సాక్షి, అమరావతి: సోలార్, విండ్ పవర్‌ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశారు. సోలార్,విండ్ పవర్‌ల కోసం యూనిట్‌కు రూ.3.55 భారం పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సోలార్, విద్యుత్ పవర్‌ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీలో మరింత సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యుత్ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నా, పై కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు.
భారం రూ.5,300 కోట్లు..
విద్యుత్ రంగంలో ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని అధిగమించడానికి విద్యుత్ సరఫరా కంపెనీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి సోలార్, విండ్ పవర్‌ల కంపెనీలతో నిరంతరాయంగా చర్చలు జరుపుతోందని..తగిన పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.రాష్ట్రంలో ఏడాదికి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంటే.. అందులో 15వేల మిలియన్ యూనిట్లు సోలార్, విండ్ పవర్‌లదేనని..దీనివల్ల పడే భారం రూ.3.55పైసలు చొప్పున ఏడాదికి రూ.5300 కోట్లు అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు కొనుగోలు రూపంలో ప్రతి సోలార్, విండ్ పవర్ యూనిట్‌కు రూ.4.84 కన్నా ఎక్కువ చెల్లిస్తోందన్నారు.
రాష్ట్రానికి తీవ్ర నష్టం..
గడిచిన నాలుగేళ్లుగా నిర్ణయించిన పరిమితికి మించి సోలార్, విండ్ పవర్‌ను కొనుగోలు చేస్తున్నామని, దీనివల్ల జెన్‌కో విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని తగ్గించి, సోలార్, విండ్ పవర్ ల కోసం అధిక భారాన్ని మోస్తున్నామన్నారు. చిన్న ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రానికి ఇది తీవ్ర నష్టంగా ఉందన్నారు. ఇన్ని సమస్యలున్నా ప్రత్యామ్నాయ, సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన 175 జిగా వాట్స్ లక్ష్యాన్ని తనకు కష్టం ఉన్నా సరే భుజానకెత్తుకోవాల్సి వచ్చిందని మంత్రి బాలినేని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల కోసం సంక్షేమ పథకాలు ప్రకటించిన విధంగానే కేంద్రం కూడా సోలార్, విండ్ పవర్ ప్రమోషన్‌లో భాగంగా సబ్సిడీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు.
భారాన్ని మోపడం సమంజసం కాదు..
మరోవైపు విభజన నాటికి ఆస్తులు పంపిణీ చేయకుండా కేవలం అప్పులు మాత్రమే పంపిణీ జరగడం రాష్ట్ర ప్రజలకు భారంగా మారిందని పేర్కొన్నారు. అధిక విద్యుత్ ధరల మీద ఏపీ డిస్కంలు ఎన్‌సిఎల్‌టి ను ఆశ్రయించడమో, ఇప్పటికే అధికంగా ఉన్న ధరలను ఇంకా పెంచి వినియోగదారులపై భారాన్ని మోపడం కూడా సమంజసం కాదని సూచిస్తూ..ఈ నేపథ్యంలో ఈ సంక్షోభానికి సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారం చూపేందుకు కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నేతృత్వంలో కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరులు శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి, ఏపి ఇంధన శాఖ కార్యదర్శిలతో కూడిన కమిటీ వేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment