wind power project
-
ఎస్‌జేవీఎన్ భారీ పవన విద్యుత్ ప్రాజెక్టు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని ఎస్‌జేవీఎన్ (గతంలో సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్) రూ. 700 కోట్ల భారీ పెట్టుబడితో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ–రివర్స్ వేలం ప్రక్రియ ద్వారా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుండి ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నట్లు ఎస్‌జేవీఎన్ ఒక ప్రకటనలో తెలిపింది. నిర్మాణానికి సంబంధించి యూనిట్‌కు రూ.2.90 (టారిఫ్), అలాగే స్వయం నిర్వహణ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పొందినట్లు పేర్కొంది. తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ఎస్జీఈఎల్ ద్వారా భారతదేశంలో ఎక్కడైనా ప్రాజెక్ట్‌ను చేపట్టి, అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటనలో తెలిపింది. -
రామ్‌కో సిమెంట్స్ విండ్ఫార్మ్కు అవార్డ్
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్ ఫార్మ్ (పవన విద్యుత్ పార్క్)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్’గా విండ్ పవర్ అసోసియేషన్ అవార్డ్ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. జోన్ 1, జోన్ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది. పవన విద్యుత్ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్ పవర్లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది. -
కరెంటు కొనుగోళ్లపై నేడు ప్రత్యేక కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల విద్యుత్ సంస్థలపై(డిస్కంలు) పడే ఆర్థిక భారంపై సంప్రదింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 12న రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లు, డిస్కంల సమస్యలపై సంప్రదింపుల కోసం నవంబర్ 4న ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర సంప్రదాయేతర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి శాఖ (ఎంఎన్ఆర్ఈ) కార్యదర్శి, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్నారు. కమిటీ తొలి సమావేశం గురువారం ఢిల్లీలో జరగనుంది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు వల్ల డిస్కంలకు ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలును కేంద్రం తప్పనిసరి చేయడం వల్ల డిస్కమ్‌లు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. ఇలాంటి కరెంటు కొనాలంటే యూనిట్‌కు రూ.3.50 చొప్పున పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష
సాక్షి, చెన్నై: సినీనటి సరితా నాయర్‌కు తమిళనాట పవన విద్యుత్ ప్రాజెక్టు మోసం కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోలార్ ప్యానెల్ స్కాం ఆ రాష్ట్రాన్ని వణికించింది. ఈ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమన్‌చాందీ మీద సైతం ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి సరితా నాయర్ పలువురిపై తీవ్ర ఆరోపణలు సైతం గుప్పించారు. అదే సమయంలో తమిళనాట కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వ్యవహారంలో సరితానాయర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు తగ్గ ఫిర్యాదులతో కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సరితానాయర్, ఆమె భర్త బిజూ రాధాకృష్ణన్, మేనేజర్ రవిలపై కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు కోర్టులో సాగుతూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో గురువారం సాయంత్రం తీర్పు వెలువడింది. నేరం నిరూపితం కావడంతో సరితా నాయర్, బిజూ రాధాకృష్ణన్, రవిలకు తలా 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రూ.10వేలు చెల్లించని పక్షంలో మరో 9 నెలలు జైలు శిక్షను అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. -
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
-
విద్యుత్ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం
సాక్షి, అమరావతి: సోలార్, విండ్ పవర్ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సోలార్,విండ్ పవర్ల కోసం యూనిట్‌కు రూ.3.55 భారం పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సోలార్, విద్యుత్ పవర్ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీలో మరింత సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నా, పై కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు. భారం రూ.5,300 కోట్లు.. విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్, విండ్ పవర్ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని..తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్‌లదేనని..దీనివల్ల పడే భారం రూ.3.55పైసలు చొప్పున ఏడాదికి రూ.5300 కోట్లు అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్‌కు రూ.4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోందన్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం.. గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల జెన్కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్, విండ్ పవర్ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నామన్నారు. చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టంగా ఉందన్నారు. ఇన్ని సమస్యలున్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 జిగా వాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సోలార్, విండ్ పవర్ ప్రమోషన్లో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు. భారాన్ని మోపడం సమంజసం కాదు.. మరోవైపు విభజన నాటికి ఆస్తులు పంపిణీ చేయకుండా కేవలం అప్పులు మాత్రమే పంపిణీ జరగడం రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు. అధిక విద్యుత్ ధరల మీద ఏపీ డిస్కంలు ఎన్‌సిఎల్‌టి ను ఆశ్రయించడమో, ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను ఇంకా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపడం కూడా సమంజసం కాదని సూచిస్తూ..ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు. -
యూనిట్ కు రూ.6 చెల్లిస్తే ఓకే..
♦ తెలంగాణలో పవన విద్యుత్ ప్రాజెక్టులు పెట్టిస్తాం ♦ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘తెలంగాణలో పవన విద్యుత్ ప్రాజెక్టులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగానే ఉన్నాయి. అయితే కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యుహెచ్) ధర కనీసం రూ.5.50 నుంచి రూ.6 ఉండాలి’’ అని ఇండియన్ విండ్ టర్బైన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడబ్ల్యుటీఎంఏ) స్పష్టం చేసింది. ప్రభుత్వం గనక ఈ ధర ప్రకటిస్తే కంపెనీలను తీసుకొస్తామని అసోసియేషన్ చైర్మన్, ఆర్ఆర్బీ ఎనర్జీ డిప్యూటీ ఎండీ సర్వేష్ కుమార్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘తెలంగాణలో పవన విద్యుత్ రంగంలో ఇప్పుడైతే ఎలాంటి ఉత్పత్తీ జరగటం లేదు. కొన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి కానీ... దీనికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహక ధర ప్రకటించాల్సి ఉంది. ప్రాజెక్టుల ఏర్పాటులో విధానపర అడ్డంకులను తొలగించాలి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా, ఆకట్టుకునే రీతిలో పవన విద్యుత్ పాలసీని ప్రకటించాలి’’ అని చెప్పారాయన. అయిదేళ్లలో 10,000 మెగావాట్లు... తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో 8-10 వేల మెగావాట్ల మేర పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయని అసోసియేషన్ వైస్ చైర్మన్, సుజ్లాన్ ఎనర్జీ స్ట్రాటజిక్ బిజినెస్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ చింతన్ షా తెలిపారు.ఒక్కో మెగావాట్‌కు ప్రత్యక్షంగా 30, పరోక్షంగా 60 మందికి ఉపాధి లభిస్తుందని సీఐఐ రెన్యువబుల్ ఎనర్జీ కౌన్సిల్ చైర్మన్, గమేసా విండ్ టర్బైన్స్ సీఎండీ రమేష్ కైమల్ వెల్లడించారు. ఒక్కో మెగావాట్‌కు రూ.6-6.5 కోట్లు ఖర్చవుతుందని ఐడబ్ల్యుటీఎంఏ సెక్రటరీ జనరల్ డి.వి.గిరి పేర్కొన్నారు. ప్రాజెక్టుల ఏర్పాటుకు సిద్ధం: గమేసా విండ్ టర్బైన్ పవన విద్యుత్ రంగంలో ఉన్న గమేసా విండ్ టర్బైన్స్ తెలంగాణలో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రెడీగా ఉంది. ప్రభుత్వం ప్రకటించబోయే టారిఫ్‌పై నిర్ణయం ఆధారపడి ఉందని కంపెనీ వెల్లడించింది. కిలోవాట్ అవర్‌కు (కేడబ్ల్యుహెచ్) ధర రూ.5.50 నుంచి రూ.6 ఉంటే ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సిద్ధమని గమేసా సీఎండీ రమేష్ కైమల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కంపెనీ చేతిలో ప్రస్తుతం 1,300 మెగావాట్ల మేర ఆర్డర్లున్నాయని వెల్లడించారు. తెలంగాణలో 1,400 మెగావాట్ల మేర ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు రెడీ అని వెల్లడించారు. ఒక్కో మెగావాట్‌కు సుమారు రూ.6.5 కోట్లు ఖర్చు అవుతుంది. -
పంచాయతీల్లో పవన విద్యుత్!
సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ఎత్తై ప్రాంతాల్లోని గ్రామాలు, తండాల్లో ఏర్పాటు మెదక్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టు అవసరమైతే పంచాయతీల ద్వారా నిధులిస్తామని సూచన కసరత్తు ప్రారంభించిన జెన్కో సాక్షి, హైదరాబాద్: తక్కువ విద్యుత్ విని యో గం ఉండే చిన్న పల్లెలు, ఆవాస ప్రాంతాలు, తండాల్లో పవన విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం గుట్టలు, కొండలతో కూడిన ఎత్తై ప్రాం తాలను గుర్తించాలని.. సాధ్యాసాధ్యాలను, ప్రయోజనమెంత అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తొలుత తన నియోజకవర్గం గజ్వేల్‌లో పైలట్ ప్రాజెక్టుగా దీనిని ఏర్పాటు చేసి పరిశీలించాలని సూచించారు. తెలంగాణ లో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన గ్రీన్కో కంపెనీ ప్రతినిధులతో జరిపిన సంప్రదింపుల్లో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. భౌగోళికంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో గుట్టలు, కొండలు విస్తరించి ఉన్నాయని... ఎత్తై ఈ ప్రాంతాల్లో గాలి వేగం కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. జిల్లాల వారీగా పవన విద్యుదుత్పత్తికి సాధ్యమయ్యే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇందుకోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని.. కేవలం వీధి దీపాలు, రాత్రి పూట బల్బులు తప్ప విద్యుత్ గృహోపకరణాలు లేనటువంటి చిన్న పంచాయతీలను ఎంచుకోవాలని చెప్పారు. కొండలు, గుట్టల పరి సరాల్లోని తండాలు, చిన్న పంచాయతీల పరిధిలో ఈ ప్లాంట్లు నెలకొల్పితే ఎంత విద్యుత్ సరఫరా చేసే వీలుంది, ఎంత ప్రయోజనం ఉం టుందనే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు. అవసరమైతే పంచాయతీల ద్వారా ఈ యూనిట్లు నెలకొల్పేందుకు ఆర్థిక వనరులు సమకూరుస్తామని అధికారులకు సీఎం చెప్పారు. ఒక పల్లెలో ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుంది, ఎన్ని పల్లెల్లో పవన విద్యు త్ ఉత్పత్తికి అనువైన అవకాశాలున్నాయనే అంశాలను అధ్యయనం చేయాలని సూచించా రు. సీఎం ఆదేశం మేరకు అవసరమైన సమాచా రం సేకరణకు జెన్కో కసరత్తు ప్రారంభించింది. రెండు జిల్లాల్లో ఎక్కువ.. రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రైవేటు కంపెనీలు మాత్రం మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే గ్రీన్కో కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలంలో 750 ఎకరాల విస్తీర్ణంలో 200 మెగావాట్ల సౌర విద్యుత్‌తో పాటు విండ్ పవర్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అదే జిల్లాలోని ఆమనగల్లులో 150 మెగావాట్ల ప్రాజెక్టుకు తెలంగాణ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌తో ఎంవోయూ చేసుకుంది. దీంతో పాటు కొడంగల్‌లో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు, మెదక్ జిల్లా కంగ్టిలో 200 మెగావాట్ల పవన, 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు గ్రీన్కో కంపెనీ గతంలోనే ప్రతిపాదనలు సమర్పించింది. వీటితో పాటు మైత్రి సంస్థ రంగారెడ్డి జిల్లా పరిగిలో 100 మెగావాట్ల పవన విద్యుత్ ప్లాంట్‌కు ఎంవోయూ చేసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పవన ప్లాంటులోని ఒక్క యూనిట్‌తో (ఒక గాలి మర) గరిష్ఠంగా 2.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీంతో ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకునే లక్ష్య సాధనతో పాటు.. విద్యుత్ సమస్యను అధిగమించేందుకు ఇది మార్గంగా ఉపకరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.