ఓ మాజీ సీఎం.. అనూహ్య రైలు ప్రయాణం!
ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్ క్లాస్ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించనిరీతిలో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి.. తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. డాబూ, దర్పాలకు పోకుండా సామాన్యులతో మమేకమై.. సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయణంపై ఇప్పుడు సోషల్‌మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ. మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకుడు గత సోమవారం స్లీపర్ క్లాస్ కపార్ట్‌మెంట్‌లో 160 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.
సోషల్ మీడియాలో ఆయన నిరాడంబర ప్రయాణం ఫొటోలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని, వీఐపీ లాంజ్‌లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కొందరు ఎంపీలు కొన్ని వారాల కిందట కోరిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు.
తన ప్రయాణంపై మాజీ సీఎం ఊమెన్ చాందీ స్పందిస్తూ ‘పెద్దగా రద్దీ లేని స్లీపర్ క్లాస్ రైళ్లలో ప్రయాణించడానికి నేను ఇష్టపడతాను. ముఖ్యంగా దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు రైల్లోనే వెళుతాను. దీనివల్ల ప్రజలతో మమేకమవ్వొచ్చు. లేకపోతే ఒంటరితనంగా తోస్తుంది. వీఐపీ అన్న భావనపై నాకు నమ్మకం లేదు’ అని పేర్కొన్నారు. గత మే నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఊమెన్ చాందీ సీఎం పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో సాధారణ ప్రయాణికుడిలా బస్సు ప్రయాణం చేశారు.