ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్రం పట్టించుకోవడంలేదు
రామగుండంలో ఎస్‌టీపీపీ–2 ప్రాజెక్టు పీపీఏపై అలసత్వం
రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ కరెంట్‌ను అందుబాటులో ఉంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట్ర సర్కారు సహకరించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నిసార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆయన పలు దఫాలుగా కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖల వివరాలను ఒక ప్రకటనలో వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని చేపట్టే ప్రాజెక్టుకు ప్రధాని మోదీ ఆమోదముద్ర వేశారని గుర్తుచేశారు. ‘దేశవ్యాప్తంగా విద్యుత్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎస్‌టీపీపీ–2 ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తిచేసి విద్యుదుత్పత్తిని పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దీనికి అనుగుణంగా పీపీఏ విషయంలో త్వరగా స్పందించి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి 4 సార్లు లేఖలు రాసినా జవాబు రాలేదు’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం స్పందించని పక్షంలో ఈ ప్రాజెక్టు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. ‘గత మేనెల 30న దేశవ్యాప్తంగా 250 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. అలాగే మార్చి 2024లో తెలంగాణలో గరిష్టంగా (పీక్ పవర్ డిమాండ్) 15.6 గిగావాట్ల డిమాండ్ ఎదురైంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) అంచనాల ప్రకారం.. 2030 నాటికి తెలంగాణలో పీక్ పవర్ డిమాండ్ ఇప్పుడున్న దానికి రెట్టింపు కానుంది.
దీనిని దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న పరిశ్రమలు, గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు.. రెండోదశ ఎన్టీపీసీ పవర్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరముంది. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌పై తొలి హక్కు రాష్ట్ర ప్రజలదే. కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తున్నా, దానిని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని మరోసారి నిరూపితమైంది’అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment