సరితానాయర్
సాక్షి, చెన్నై: సినీనటి సరితా నాయర్‌కు తమిళనాట పవన విద్యుత్ ప్రాజెక్టు మోసం కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోలార్ ప్యానెల్ స్కాం ఆ రాష్ట్రాన్ని వణికించింది. ఈ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమన్‌చాందీ మీద సైతం ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి సరితా నాయర్ పలువురిపై తీవ్ర ఆరోపణలు సైతం గుప్పించారు.
అదే సమయంలో తమిళనాట కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వ్యవహారంలో సరితానాయర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు తగ్గ ఫిర్యాదులతో కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సరితానాయర్, ఆమె భర్త బిజూ రాధాకృష్ణన్, మేనేజర్ రవిలపై కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు కోర్టులో సాగుతూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో గురువారం సాయంత్రం తీర్పు వెలువడింది. నేరం నిరూపితం కావడంతో సరితా నాయర్, బిజూ రాధాకృష్ణన్, రవిలకు తలా 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రూ.10వేలు చెల్లించని పక్షంలో మరో 9 నెలలు జైలు శిక్షను అదనంగా అనుభవించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment