Wind power
-
అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు
పునరుత్పాదక ఇంధన వనరులపై అదానీ గ్రూప్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీ సామర్థ్యంతో సోలార్, పవన, హైబ్రిడ్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై వచ్చే ఐదేళ్లలో 35 బిలియన్ డాలర్లు (రూ.2.94 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాగర్ అదానీ ప్రకటించారు. ‘2047 నాటికి వికసిత భారత్ లక్ష్య సాధనలో యువ నాయకుల పాత్ర’ అనే అంశంపై జరిగిన సీఈవో ప్యానెల్ చర్చలో భాగంగా సాగర్ అదానీ ఈ వివరాలు వెల్లడించారు.ఇదీ చదవండి: ఒకటో తరగతి ఫీజు.. రూ.4.27 లక్షలు!గుజరాత్‌లోని ఖావ్డాలో 30,000 మెగావాట్ సామర్థ్యంతో పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాలను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఇంధన స్థిరత్వం, ఇంధన పరివర్తనం విషయంలో అదిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ పెట్టుబడుల్లో ఇది ఒకటి అవుతుందని సాగర్ అదానీ పేర్కొన్నారు. ‘‘మన దగ్గర 500 గిగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. తలసరి వినియోగంలో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం మూడింత ఒక వంతు పరిమాణంలోనే ఉన్నాం. వచ్చే 7–8 ఏళ్లలో ప్రపంచ సగటు తలసరి విద్యుత్ వినియోగానికి చేరుకోవాలంటే మరో 1,000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అవసరం. చైనా స్థాయికి చేరుకోవాలంటే మరో 1,500 మెగావాట్ల సామర్థ్యం అవసరం. అభివృద్ధి చెందిన దేశాలకు సమాన స్థాయికి చేరుకోవాలంటే మరో 2,500–3,000 మెగావాట్ల సామర్థ్యం అవసరం అవుతుంది’’అని వివరించారు. -
2030 నాటికి రూ.32 లక్షల కోట్లు అవసరం
భారత్ తన లక్ష్యాలను చేరుకోవడానికి 2030 నాటికి పునరుత్పాదక ఇంధన రంగంలో దాదాపు రూ.32 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐఆర్ఈడీఏ ఛైర్మన్ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు. 23వ ఇండియా పవర్ ఫోరమ్ 2024లో పాల్గొని ఆయన మాట్లాడారు. రుణదాతలు కస్టమర్ల అవసరాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సకాలంలో ఆర్థిక అవసరాలు తీర్చేలా ప్రణాళికలు ఉండాలని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘పునరుత్పాదక ఇంధన రంగంలో ఎలాంటి హానికర ఉద్గారాలు లేకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం 2030 నాటికి ఈ రంగంలో సుమారు రూ.32 లక్షల కోట్ల పెట్టుబడులు రావాల్సి ఉంది. ఇందుకోసం రుణదాతలు కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టాలి. భవిష్యత్తులో దేశీయ విద్యుత్ అవసరాలు తీర్చే ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరాలంటే ఈ విభాగం కీలకంగా మారనుంది. ఈ రంగంలో మరిన్ని మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, ఆఫ్‌షోర్ విండ్(సముద్ర అలల సాయంతో విద్యుత్ ఉత్పత్తి), ఇ-మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక సాంకేతికతలకు రానున్న రోజుల్లో ప్రాముఖ్యత పెరుగుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: 99.1 శాతం ఫిర్యాదుల పరిష్కారం -
Global Wind Day 2024: గాలి ‘పవర్’ అప్పుడే తెలిసింది!
ప్రతి సంవత్సరం జూన్ 15న జరుపుకునే గ్లోబల్ విండ్ డే, పవన శక్తి ప్రాముఖ్యత, భూగోళాన్ని మార్చే దాని శక్తి గురించి అవగాహన పెంచుతుంది. ఇది పవన శక్తిని స్థిరమైన, పునరుత్పాదక శక్తి వనరుగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించే ప్రయత్నం.భారత్‌లో ఇంధన పొదుపు శాఖ ఆధ్వర్యంలో ఏటా విభిన్న థీమ్ తో గ్లోబల్ విండ్ డేను నిర్వహిస్తారు. ఈ ఏడాది థీమ్ ఇంకా తెలియరాలేదు. గ్లోబల్ విండ్ ఎనర్జీ డే చరిత్ర, ప్రాముఖ్యత, ఇతర ఆసక్తికర విషయాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.పవన విద్యుత్ చరిత్ర ఇదీ..విండ్ ఎనర్జీ చరిత్ర వేలాది సంవత్సరాల క్రితం నాటిది. ఈజిప్టులోని నైలు నదిపై పడవలను నడపడానికి తొలిసారిగా విండ్ మిల్స్ ఉపయోగించారు. తరువాత చైనాలో పవన శక్తిని అభివృద్ధి చేశారు. ఇక్కడ గాలితో నడిచే నీటి పంపులను క్రీస్తుపూర్వం 200లో కనుగొన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకు చెందిన హెరాన్ విండ్ వీల్ ను సృష్టించాడు.విండ్ మిల్స్ అనతి కాలంలోనే ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రజాదరణ పొందిన పరికరంగా మారింది. వాటి ఉపయోగం చివరికి 1800ల చివరలో, 1900ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ కు వ్యాపించింది. పశ్చిమ అమెరికాలో వేలాది నీటి పంపులు, చిన్న విండ్ టర్బైన్లను ఏర్పాటు చేసిన హోమ్ స్టెడర్లు, వ్యవసాయదారులు దీనిని చేశారు. 1970 లలో చమురు కొరత కారణంగా పవన విద్యుత్ అభివృద్ధికి అత్యంత ఆవశ్యకత ఏర్పడింది. ఇది చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పాదక శక్తి వనరులను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టడానికి దారితీసింది.46,422 మెగావాట్ల సామర్థ్యంభారత పునరుత్పాదక ఇంధన రంగంలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తూ కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) తన తాజా డేటాను ఆవిష్కరించింది. 2024 మే 31 నాటికి సంచిత భౌతిక పురోగతి నివేదిక సౌర, పవన విద్యుత్ వ్యవస్థాపన రంగాలలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేస్తుంది. ఒక్క మే నెలలోనే భారత్ 3,007.28 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జోడించింది. ఈ గణనీయమైన పెరుగుదలకు ప్రధానంగా రెండు ప్రధాన కారణాలు. అవి పవన శక్తి, సౌర శక్తి. పవన విద్యుదుత్పత్తి 535.96 మెగావాట్లు పెరగడంతో మొత్తం సామర్థ్యం 46,422.47 మెగావాట్లకు చేరింది. -
పవన విద్యుత్‌పై సెంబర్‌కార్ప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సింగపూర్‌కు చెందిన సెంబర్‌కార్ప్ ఇండస్ట్రీస్ భారత్‌తోపాటు చైనాలో 428 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది. ఇందుకోసం రూ.1,247 కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. సెంబ్‌కార్ప్ భారత్‌లో 18 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కలిగి ఉంది. తాజా కొనుగోలుతో సంస్థ నిర్వహణలోని పునరుత్పాదక ఇంధన ఆస్తులు 3.7 గిగావాట్ల సామర్థ్యానికి చేరాయి. ఇందులో 2.25 గిగావాట్ల పవనవిద్యుత్, 1.45 గిగావాట్ల సోలార్ ఆస్తులు ఉన్నాయి. లీప్ గ్రీన్ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన 228 మెగావాట్ల పవన విద్యుత్ ఆస్తులను 70 మిలియన్ సింగపూర్ డాలర్లకు, క్వింజు యూనెంగ్‌కు చెందిన 200 మెగావాట్ల ఆస్తులను 130 సింగపూర్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్టు సెంబర్‌కార్ప్ ఇండస్ట్రీస్ తాజాగా ప్రకటించింది. దీంతో లీప్ గ్రీన్ ఎనర్జీకి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఉన్న 228 మెగావాట్ల పవన విద్యుత్ ఆస్తులు సెంబర్ కార్ప్ సొంతం కానున్నా యి. భారత్‌లో వెక్టార్ గ్రీన్‌కు చెందిన 583 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఆస్తులను సైతం గతే డాది ఈ సంస్థ కొనుగోలు చేయడం గమనార్హం. -
పవన విద్యుత్‌లో అడ్డగోలు ఒప్పందాలు
సాక్షి, అమరావతి : పవన విద్యుత్ కొనుగోళ్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలు ఒప్పందాలు చేసుకుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు వద్దని ఆ రంగ నిపుణులు మార్చి 1, 2017న అప్పటి టీడీపీ ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా నివేదించినా పవన విద్యుత్ పీపీఏలకు చంద్రబాబు సర్కారు పచ్చజెండా ఊపేసింది. అది కూడా రెట్టింపు కంటే అధిక ధరకు కొనుగోలు చేసేందుకు. గుజరాత్లో తక్కువకే పవన విద్యుత్ దొరుకుతున్నా ఇలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి పీపీఏలు ఎందుకు కుదుర్చుకున్నారు? పోనీ రాష్ట్రంలో ఏమన్నా విద్యుత్ కొరత ఉందా అంటే అప్పటికి ఆ పరిస్థితి కూడా లేదు. కేవలం ముడుపుల కోసమే పవన విద్యుత్ పీపీఏలు కుదుర్చుకున్నారు. అప్పట్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఏ మాత్రం పెరగలేదు. పైగా కొరతనేదే లేదు. అయినా అధిక ధర చెల్లించి ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకావటవల్ల విద్యుత్ సంస్థలపై పెద్దఎత్తున ఆర్థిక భారం పడింది. ఇలాంటి నష్టదాయకమైన పీపీఏల ఫలితంగా థర్మల్ విద్యుత్ యూనిట్ల ఉత్పత్తి వ్యయంతోపాటు అప్పులు కూడా పెరిగాయి. ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో బలంగా వినిపించాయి. తక్కువకే దొరుకుతున్నా.. టీడీపీ హయాంలో పవన విద్యుత్ ఏడాదికి 6 వేల మిలియన్ యూనిట్లకు పైగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. పోటీ పెరగడంతో అన్ని రాష్ట్రాల్లో ఈ పవన విద్యుత్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రాలు నష్టదాయకమైన పీపీఏలకు దూరంగా ఉంటున్నాయి. చౌకగా లభించే చోటే విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. గుజరాత్లో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఇఫ్ ఇండియా (సెకీ) ఓపెన్ బిడ్డింగ్‌కి పిలవగా పవన విద్యుత్ యూనిట్ రూ.2.48 చొప్పున 500 మెగావాట్లను సరఫరా చేస్తామని ఉత్పత్తిదారులు ముందుకొచ్చారు. స్ప్రింగ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, కేసీ ఎనర్జీ లిమిటెడ్ రూ.1.43కి సరఫరా చేస్తామన్నాయి. అంటే ఆ రేటుకు కొనుగోలు చేసేందుకు మనకూ అవకాశముంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం యూనిట్ రూ.4.84 చొప్పున కొనుగోలు చేసేందుకు పీపీఏలలో సిద్ధపడింది. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.41 చొప్పున అదనంగా ఇచ్చేందుకు చంద్రబాబు సర్కార్ తయారైపోయింది. ప్రైవేటుకు దోచిపెట్టింది రూ.11,375 కోట్లు.. పవన విద్యుత్ పీపీఏలను 25 ఏళ్లకు కుదుర్చుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లను నాటి టీడీపీ ప్రభుత్వం ఆదేశించింది. 11 పీపీఏల ద్వారా మొత్తం 840 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి రంగం సిద్ధమైంది. ఒక్కో మెగావాట్‌కు 2.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తుంది. 810 మెగావాట్లకు 1,232 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు డిస్కంలకు ప్రైవేట్ సంస్థలు అంటగట్టాయి. ఇలా ఒక్కో యూనిట్‌కు అదనంగా రూ.3.41 చెల్లించటం ద్వారా 1,372 మిలియన్ యూనిట్లకు ఏటా రూ.455 కోట్లు అప్పనంగా ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సి వస్తోంది. 25 ఏళ్లకు చెల్లించే అదనపు వ్యయం రూ.11,375 కోట్లు. ఎలాంటి బిడ్డింగు లేకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలకు ఇంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడడానికి కారణం భారీగా ముడుపులు చేతులు మారడమే. పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై తొలుత అభ్యంతరాలు వ్యక్తంచేసిన రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ ఆ తర్వాత ఆమోదం తెలపడం వెనక కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడి ఉంది. విద్యుత్ ఉత్పత్తిదారులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసిన తర్వాత ప్రైవేట్ పవన విద్యుత్ కొనుగోలుకు ఆమోదం లభించిడం ఈ ఆరోపణలకు ఊతమిస్తోంది. అసలు అదనపు విద్యుత్ అవసరమేలేదు.. రాష్ట్రంలో 2017–18లో 57 వేల మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అందనా వేస్తే వాస్తవ వినియోగం 52 వేల మిలియన్ యూనిట్లు దాటలేదు. 2018–19 కూడా డిస్కంలు ఇదే స్థాయిలో 61 వేల మిలియన్ యూనిట్లు అవసరం ఉంటుందని అంచనా చేశాయి. అయినప్పటికీ ఈ డిమాండ్‌ను తట్టుకునేందుకు ఏపీ జెన్కో థర్మల్, హైడల్ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున 156 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంటే థర్మల్ ద్వారా 98 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశం ఉంది. కేంద్రం నుంచి చౌకగా మరో 18 మిలియన్ యూనిట్లు అందుతున్నాయి. జల విద్యుత్ ద్వారా 17 మిలియన్ యూనిట్ల ఉత్పత్తికి అవకాశముంది. వీటి ద్వారా యూనిట్ విద్యుత్ సగటున రూ.3.50లోపే లభిస్తుంది. డిమాండ్ కంటే ఇంకా ఐదు మిలియన్ యూనిట్లు మిగులు ఉండే అవకాశముంది. అలాంటప్పుడు డిమాండ్ లేకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. ఇదీ రాష్ట్రంలో పవన విద్యుత్ పరిస్థితి.. ప్రస్తుతం పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే.. జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పవన విద్యుత్ ఉత్పత్తి పెరుగుదలను నమోదు చేసుకుంది. ప్రభుత్వ చర్యలకు వాతావరణంలో వస్తున్న మార్పులు తోడవ్వడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయెరాలజీ (పూణే)కి చెందిన పరిశోధకులు వెల్లడించారు. అంతేకాదు.. రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్టు (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఇలాంటి అనుకూల పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని, రానున్నాయని ముందే నిపుణులు చెప్పినా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వినకుండా పాతికేళ్లకు పీపీఏలు కుదుర్చుకుంది. -
పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.64
సాక్షి, అమరావతి: పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. 2,100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్సీ ఈ టారిఫ్‌ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్సీ పరిగణించింది. ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్‌కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్ ధరను ఖరారు చేసినట్లు కమిషన్ వెల్లడించింది. మీరు అడిగినంత ఇవ్వలేం మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్‌కు రూ.3.50 టారిఫ్ సెట్ చేయాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. ఏపీఈఆర్సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్‌పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. వృద్ధికి అనుగుణంగా.. పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది. వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. -
పవన విద్యుత్ రంగం వృద్ధికి చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ: దేశంలో పవన విద్యుత్ రంగం పురోగతికి తీసుకోవాల్సిన కీలక సూచనలను పవన విద్యుదుత్పత్తి దారుల సమాఖ్య (డబ్ల్యూఐపీపీఏ) కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. బిడ్డింగ్ ప్రణాళిక, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఓపెన్ యాక్సెస్, ఆఫ్‌షోర్ విండ్‌కు సదుపాయాల కల్పన తదితర కీలక విధానాలను అమలు చేయాలని కోరింది. జూన్ 11న గ్లోబల్ విండ్ డే కావడంతో పవన విద్యుత్‌పై అవగాహన పెంచేందుకు కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆధ్వర్యంలో ఆదివారం (11న) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎంఎన్ఆర్ఈ జాయింట్ సెక్రటరీ దినేష్ దయానంద్ మాట్లాడుతూ.. మహా ఉర్జా, మహా డిస్కమ్, ఎంఎన్ఆర్ఈ, డెవలపర్లు, తయారీదారులు, రుణదాతలు సహకారంతో పవన విద్యు త్ విషయంలో భారత్ మరింత పురోగతి సాధిస్తుందన్న విశ్వాసాన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాపార నిర్వహణ సులభతరం కావడంతో పునరుత్పాదక లక్ష్యాల సాధన విషయంలో మరింత దూకుడుగా పనిచేస్తామన్నారు. మన దేశం 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యా న్ని చేరుకోవాలని నిర్దేశించుకోగా.. 2023 మే నాటి కి 173.61 గిగావాట్లకు చేరుకుంది. ఇందులో పవనవిద్యుత్ సామర్త్యం 43.19 గిగావాట్లుగా ఉంది. -
‘థర్మల్’కు బై.. ‘రెన్యూవబుల్’కు జై!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: నేటి ఆధునిక ప్రపంచంలో విద్యుత్ లేనిదే ఎవరికీ పూట గడిచే పరిస్థితి లేదు. తలసరి విద్యుత్ వినియోగమే రాష్ట్ర, దేశ పురోగతికి సంకేతం. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య తలసరి విద్యుత్ వినియోగం మధ్య వ్యత్యాసం చాలానే ఉంది. పునరుత్పాదక విద్యుత్ (రెన్యూవబుల్ ఎనర్జీ) రావడానికి ముందు థర్మల్, జల, అణు, గ్యాస్ ఇంధనమే ప్రధానమైన విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు. ప్రస్తుతం పవన, సౌర విద్యుత్ కేంద్రాల నిర్మాణం వేగంగా సాగుతోంది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ కోసం రెన్యూవబుల్ ఎనర్జీనే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలకే పరిమితమైన ఎన్టీపీసీ సైతం ప్రస్తుతం పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో వేగం పెంచింది. మరోవైపు ప్రైవేటు రంగం పెద్ద ఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతోంది. థర్మల్ కేంద్రాల నిర్మాణంలో ఐదేళ్లుగా ప్రైవేటు రంగం గణనీయంగా పడిపోతూ వస్తోంది. 2023లో ఇప్పటివరకు ఒక్క యూనిట్ కూడా ప్రైవేటు రంగంలో గ్రిడ్‌కు అనుసంధానం కాకపోవడం గమనార్హం. రానురాను కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలు తలకు మించిన భారమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలోనే కాదు.. దాని ఉత్పత్తి వ్యయం కూడా ఏటేటా పెరుగుతోంది. బొగ్గు ధరలు, బొగ్గు ఉత్పాదన కేంద్రం నుంచి ప్లాంట్ వరకు రవాణా వ్యయం కూడా పెరగడం వల్ల అంతిమంగా విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థలకు వచ్చేసరికి తడిసి మోపెడవుతోంది. అది కాస్తా వినియోగదారులపై భారం మోపక తప్పని పరిస్థితి. 2030 నాటికి కర్బన ఉద్గారాల తగ్గింపే లక్ష్యమా..? దేశంలో ప్రస్తుతం ఉన్న 2,36,680 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలతో దాదాపు 910 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు విడుదల అవుతున్నాయి. వీటిని గణనీయంగా తగ్గించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కేంద్ర ఇంధన శాఖలోని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) 2029–30 నాటికి శిలాజ ఇంధనలతో విద్యుత్ ఉత్పత్తిని తగ్గించడం, సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా పర్యావరణ సమతౌల్యతను కాపాడటానికి సంప్రదాయేతర ఇంధన విద్యుత్ ఉత్పాదనను ప్రోత్సహించనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న మెగావాట్ ధరలూ ఓ కారణమా..? దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వ్యయం ఒక మెగావాట్‌కు గడిచిన ఏడేళ్లుగా పెరిగిన తీరు పరిశీలిస్తే... అవి రాబోయే కాలంలో లాభసాటిగా అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2015లో ఒక మెగావాట్‌కు రూ. 4.88 కోట్లు, 2016లో రూ. 5.33 కోట్లు, 2019లో రూ. 6.79 కోట్లు, 2023లో రూ. 8.34 కోట్లు చేరినట్లు సీఈఏ గణాంకాలు చెబుతున్నాయి. సౌర విద్యుత్ మెగావాట్ వ్యయం దాదాపు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేరకు ఉంటోంది. ఒకప్పుడు సౌర ఫలకాల ధరలు అధికంగా ఉండటంతో యూనిట్ విద్యుత్ రూ.14కు కూడా విద్యుత్ సంస్థలు కొనుగోలు చేశాయి. ఇప్పుడు అదే సౌర విద్యుత్ రూ. 3.50 నుంచి రూ. 4.50 మధ్య అందుబాటులోకి వచ్చింది. 2030 నాటికి... దేశంలో థర్మల్ విద్యుత్ స్థాపిత సామర్థ్యం, సౌర, పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం ప్రకారం 2029–30 నాటికి దేశంలోని అన్ని రకాల విద్యుదుత్పాదన ప్లాంట్ల సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉంటుందని కేంద్రం పేర్కొంది. వాటిలో థర్మల్ విద్యుత్ కేంద్రాల స్థాపిత సామర్థ్యం 2,66,911 మెగావాట్లకు చేరుకుంటే... సౌర, పవన విద్యుత్‌ల స్థాపిత సామర్థ్యం ఏకంగా 2,25,160 మెగావాట్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. వాటితోపాటు జల, బయోమాస్, బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించాలన్న నిర్ణయం కూడా ఇమిడి ఉంది. కానీ తాజాగా విడుదల చేసిన అంచనా ప్రకారం మొత్తం స్థాపిత సామర్థ్యం 5,87,243 మెగావాట్లుగా ఉండనుంది. -
సంప్రదాయం నుంచి.. స్వచ్ఛత వైపు.. 2029–30 నాటికి లక్ష్యం 64 %
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ : రాష్ట్ర, దేశ ప్రగతికి కీలకమైనది విద్యుత్ రంగం. కాగా ఒకప్పుడు బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదనకే ప్రాధాన్యత ఎక్కువగా ఉండేది. దశాబ్దన్నర కిందటి వరకు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా బొగ్గుపైనే ఆధారపడి ఉండేది. కానీ ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి ప్రాధాన్యతలు మారుతున్నాయి. కర్బన ఉద్గారాలు, వాతావరణంలో మార్పులు నేపథ్యంలో విద్యుదుత్పాదన సంప్రదాయ విధానం నుంచి సంప్రదాయేతర విధానం వైపు మారుతోంది. బొగ్గుతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కర్బన ఉద్గారాల విడుదల విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. కర్బన ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉన్నామని చెబుతున్న భారత్ పుష్కరకాలంగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదనకే మొగ్గు చూపుతోంది. సంప్రదాయేతర విద్యుత్‌కే మొగ్గు దేశంలో ప్రస్తుతం ఉన్న ప్లాంట్లకు మొత్తం 3,79,515 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామ ర్థ్యం ఉంది. వీటిలో బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 2,04,435 మెగావాట్లు (49.7%) కాగా, పవన, సౌర విద్యుత్ కేంద్రాల సామర్ధ్యం 1,21,550 మెగావాట్లు (29.5%). అయితే ఈ సౌర, పవన విద్యుత్ కేంద్రాలు గత దశాబ్దన్నర కాలంగా వచ్చినవే కావడం గమనార్హం కాగా.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కూడా తన ప్రధాన ఉత్పాదన అయిన థర్మల్ నుంచి సోలార్ వైపు అడుగులేస్తుండటం కీలక పరిణామం. ప్రస్తుతం సంప్రదాయేతర విద్యుదుత్పాదన మొత్తం 42.5 శాతం కాగా, దీనిని 2029–30 నాటికి ఏకంగా 64 శాతానికి తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి సంప్రదాయ (బొగ్గు, లిగ్నైట్, గ్యాస్, డీజిల్ ఆధారిత) అయితే, మరొకటి సంప్రదాయేతర (జల, పవన, సౌర, బయోమాస్, అణు) విద్యుత్. సంప్రదాయ విద్యుత్‌లో కూడా..దేశంలో బొగ్గు నిల్వలు విస్తారంగా ఉన్న నేపథ్యంలో అత్యధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలే ఉండేవి. గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు అయినా.. వాటికి సరిపడా గ్యాస్ లభ్యత లేని కారణంగా నామమాత్రంగా తయారయ్యాయి. ఇక సంప్రదాయేతర ఇంధనంలో ఒకప్పుడు ప్రధానంగా జల ఆధారిత, స్వల్పంగా బయోమాస్‌తో విద్యుదుత్పాదన జరిగేది. డ్యామ్‌లు, రిజర్వాయర్లు ఉన్నచోట మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి జరిగేది. ఇది కూడా వర్షాలపై ఆధార పడి ఉండడంతో.. రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువైన సమయంలో విద్యుత్ ఉత్పాదన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పవన, సౌర విద్యుత్ తెరపైకి వచ్చాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదన స్థాపిత సామర్థ్యం గణనీయంగా పెరుగుతోంది. సంప్రదాయ ఇంధనాల కంటే సుస్థిర, పర్యావరణ హితమైన సంప్రదాయేతర ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేయడమే సరైనదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి ఆ దిశగా ముందుకెళ్తున్నాయి. పడిపోతున్న థర్మల్ ఉత్పాదన సామర్థ్యం.. థర్మల్ విద్యుత్ కేంద్రాల విద్యుదుత్పాదన సామర్థ్యంలో తగ్గుదల నమోదు అవుతోంది, ఇందుకు ప్రధాన కారణాల్లో బొగ్గు కొరత ఒకటైతే, స్టేషన్ల బ్యాక్‌డౌన్ (వినియోగం తక్కువగా ఉన్న ప్పుడు లేదా సంప్రదాయేతర ఇంధన విద్యుదుత్పాదన అధికంగా ఉన్నప్పుడు, థర్మల్ కేంద్రాల ఉత్పత్తి నిలిపివేయడం/ తగ్గించడం) మరొకటి. యంత్రాల కాలపరిమితి ముగిసినా అలాగే ఉత్పత్తి చేయడం, బొగ్గులో నాణ్యత లోపించడం వంటి అంశాలతో ఉత్పాదన ఈ సామర్థ్యం తగ్గుతోంది. తాజాగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ప్రకటించిన లెక్కల ప్రకారం 57.69 శాతం విద్యుత్ ప్లాంట్లు మాత్రమే తమ స్థాపిత సామర్థ్యంలో 35 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నాయని, మిగిలిన 42.31 శాతం విద్యుత్ ప్లాంట్లు 35 శాతం కంటే తక్కువ ఫీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)తో నడుస్తున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాల, ప్రభుత్వ రంగ సంస్థల్లోని థర్మల్ కేంద్రాలు మాత్రం ఏకంగా 90% పీఎల్‌ఎఫ్‌తో పనిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వేగంగా.. సంప్రదాయేతర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటులో తెలంగాణ, ఏపీ వేగంగా పురోగతి సాధిస్తున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం ఏపీలో పవన విద్యుత్ 4,096.95 మెగావాట్లు, సౌర విద్యుత్ 4,390.48 మెగావాట్లు, భారీ జల విద్యుత్ ప్రాజెక్టులు1,610 మెగావాట్లు, బయోమాస్ 566 మెగావాట్లు, స్మాల్హైడ్రో 162 మెగావాట్లుగా ఉంది. కాగా తెలంగాణలో 5748 మెగావాట్ల సౌర విద్యుత్, 128 మెగవాట్ల పవన విద్యుత్ , 287 మెగావాట్ల రూఫ్‌టాప్, 2381.76 మెగావాట్ల జల విద్యుత్ ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమలదే సింహభాగం.. పారిశ్రామిక రంగ అభివృద్ధి ముఖ్యంగా విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంది. దేశంలో విద్యుత్ వినియోగంలో సింహభాగం పరిశ్రమల రంగానిదే. అయితే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం తక్కువే. అధికార గణాంకాల ప్రకారం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో పరిశ్రమల రంగానికి 41.36%, గృహావసరాలకు 26.89% , వ్యవసాయానికి 17.99 శాతం, వాణిజ్య అవసరాలకు 7.07% వినియోగిస్తున్నట్లు కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగం దాదాపు 1,255 యూనిట్లుగా ఉంది. -
విద్యుత్ పీపీఏల టారిఫ్: ఇక ఇదే రేటు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. యూనిట్ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్ పవర్ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఇవ్వాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్సీ టారిఫ్ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్సీ.. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. -
ఐనాక్స్ విండ్ రుణరహితం
ముంబై: పబ్లిక్ ఇష్యూ తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పవన విద్యుత్ సొల్యూషన్స్ సంస్థ ఐనాక్స్ విండ్ తాజాగా పేర్కొంది. ఐపీవో చేపట్టేందుకు సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసిన కంపెనీ అనుమతుల కోసం చూస్తోంది. ప్రమోటర్లు కంపెనీకి పెట్టుబడులు అందించనున్నట్లు తెలియజేసింది. వీటితోపాటు.. ఐపీవో నిధులను వెచ్చించడం ద్వారా రుణరహితంగా మారనున్నట్లు వివరించింది. ప్రాస్పెక్టస్ ప్రకారం కంపెనీకి 2022 జూన్‌కల్లా రూ. 1,718 కోట్ల స్థూల రుణ భారం నమోదైంది. రూ. 222 కోట్లమేర నగదు నిల్వలున్నాయి. నికరంగా రూ. 1,495 కోట్ల రుణాలను కలిగి ఉంది. అయితే ప్రయివేట్ ప్లేస్‌మెంట్‌కింద రెండు ప్రమోటర్ సంస్థలు మార్పిడిరహిత బాండ్ల ద్వారా రూ. 800 కోట్లను కంపెనీకి అందించనున్నట్లు ఐనాక్స్ విండ్ తెలియజేసింది. ఐనాక్స్ లీజింగ్ అండ్ ఫైనాన్స్ రూ. 600 కోట్లు, ఐనాక్స్ విండ్ ఎనర్జీ రూ. 200 కోట్లు చొప్పున పంప్చేయనున్నాయి. వీటితోపాటు ఐపీవో నిధులను సైతం రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు ఐనాక్స్ విండ్ వివరించింది. తద్వారా ఐపీవో తదుపరి రుణరహిత కంపెనీగా ఆవిర్భవించే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేసింది. -
సహజ వెలుగులు ప్రసరించాల్సిందే!
సాక్షి, అమరావతి: సహజ వెలుగుల వినియోగాన్ని పెంచడం ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మరోసారి దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర అవసరాలకు వినియోగించే విద్యుత్‌లో దాదాపు 25 శాతం విద్యుత్‌ను సౌర, పవన, జల విద్యుత్ ఉత్పత్తి నుంచే తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు 2022–23కి పునరుత్పాదక కొనుగోలు బాధ్యత (ఆర్పీవో)ను తాజాగా ప్రకటించింది. లక్ష్యాన్ని సాధించలేకపోతే జరిమానా.. గతేడాది 21 శాతంగా ఉన్న ఆర్పీవో అంతకుముందు రెండేళ్లలో వరుసగా 17 శాతం, 19 శాతంగా ఉంది. ఈ లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ వంద శాతం పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా ఏపీతోపాటు గుజరాత్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు మాత్రమే నిర్దేశిత లక్ష్యాలను చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. లక్ష్యానికి తగ్గట్టుగా పునరుత్పాదక విద్యుత్‌ను వినియోగించలేకపోయిన రాష్ట్రాల్లో యూనిట్‌కు 25 పైసల నుంచి 30 పైసల వరకూ తొలి ఏడాది జరిమానా విధించాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత దాన్ని యూనిట్‌కు 35 పైసల నుంచి 50 పైసలకు పెంచాలనుకుంటోంది. ధరలను నిర్ణయించే అధికారం ఈఆర్సీదే.. 2030 చివరి నాటికి ఆర్‌పీవోను 43 శాతానికి పెంచుతామని కేంద్రం వెల్లడించింది. 2023–2030 మధ్య 24.61 శాతం నుంచి 43.33 శాతం వరకు ఆర్‌పీవోను పెంచుకుంటూ వెళ్లనుంది. దీనిలో పవన విద్యుత్ ఆర్పీవో లక్ష్యం.. 0.81–6.94 శాతం. కాగా జల విద్యుత్ 0.35–2.82 శాతం, సౌర విద్యుత్ 23.44–33.57 శాతంగా ఉంటుంది. రాష్ట్రాలు దీనికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. పునరుత్పాదక విదుŠయ్త్ ధరలను కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ) నిర్ణయించనుంది. ఏపీలో ఆర్ఈ సామర్థ్యం 10,826 మెగావాట్లు.. దేశంలో 2040 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఈ ఏడాది చివరి నాటికి 175 గిగావాట్లు పూర్తి చేయాలనుకుంటోంది. కాగా రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ నాటికి పునరుత్పాదక విద్యుత్ (ఆర్ఈ) స్థాపిత సామర్థ్యం దాదాపు 10,826 మెగావాట్లకు చేరింది. దీనిలో 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 3,490.48 మెగావాట్లు సౌర విద్యుత్, 1,610 మెగావాట్లు జల విద్యుత్, 566.04 మెగావాట్లు జీవ(బయో) విద్యుత్, 162.11 మెగావాట్లు చిన్న జల విద్యుత్, ఇతర పునరుత్పాదక విద్యుత్ 900.72 మెగావాట్లు ఉన్నాయి. -
రామ్‌కో సిమెంట్స్ విండ్ఫార్మ్కు అవార్డ్
హైదరాబాద్: రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన విండ్ ఫార్మ్ (పవన విద్యుత్ పార్క్)కు ‘ఉత్తమ పనితీరు చూపిస్తున్న విండ్‌ఫార్మ్’గా విండ్ పవర్ అసోసియేషన్ అవార్డ్ ప్రకటించింది. 2 మెగావాట్ల సామర్థ్యానికి మించిన విభాగంలో ఈ అవార్డ్‌కు ఎంపిక చేసింది. జోన్ 1, జోన్ 2 పరిధిలోని తమిళనాడులో రామ్‌కో సిమెంట్స్‌కు చెందిన పవన విద్యుత్ పార్క్‌లను అవార్డ్‌కు పరిగణనలోకి తీసుకుంది. రామ్‌కో సిమెంట్స్ 1992–93లోనే పర్యా వరణ అనుకూల ఇంధనానికి ప్రాధాన్యత ఇచ్చింది. పవన విద్యుత్ సామర్థ్యం 4 మెగావాట్ల నుండి ఇప్పుడు 166 మెగావాట్లకు చేరింది. రామ్‌కో సిమెంట్స్‌కు ఉన్న మొత్తం క్యాపిటివ్ పవర్లో పునరుత్పాదక ఇంధన వాటా 45 శాతానికి చేరుకుంది. -
రాబోయే రోజుల్లో ఆ రంగంలో 80 వేల మెగావాట్ల విద్యుత్!
బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత సమస్య వేధిస్తోంది. మరోవైపు కర్బణ ఉద్ఘారాలు తగ్గించాలంటూ ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండింటికి విరుగుడుగా కాలుష్య రహితంగా గ్రీన్ ఎనర్జీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోంది. రాబోయే రోజుల్లో 50,000 మెగావాట్ల సోలార్ విద్యుత్, విండ్ పవర్ ద్వారా 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు జర్మన్ ఇంజనీరింగ్ కంపెనీలో చర్చిస్తున్నట్టు తెలిపింది. -
పునరుత్పాదక రంగంలో ఉపాధి వెలుగులు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, వినియోగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయి. వీటి ద్వారా కాలుష్యాన్ని నివారించడమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించవచ్చు. కేవలం పవన విద్యుత్ ద్వారా దేశంలో మిలియన్‌కు పైగా ఉద్యోగాలను సృష్టించవచ్చని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ (జీడబ్యూఈసీ ) తెలిపింది. ‘అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో పవన శక్తి నుండి గ్రీన్ రికవరీ అవకాశాలను సంగ్రహించడం’ అనే అంశంతో విడుదల చేసిన తాజా నివేదికలో ఈ వివరాలను పేర్కొంది. ఇండియా, బ్రెజిల్, మెక్సికో, ఫిలిప్పీన్స్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఈ ఐదు దేశాలూ కోవిడ్ –19 సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ గ్రీన్ రికవరీ చర్యల్లో ఆర్థిక వృద్ధిని సాధించగల పవన విద్యుత్ వనరులను కలిగి ఉన్నాయని వెల్లడించింది. పవన విద్యుత్తులో ఐదు దేశాలు కలిపి 25 ఏళ్లలో 2.23 మిలియన్ ఉద్యోగాలు, దాదాపు 20 గిగావాట్ల అదనపు విద్యుత్ సాధిస్తాయని చెప్పింది. దాదాపు 25 మిలియన్ల గృహాలకు విద్యుత్ అందించవచ్చని వెల్లడించింది. భారత దేశంలో 25 సంవత్సరాల్లో అదనంగా 229 మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా వేసింది. ఏపీ సామర్ధ్యం 10,785.51 మెగావాట్లు దేశంలో నూతన, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 1,56,347.45 మెగావాట్లు. ఏపీలో పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 162.11 మెగావాట్లు చిన్న జలశక్తి వనరుల ద్వారా, 1,610 మెగావాట్లు పెద్ద జలశక్తి వనరుల ద్వారా, 4,096.65 మెగావాట్లు పవన విద్యుత్, 536.04 మెగావాట్లు బయో విద్యుత్, 4,380.71 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉన్నాయి. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. దీని ద్వారా పునరుత్పాదక వనరుల విద్యుత్‌ను ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణలో ఏపీ భాగమవుతోంది. ప్రభుత్వాల ఉమ్మడి చర్యలు శిలాజయేతర ఇంధన వనరుల నుండి 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ఆటోమేటిక్ రూట్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను అనుమతిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త ట్రాన్స్మిషన్ లైన్లు వేయడం, కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం వంటి చర్యలు చేపట్టింది. సౌర, పవన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు అమ్మడానికి కేంద్రం 2025 జూన్ 30 వరకూ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎస్టీఎస్) చార్జీలు మినహాయింపు ఇచ్చింది. ఏపీ తీసుకునే సోలార్ విద్యుత్‌కు కూడా ఐఎస్టీఎస్ చార్జీల మినహాయింపు వర్తించనుంది. ఈ చర్యలతో పునరుత్పాదక రంగం బలపడి, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. -
పవన, సౌర విద్యుత్ ధరలపై తుది విచారణ ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన పవన విద్యుత్ యూనిట్‌కు రూ.2.43, సౌర విద్యుత్‌కు రూ.2.44 చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై కంపెనీలు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం తుది విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఆయా కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాదులు సి.వైద్యనాథన్, బసవ ప్రభుపాటిల్, సజన్ పూవయ్య, పి.శ్రీరఘురాం, చల్లా గుణరంజన్ తదితరులు వాదనలు వినిపించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన గతంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సవరించడం సరికాదని నివేదించారు. ఒప్పందాలు ప్రభుత్వాలతో జరుగుతాయే తప్ప రాజకీయ పార్టీలతో కాదన్నారు. పీపీఏల విషయంలో ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని, ప్రభుత్వాల జోక్యాన్ని నివారించేందుకు విద్యుత్ చట్టంలో స్పష్టమైన నిబంధనలు పొందుపరిచారని తెలిపారు. చట్టబద్ధంగా, పారదర్శకంగా పీపీఏలు జరిగాయని చెప్పారు. విద్యుత్ పంపిణీ సంస్థల తరఫున రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పీపీఏలో పేర్కొన్న ధరలను సమీక్షించే అధికారం ఏపీఈఆర్సీకి ఉందని వివరించారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ధర్మాసనం మంగళవారానికి వాయిదా వేసింది. -
Sailcargo: ఈ నౌకకు ఇంధనం అక్కరలేదట! కేవలం గాలితోనే...
చిన్న చిన్న పడవలైతే గాలివాలుకు అలా ముందుకు సాగిపోతాయి గాని, భారీ నౌకలు సముద్రంలో ముందుకు సాగాలంటే ఇంధనం కావాలి కదా! కేవలం గాలితో ఇంత పెద్ద నౌక సముద్రంలో ఎలా ప్రయాణం సాగించగలుగుతుందనేగా మీ అనుమానం? ఇందులో అణుమాత్రమైనా అనుమానానికి ఆస్కారం లేదు. ఫొటోలో కనిపిస్తున్న ఈ నౌక పూర్తిగా గాలి ఆధారంగానే నడుస్తుంది. కెనడాకు చెందిన ‘కేఫ్ విలియమ్’ తన అంతర్జాతీయ కాఫీ రవాణా కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ నౌక పూర్తిగా పవనశక్తినే ఇంధనంగా మార్చుకుని, సముద్రంలో ప్రయాణిస్తుంది. ‘కేఫ్ విలియమ్’ కోసం ‘సెయిల్ కార్గో’ సంస్థ ఈ నౌకను ప్రత్యేకంగా రూపొందించింది. ఈ నౌక 2023లో తొలి సముద్రయానం చేయనుంది. చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
గత సర్కారు పాపం.. డిస్కమ్‌లకు శాపం
సాక్షి, అమరావతి: ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు విద్యుత్ సంస్థలకు శాపంగా మారింది. అవసరం లేకున్నా విద్యుత్ తీసుకోవడం ఒకటైతే, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ చెల్లిస్తూ ఒప్పందాలు చేసుకోవడం మరో కోణం. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ కూడా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల–పీపీఏల) విషయంలో ఇదే తేల్చి చెప్పింది. 2014–19 మధ్య జరిగిన ఒప్పందాలన్నీ డిస్కమ్‌లను నిలువునా అప్పులపాలు చేసే విధంగానే ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజాధనాన్ని కొంతమందికి కట్టబెట్టే ఈ విధానంపై పునఃసమీక్ష అవసరమని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తొలిరోజుల్లోనే భావించింది. రాష్ట్రంలో 2015 వరకు 91 పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలున్నాయి. వాటి సామర్థ్యం కేవలం 691.55 మెగావాట్లు. కానీ ఆ తర్వాత 2019 వరకు ఏకంగా 3,494 మెగావాట్ల సామర్థ్యంగల 133 ఒప్పందాలు జరిగాయి. అంతకుముందు గరిష్టంగా యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే.. 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారు. 25 ఏళ్లపాటు అమల్లో ఉండేలా జరిగిన ఈ పీపీఏల వల్ల డిస్కమ్‌లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలి. సోలార్ విద్యుత్ విషయంలోనూ ఇదేవిధంగా కొనసాగింది. 2014 వరకు రూ.384 కోట్ల విలువ చేసే 92 మెగావాట్ల మేరకు 11 పీపీఏలు ఉండేవి. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 పీపీఏలు జరిగాయి. వీటివిలువ రూ.22,868 కోట్లు. ఫలితంగా ఇప్పటికీ పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు పెద్ద మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. ఎక్కడా లేని ధర 2015–19 మధ్య ప్రైవేటు పవన, సౌరవిద్యుత్ ఉత్పత్తిదారులకు అప్పటి ప్రభుత్వం ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడలేదు. వాళ్లనుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు అందాయన్న ఆరోపణలు వచ్చినా లెక్కజేయలేదు. 2014లో సోలార్ విద్యుత్‌ను యూనిట్ రూ.6.99 ధరతో పీపీఏ చేసుకుంది. ఇదే సమయంలో పంజాబ్ యూనిట్ రూ.6.88 ధరకి పీపీఏ చేసుకుంది. 2016లో సోలార్ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయి. అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్ ధర రూ.6.80. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్ రూ.4.66 ధరతో నెడ్‌క్యాప్, జెన్కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుంది. ఆ తర్వాత కాలంలోఅన్ని రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ.2కు పడిపోయినా మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్నిబట్టి వీటివెనుక రాజకీయ కారణాలున్నాయనే విమర్శలొచ్చాయి. పవన విద్యుత్ పీపీఏల విషయానికొస్తే 2014లో అన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.50 ఉంటే.. మన రాష్ట్రంలో రూ.4.83 చొప్పున జరిగాయి. తమిళనాడు, గుజరాత్, మరికొన్ని రాష్ట్రాల్లో యూనిట్ రూ.3.46 కొనసాగినా.. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యూనిట్‌కు రూ.4.84తోనే ఒప్పందాలు చేసుకుంది. ఈ విధంగా ప్రైవేటు పట్ల అపరిమిత ప్రేమ చూపించడం వల్ల.. ఇప్పుడు డిస్కమ్‌లు ఆర్థికభారంతో కుంగిపోయే పరిస్థితి ఏర్పడింది. -
భరోసా ఉంటేనే.. పవన, సౌర విద్యుత్ ఒప్పందాలు
సాక్షి, అమరావతి: పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై డిస్కమ్‌లకు మరింత భద్రత కల్పిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం అవసరమైన విద్యుత్ ఇవ్వగలిగే శక్తి ఉన్న సంస్థతోనే ఒప్పందాలు చేసుకోవాలని స్పష్టం చేసింది. భవిష్యత్‌లో జరిగే పీపీఏలన్నింటికీ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది. ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు పంపిన ఈ మార్గదర్శకాలను ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదివారం మీడియాకు వివరించారు. ఇవీ నిబంధనలు! ► పునరుత్పాదక ఇంధన వనరులైన పవన, సౌర విద్యుత్‌ను పోటీ బిడ్డింగ్ ద్వారానే డిస్కమ్‌లు తీసుకోవాలి. వీటితో 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవచ్చు. ► పవన, సౌర విద్యుత్‌నే డిస్కమ్‌లు పూర్తిగా నమ్ముకుంటే గాలి తగ్గినప్పుడు, సూర్యరశ్మి లేనపుడు సమస్యలొస్తున్నాయి. ఉత్పత్తి తగ్గి షెడ్యూల్ ప్రకారం విద్యుత్ అందకపోతే అప్పటికప్పుడు మార్కెట్లో విద్యుత్ కొనుగోలు సవాల్‌గా మారుతోంది. ► పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి లభ్యతను శాస్త్రీయంగా అంచనా వేయలేకపోతున్నారు. అందువల్ల వీటి మీదే నమ్మకం పెట్టుకోవద్దని కేంద్రం సూచించింది. పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థలు పీపీఏ ప్రకారం 85 శాతం విద్యుత్ ఉత్పత్తిని కచ్చితంగా చేయాల్సిందే. పీక్ అవర్స్‌లో కూడా విద్యుత్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలో 49 శాతం సంప్రదాయ విద్యుత్‌ను అందించాలి. ► 51 శాతం పునరుత్పాదక ఇంధనం, 49 శాతం «థర్మల్, జల, ఇతరాలు విద్యుత్ ఇస్తామన్న భరోసా ఇస్తేనే పీపీఏ చేసుకోవాలి. ► ఎక్కడి నుంచి సంప్రదాయ విద్యుత్ తీసుకుంటున్నారో పీపీఏ సమయంలో అంగీకారంతో పొందుపర్చాలి. ఇలాంటి పీపీఏలకు లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్సీ) కూడా డిస్కమ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే...? ► గ్రీన్ ఎనర్జీలో భాగంగా సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరులను విధిగా తీసుకోవాలని కేంద్రం 2015లోనే అన్ని రాష్ట్రాలకూ షరతులు పెట్టింది. ఈ టార్గెట్‌ను ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దాటింది. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ లభ్యతలో పవన, సౌర విద్యుత్ వాటా 50 శాతం వరకూ ఉంటోంది. ► అయితే, ప్రకృతి అనుకూలించకపోవడంతో ఒక్కసారిగా విద్యుత్ ఉత్పత్తి పడిపోతోంది. అప్పటికప్పుడు థర్మల్ విద్యుత్‌ను అందుబాటులోకి తేలేకపోతున్నారు. ఈ సమయంలో మార్కెట్లో ఎక్కువ ధరకు విద్యుత్ తీసుకోవడంతో డిస్కమ్‌లపై అధిక భారం పడుతోంది. ఇక మీదట పీపీఏ చేసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి విద్యుత్ సంస్థలు బయటపడొచ్చు. -
అవసరానికి మించి కొనుగోలు చేశారు
సాక్షి, అమరావతి: అవసరానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్ల వల్ల విద్యుత్ పంపిణీ సంస్థలు నష్టపోతాయని గతంలోనే డిస్కమ్‌లు స్పష్టంగా చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ భారం వినియోగదారులపైనే పడుతుందని తొలిదశలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టు, అయినప్పటికీ వీటిని అనుమతించడం వల్లే పంపిణీ సంస్థలు ఈ ఐదేళ్లలో భారీగా నష్టాన్ని మూటగట్టుకున్నాయని వివరించారు. రాష్ట్ర విద్యుత్‌రంగ పరిస్థితిపై ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి బుధవారం హైదరాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష చేశారు. విద్యుత్ సంస్థల ఆర్థిక స్థితి, ఉత్పత్తి, విద్యుత్ డిమాండ్, విద్యుత్ కొనుగోళ్ల గురించి ఆయనకు విద్యుత్ అధికారులు వివరించారు. కేంద్రం పెట్టిన లక్ష్యానికి మించి పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లు జరిగాయంటూ.. 2015–16లో 5 శాతం లక్ష్యమైతే 5.59 శాతం, 2016–17లో 8.6 శాతం కొనుగోలు చేశారని, 2017–18లో 9 శాతం తీసుకోవాల్సి ఉంటే 19 శాతం తీసుకున్నారని, 2018–19లో 11 శాతం లక్ష్యానికిగాను ఏకంగా 23.4 శాతం ప్రైవేటు పవన, సౌర విద్యుత్ తీసుకున్నారని తెలిపారు. దీనివల్ల 2015–16 నుంచి 2018–19 నాటికి విద్యుత్ సంస్థలపై రూ.5,497 కోట్ల అధిక భారం పడిందన్నారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలు(ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌లు) రూ.65 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయన్నారు. 2016–17లో అధిక రేట్లకు 10,478 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారని, చౌకగా లభించే థర్మల్ విద్యుదుత్పత్తిని 2017–18లో 12,014 మిలియన్ యూనిట్లు, 2018–19లో 7,628 మిలియన్ యూనిట్ల మేరకు తగ్గించినందువల్ల విద్యుత్ సంస్థలకు నష్టం వాటిల్లిందంటూ.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాన్ని ఏపీఈఆర్సీ ముందు పెట్టారు. గడచిన ఐదేళ్లలో కమిషన్ అనుమతించిన దానికన్నా అధికంగా విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని, ఆ మొత్తాన్ని(ట్రూ–అప్) కమిషన్‌కు సమర్పించలేదని, ఈ లోటును పూడ్చడానికి అడ్డగోలుగా అప్పులు చేసిన విషయాన్ని వారు వివరించారు. పవన, సౌర విద్యుత్ కొనుగోళ్లపై సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని కమిషన్ చైర్మన్ ఆదేశించినట్టు అధికారవర్గాలు చెప్పాయి. అవినీతిని అరికట్టాలి ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి విద్యుత్ పంపిణీ సంస్థల్లో అవినీతికి కళ్లెం వేయాలని డిస్కమ్‌ల సీఎండీలకు ఏపీఈఆర్సీ చైర్మన్ నాగార్జునరెడ్డి సూచించారు. గ్రీవెన్స్ సెల్‌కు వస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, పురోగతిని వివరించాలని కోరారు. విద్యుత్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలన్నారు. కమిషన్ పెట్టిన పరిమితికి మించి అయ్యే ఖర్చు(ట్రూ ఆప్)ను ఎప్పటికప్పుడు ఏపీఈఆర్సీకి సమర్పించాలన్నారు. విద్యుత్‌రంగ వాస్తవ పరిస్థితిని ఏపీఈఆర్సీ దృష్టికి తీసుకెళ్లామని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి తెలిపారు. రాష్ట్ర విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశాన్ని జనవరిలో నిర్వహించాలని, ఇకపై ప్రతీ మూడు నెలలకోసారి ఈ భేటీని ఏర్పాటు చేయాలని కమిషన్ చైర్మన్ సూచించినట్టు చెప్పారు. రబీ సీజన్, వేసవిలో వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌ను చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారన్నారు. సమావేశంలో ఏపీఈఆర్సీ సభ్యులు రఘు, రామ్మోహన్, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు, తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థల సీఎండీలు నాగలక్ష్మి, హరినాథ్ పాల్గొన్నారు. -
పవన విద్యుత్తే ప్రత్యామ్నాయం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోని వాతావరణంలో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గించడంతోపాటు ప్రపంచానికి సరిపడిదానికన్నా ఎక్కువ విద్యుత్‌ను పవన విద్యుత్ ద్వారా అందించవచ్చని ఓ అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. పవన విద్యుత్‌ను ప్రోత్సహించడం ద్వారా ఏటా ఐదువందల నుంచి ఏడు వందల కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపి వేసినప్పటికీ ఒక్క పవన విద్యుత్ ద్వారా ప్రపంచ విద్యుత్ అవసరాలను తీర్చవచ్చని ‘అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ)’ పరిశోధకలు అభిప్రాయపడ్డారు. శిలాజ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాల వల్ల ఈ శతాబ్దాంతానికి పెరుగుతున్న భూవాతావరం ఉష్ణోగ్రతను రెండు శాతం దిగువకు తీసుకరావాలన్న ప్రపంచ లక్ష్యాన్ని కూడా ఈ పవన విద్యుత్ వల్ల సాధించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. పవన్ విద్యుత్‌లో స్థాపించే ఖర్చును తగ్గించుకొని విండ్ టర్బైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకునే అవకాశం ఎంతో ఉందని వారు చెబుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 0.3 శాతాన్ని మాత్రమే సముద్రంలో ఏర్పాటు చేసిన పవన విద్యుత్ స్తంభాల వల్ల ఉత్పత్తి చేస్తున్నామని, దీన్ని మరెంతో పెంచుకునే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రానున్న రెండు శతాబ్దాల్లో దీన్ని 15 రెట్లు పెంచుకున్నట్లయితే ఆ పవన విద్యుత్ పరిశ్రమ వ్యాపారాన్ని లక్ష కోట్ల డాలర్లకు తీసుకెళ్లవచ్చని వారు వెల్లడించారు.