సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు.
ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది.
థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి.
2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..?
దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..?
దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి.
సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది.
2030 నాటికి...
దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది.
వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment