సరితకు సీఎం లీగల్ నోటీసులు
తిరువనంతపురం: తనపై ఆరోపణలు చేసిన సరితా నాయర్ కు లీగల్ నోటీసులు పంపినట్టు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తెలిపారు. సరిత మూడేళ్ల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటకు రావడం పట్ల కుట్ర దాగుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆమెపై చట్టపరంగా చర్య తీసుకుంటామన్నారు. దీని వెనుక బలమైన లాబీ ఉందని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు.
సోలార్ స్కామ్ వెలుగుచూసి మూడేళ్లు గడిచినా ఇప్పుడే కొత్తగా వెల్లడైనట్టు ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మద్యనిషేధం అమలుతో అవస్థలు పడుతున్నవారే తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కాగా, సీఎం చాందీ తనను లైంగికంగా వేధించారని సరితా నాయర్ 2013లో రాసిన లేఖను ఓ టీవీ చానల్ ఆదివారం బయటపెట్టడంతో కలకలం రేగింది. ఆ లేఖ తానే రాశానని సరిత అంగీకరించారు. దీనిపై విచారణ జరపాలని మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు.