పంచాయతీల్లో పవన విద్యుత్!
- సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
- ఎత్తై ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో ఏర్పాటు
- మెదక్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు
- అవసరమైతే పంచాయతీల ద్వారా నిధులిస్తామని సూచన
- కసరత్తు ప్రారంభించిన జెన్‌కో
సాక్షి, హైదరాబాద్: తక్కువ విద్యుత్ విని యో గం ఉండే చిన్న పల్లెలు, ఆవాస ప్రాంతాలు, తండాల్లో పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గుట్టలు, కొండలతో కూడిన ఎత్తై ప్రాం తాలను గుర్తించాలని.. సాధ్యాసాధ్యాలను, ప్రయోజనమెంత అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గం గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు.
తెలంగాణ లో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన గ్రీన్‌కో కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుట్టలు, కొండలు విస్తరించి ఉన్నాయని... ఎత్తై ఈ ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పవన విద్యుదుత్పత్తికి సాధ్యమయ్యే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు.
ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. కేవలం వీధి దీపాలు, రాత్రి పూట బల్బులు తప్ప విద్యుత్ గృహోపకరణాలు లేనటువంటి చిన్న పంచాయతీలను ఎంచుకోవాలని చెప్పారు. కొండలు, గుట్టల పరి సరాల్లోని తండాలు, చిన్న పంచాయతీల పరిధిలో ఈ ప్లాంట్లు నెలకొల్పితే ఎంత విద్యుత్ సరఫరా చేసే వీలుంది, ఎంత ప్రయోజనం ఉం టుందనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు.
అవసరమైతే పంచాయతీల ద్వారా ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని అధికారులకు సీఎం చెప్పారు. ఒక పల్లెలో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని పల్లెల్లో పవన విద్యు త్ ఉత్పత్తికి అనువైన అవకాశాలున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించా రు. సీఎం ఆదేశం మేరకు అవసరమైన సమాచా రం సేకరణకు జెన్‌కో కసరత్తు ప్రారంభించింది.
రెండు జిల్లాల్లో ఎక్కువ..
రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రీన్‌కో కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 750 ఎకరాల విస్తీర్ణంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే జిల్లాలోని ఆమనగల్లులో 150 మెగావాట్ల ప్రాజెక్టుకు తెలంగాణ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ చేసుకుంది.
దీంతో పాటు కొడంగల్‌లో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మెదక్ జిల్లా కంగ్టిలో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్‌కో కంపెనీ గతంలోనే ప్రతిపాదనలు సమర్పించింది. వీటితో పాటు మైత్రి సంస్థ రంగారెడ్డి జిల్లా పరిగిలో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఎంవోయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన ప్లాంటులోని ఒక్క యూనిట్‌తో (ఒక గాలి మర) గరిష్ఠంగా 2.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే లక్ష్య సాధనతో పాటు.. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇది మార్గంగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.