కేరళ పీఠం ఎవరిదంటే..??
సోమవారం జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పాత చరిత్రే పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశలు కానీ, కేరళ సీఎం ఊమెన్ చాందీ ఆకాంక్షలు కానీ ఫలించే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చాటుతున్నాయి. మోదీ అభివృద్ధి అజెండాను, చాందీ ప్రగతి నినాదాన్ని తోసేసి కేరళ వాసులు సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌కు పట్టం కట్టే అవకాశముందని తాజాగా ఇండియా టుడే సర్వే స్పష్టం చేసింది.
సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి (ఎల్డీఎఫ్)కు 88 నుంచి 101 సీట్లు వచ్చే అవకాశముందని, ఆ పార్టీ క్లియర్ మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు 38 నుంచి 48 సీట్లు రావొచ్చునని పేర్కొంది. బీజేపీతోపాటు ఇతరులకు కలిపి సున్నా నుంచి మూడు సీట్ల వరకు వచ్చే అవకాశమున్నట్టు తెలిపింది. కేరళలో మొత్తం 140 స్థానాలు ఉండగా.. మొత్తం అన్ని స్థానాల్లోనూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తన అభ్యర్థులను నిలిపిన సంగతి తెలిసిందే.