు వివిధ రకాల నివేదికలు చేరవేస్తుంది.
గచ్చిబౌలి : ఖరీదైన ఎర్రచందనం చెట్లను పరిరక్షించేందుకు అధునాతన పరికరం (రియల్‌టైం ప్రొటెక్షన్ చిప్) అందుబాటులోకి వచ్చింది. నగరంలోని బొటానికల్ గార్డెన్‌లో ప్రయోగాత్మకంగా చిప్ సెట్లు అమర్చినట్టు తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎఫ్‌డీసీ) వైస్‌చైర్మన్, ఎండీ డాక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కొత్తగూడలోని బొటానికల్ గార్డెన్‌లో విలేకరుల సమావేశంలో అధునాతన టెక్నాలజీని ఆయన వివరించారు. బొటానికల్ గార్డెన్‌లో 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయని, మొదటి విడతలో 50 ఎర్రచందనం చెట్లకు రియల్ టైం ప్రొటెక్షన్ చిప్‌లు అమర్చామని పేర్కొన్నారు.
బెంగళూరుకు చెందిన సీబీఐఓటీ టెక్నాలజీస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. చిప్‌ల అమరికతో దొంగల నుంచి ఎర్రచందనం చెట్లను రక్షించుకోవడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే వీలుంటుందన్నారు. సీబీఐఓటీ సీఈఓ సత్యనారాయణ చొప్పదండి మాట్లాడుతూ ఎర్రచందనం చెట్ల రక్షణకు తమ సంస్థ ఇండియన్ ఉడ్ సైన్స్ టెక్నాలజీస్(ఐడబ్ల్యూఎస్‌టీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ టెక్నాలజీని ఐడబ్ల్యూఎస్‌టీతో పాటు ఢిల్లీ ఐకార్, బెంగళూరు, ఝాన్సీ నగరాల్లో వాడుతున్నట్టు వివరించారు.
సెన్సార్ కేసింగ్ (యాంటినో)తో అనుసంధానం చేయడంతో మొబైల్ ఫోన్‌లోనే చెట్ల రక్షణ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎవరైనా చెట్టును కొట్టేందుకు ప్రయత్నించినా చిప్ సెట్ సాయంతో అలారం మోగుతుందన్నారు. ఒక్క సెన్సార్ కేసింగ్‌తో కిలోమీటరు దూరంలో ఉన్న 500 చెట్లకు చిప్‌లను అమర్చుకోవచ్చన్నారు.అధికగాలి, జంతువుల రాపిడిని గుర్తించే విధంగా చిప్ సెట్ ఉంటుందన్నారు. ప్రతిరోజూ రాత్రి చెట్టుకు సంబంధించిన సమాచారాన్ని సర్వర్‌కు చేరవేస్తుందన్నారు.
చెట్టును కొట్టాలని చూస్తే అలారం మోగుతుందని, చెట్టు ఎక్కడ ఉందనే వివరాలు ఫోన్‌కు చేరవేసి మ్యాప్ ద్వారా డైరెక్షన్ చూపిస్తుందన్నారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి బ్యాటరీ మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ సమావేశంలో టీఎస్‌ఎఫ్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్‌నాయక్, డైరెక్టర్ అక్బర్, ఎకో టూరిజం ప్రాజెక్ట్ మేనేజర్ సుమన్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment