saritha nair
-
సోలార్ స్కాం: సరితా నాయర్‌కు 6 ఏళ్ల జైలు
కోజికోడ్: సోలార్ ప్యానెల్ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్‌కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్ ప్రస్తుతం కోవిడ్‌తో క్వారంటైన్లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు. ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు గాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించా రు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్ మజీద్ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. -
సినీ నటికి మూడేళ్లు జైలుశిక్ష
సాక్షి, చెన్నై: సినీనటి సరితా నాయర్‌కు తమిళనాట పవన విద్యుత్ ప్రాజెక్టు మోసం కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ కోయంబత్తూరు కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సోలార్ ప్యానెల్ స్కాం ఆ రాష్ట్రాన్ని వణికించింది. ఈ స్కాంలో అప్పటి ముఖ్యమంత్రి ఉమన్‌చాందీ మీద సైతం ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న నటి సరితా నాయర్ పలువురిపై తీవ్ర ఆరోపణలు సైతం గుప్పించారు. అదే సమయంలో తమిళనాట కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలలో పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు వ్యవహారంలో సరితానాయర్ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు తగ్గ ఫిర్యాదులతో కోయంబత్తూరు జిల్లా తొండాముత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సరితానాయర్, ఆమె భర్త బిజూ రాధాకృష్ణన్, మేనేజర్ రవిలపై కేసులు నమోదయ్యాయి. 2016 నుంచి ఈ కేసు విచారణ కోయంబత్తూరు కోర్టులో సాగుతూ వచ్చింది. వాదనలు, విచారణలు ముగియడంతో గురువారం సాయంత్రం తీర్పు వెలువడింది. నేరం నిరూపితం కావడంతో సరితా నాయర్, బిజూ రాధాకృష్ణన్, రవిలకు తలా 3 ఏళ్లు జైలు శిక్ష, రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. రూ.10వేలు చెల్లించని పక్షంలో మరో 9 నెలలు జైలు శిక్షను అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. -
27లోపు హాజరుకాకుంటే అరెస్టు చేస్తాం!
- సరితా నాయర్ కు విచారణ కమిషన్ హెచ్చరిక కొచ్చి: కేరళను రాజకీయంగా కుదిపేసిన సోలార్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరితా నాయర్ కు వ్యతిరేకంగా దర్యాప్తు కమిషన్ గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఎన్నిసార్లు పిలిచినా తమ ముందు విచారణకు హాజరుకాకపోవడంతో కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27న ఆమె కమిషన్ ముందు హాజరుకావాలని, లేకపోతే ఆమెను అరెస్టు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమిషన్ తేల్చిచెప్పింది. సరితా నాయర్ గతంలో నాలుగుసార్లు కమిషన్ ముందు విచారణకు హాజరుకాలేదు. కమిషన్ ముందుకు రాకపోవడానికి ఆమె గుర్తుతెలియని కారణాలను చెప్తున్నారు. సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేస్తామని అనేకమంది నుంచి డబ్బులు వసూలుచేసి.. ఆ తర్వాత మోసం చేసిన కేసులో 2013లో సరితా నాయర్‌ను, ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. సోలార్ కుంభకోణంలో భాగంగా తాను అప్పటి కేరళ సీఎం ఊమెన్ చాందీ, ఆయన కేబినెట్ మంత్రి అరయాదన్ మహమ్మద్ కు రూ. 1.9 కోట్లు లంచం ఇచ్చినట్టు సరితా నాయర్ ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ శివరాజన్ కమిషన్ ఏర్పాటైంది. కాగా, తనపై ఆరోపణలు చేసినందుకుగాను సరితా నాయర్ పై మాజీ సీఎం చాందీ పరువు నష్టం దావా వేశారు. -
కాంగ్రెస్ పెద్దలు నన్ను వాడుకున్నారు: సరిత
కాంగ్రెస్ పెద్దలు తనను ఒక పావులా వాడుకున్నారని, కొచ్చిన్ పోర్టు ట్రస్టుకు చెందిన ఒక భూమి డీల్‌లో తాను మధ్యవర్తిగా కూడా వ్యవహరించానని కేరళ సోలార్ స్కాంలో కీలక నిందితురాలు సరితా నాయర్ చెప్పింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆయన కొడుకు, కొందరు కేబినెట్ మంత్రులపై తన ఆరోపణలకు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఆమె బుధవారం నాడు విచారణ కమిషన్‌కు సమర్పించింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 5 రోజుల సమయం ఉందనగా సరితా నాయర్ తన తాజా అస్త్రాన్ని బయటకు తీయడం గమనార్హం. తాను రెండు పెన్ డ్రైవ్‌లు, కొన్ని పత్రాలను కమిషన్‌కు ఇచ్చానని, తాను రాసిన లేఖలోని అంశాలకు, కొందరు కాంగ్రెస్ పెద్దల పేర్లు బయటపెడుతూ ఏషియా నెట్ చానల్ ప్రసారం చేసిన కథనానికి అవి ఆధారాలని సరితా నాయర్ చెప్పింది. శుక్రవారం మరికొన్ని ఆధారాలు సమర్పిస్తానని ఇంకో బాంబు పేల్చింది. కాగా, సరితా నాయర్‌పైన, ఏషియానెట్ చానల్‌పైన సీఎం ఊమెన్ చాందీతో పాటు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా పరువునష్టం దావా వేశారు. సరితా నాయర్ మీద, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ మీద సోలార్ స్కాంలో దాదాపు 30 వరకు కేసులు ఉన్నాయి. వాళ్లు పలువురు పెట్టుబడిదారులను దాదాపు రూ. 6 కోట్ల మేర ముంచేశారని పోలీసులు అంచనా వేస్తున్నారు. సరిత బెయిల్ పొంది బయటకు రాగా, రాధాకృష్ణన్ మాత్రం తన మొదటి భార్య హత్య కేసులో ఇంకా జైల్లోనే ఉన్నారు. -
సరితకు సీఎం లీగల్ నోటీసులు
తిరువనంతపురం: తనపై ఆరోపణలు చేసిన సరితా నాయర్ కు లీగల్ నోటీసులు పంపినట్టు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. సరిత మూడేళ్ల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటకు రావడం పట్ల కుట్ర దాగుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆమెపై చట్టపరంగా చర్య తీసుకుంటామన్నారు. దీని వెనుక బలమైన లాబీ ఉందని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సోలార్ స్కామ్ వెలుగుచూసి మూడేళ్లు గడిచినా ఇప్పుడే కొత్తగా వెల్లడైనట్టు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్యనిషేధం అమలుతో అవస్థలు పడుతున్నవారే తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, సీఎం చాందీ తనను లైంగికంగా వేధించారని సరితా నాయర్ 2013లో రాసిన లేఖను ఓ టీవీ చానల్ ఆదివారం బయటపెట్టడంతో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాశానని సరిత అంగీకరించారు. దీనిపై విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు. -
'సీఎం నన్ను లైంగికంగా వేధించారు'
తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సరితా నాయర్ కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై తీవ్రమైన ఆరోపణలతో ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. తనను ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ ప్రతిని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి. ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు. ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు. 'ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసివన్నీ వాస్తవాలే' అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని చాందీ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని దించడానికి చివరి ప్రయత్నంగా దీన్ని వర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. సోలార్ కుంభకోణంలో సహ నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలోనూ చాందీపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. -
ఆ హీరోయిన్ నేను కాదు.. మరొకామె!
కేరళ సోలార్ స్కాం మరో కొత్త మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి కుమారుడు చాందీ ఊమెన్‌తో తనకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలను కేసులో నిందితురాలు సరితా నాయర్ ఖండించింది. ఆయనతో తనకున్నవి కేవలం వ్యాపార సంబంధాలు మాత్రమేనని తెలిపింది. ''చాందీ ఊమెన్‌తో నాకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఆ స్టోరీల్లో హీరోయిన్ను నేను కాను.. సోలార్ కేసులో ఉన్న మరో నిందితురాలు. కానీ ఆ విషయాన్ని నిరూపించేందుకు నా దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఆమె పేరు బయట పెట్టడం లేదు. పైగా అలా బయటపెడితే వాళ్ల ప్రైవసీకి భంగం వాటిల్లుతుంది'' అని సరితా నాయర్ మీడియాతో వ్యాఖ్యానించింది. హోం మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్ వద్ద చాందీ ఊమెన్, మరో మహిళ కలిసి దుబాయ్ వెళ్లినప్పటి వీడియో క్లిప్పింగులు ఉన్నట్లు విన్నానని, అయితే మంత్రివర్గంలో మార్పులు ఉంటాయన్న భయంతోనే రాధాకృష్ణన్ ఈ వీడియో క్లిప్పింగుల విషయాన్ని లీక్ చేసి ఉంటారని కామెంట్ చేసింది. కంపెనీ పెట్టాలని సీఎం కోరారు ఇక.. తన కొడుకుతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక సోలార్ కంపెనీ స్థాపించాల్సిందిగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనను కోరారని సరితా నాయర్ మరో బాంబు పేల్చింది. పునరుత్పాదక ఇంధన వ్యాపారం చేసేందుకు కంపెనీ ఏర్పాటు గురించి ముఖ్యమంత్రితో తాను చర్చించినట్లు ఈ స్కాంపై విచారణ చేస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ ఎదుట ఆమె చెప్పింది. కేరళ రెన్యువబుల్ ఎనర్జీ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ పేరుతో ఒక సహకార సంస్థను ఏర్పాటుచేయాల్సిందిగా సీఎం కోరారని, అందులో ఆయన కొడుకు చాందీ ఊమెన్, ఇతర కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉండాలన్నారని ఆమె తెలిపింది. ఈ కంపెనీకి కావల్సిన సోలార్ ప్యానళ్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని కూడా ఆయన అన్నారని చెప్పింది. 'స్టార్ఫ్లేమ్స్' అనే అమెరికన్ సంస్థలో చాందీ ఊమెన్ భాగస్వామి అని, కావాలంటే ఆ కంపెనీ నుంచి ప్యానళ్లు దిగుమతి చేసుకోవచ్చని తెలిపారని సరితా నాయర్ తెలిపింది. -
ఓ మహిళతో సీఎం.. ఆ వీడియో ఉంది!
► కేరళ సోలార్ స్కాం ప్రధాన నిందితుడి ఆరోపణ ► విచారణ కమిషన్ ముందు రాధాకృష్ణన్ వెల్లడి ► సీఎం ఊమెన్ చాందీ సహా ఆరుగురు నేతలపై ఆరోపణలు కొచ్చి కేరళ సోలార్ ప్యానల్ స్కాం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు. సరితా నాయర్ ఆ నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు. అయితే సీఎం, ఇతర నాయకులెవ్వరూ ఇంతవరకు దీన్ని ఖండించలేదు కూడా. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరపించారు. తాను స్వయంగా రూ. 5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఈ మొత్తం ఇచ్చానని అన్నారు. నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో చాందీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకులను అరెస్టు చేయడంతో సోలార్ స్కాం కాస్తా బాగా పెద్దదైంది. రాధాకృష్ణన్ తాజా ఆరోపణల నేపథ్యంలో సీఎం చాందీ రాజీనామా చేయాలని విపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు.